
Taliban Permission to Afghanistan ODI Series: అసలే వాళ్లు రక్తం తాగే రాక్షసులు.. దేశంలో ఆడవారి స్వేచ్ఛను అస్సలు సహించరు.. క్రీడలు.. పార్కులు.. ఎంజాయ్ మెంట్ అంటనే కరుడుగట్టిన తాలిబన్లకు అస్సలు పడదు.. అప్ఘనిస్తాన్ ను హస్తగతం చేసుకోగానే అన్నింటిపై నిషేధం విధించిన తాలిబన్ల మూక.. ప్రజలకు మాత్రం క్షమాభిక్ష పెట్టింది. పెట్టిన మూడు రోజులకే ర్యాలీ తీస్తున్న జనాలపై కాల్పులు జరిపింది. దీంతో అప్ఘన్ లో తాలిబన్లది రాక్షస పాలనే అని అందరూ అనుకున్నారు.
కానీ తాలిబన్లు అప్ఘనిస్తాన్ లో గద్దెనెక్కడంలో తెరవెనుక కీలక పాత్ర పోషించిన పాకిస్తాన్ కోరికను మాత్రం తాలిబన్లు అంగీకరించారు. వారు తీవ్రంగా వ్యతిరేకించే క్రికెట్ ను కొనసాగించడానికి సై అన్నారు. అప్ఘనిస్తాన్ క్రికెటర్లను పాకిస్తాన్ తో వన్డే సిరీస్ ఆడడానికి పంపుతున్నారు.
తాజాగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) సంచలన నిర్ణయం తీసుకుంది. అప్ఘనిస్తాన్ తో జరిగే మూడు వన్డేల సిరీస్ కు తాలిబన్లు ఒప్పుకున్నట్లు ప్రకటించి అందరినీ షాక్ కు గురిచేసింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే సిరీస్ యథావిధిగా కొనసాగుతుందని తెలుపడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
సెప్టెంబర్ 1 నుంచి 5 వరకు శ్రీలంకలోని హంబన్ తోట వేదికగా పాకిస్తాన్, అప్ఘనిస్తాన్ మధ్య మూడు వన్డేల సిరీస్ జరగాల్సి ఉంది. తాలిబన్లు మొదటి నుంచి క్రికెట్ కు వ్యతిరేకులగా ఉండడంతో ఇది సాధ్యం కాదని అనిపించింది. కానీ పాకిస్తాన్ తో వన్డే సిరీస్ నిర్వహణకు తాలిబన్ల నుంచి అనూహ్యంగా మద్దతు లభించడం చూసి క్రికెట్ ప్రపంచం మొత్తం అవాక్కైంది.
కాగా అక్టోబర్ లో జరిగే టీ20 ప్రపంచకప్ లో అప్ఘనిస్తాన్ జట్టు పాల్గొంటుందా? లేదా? అన్నది అనుమానంగా మారింది. అప్ఘన్ లో నెలకొన్న అనిశ్చితి పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశ క్రికెటర్ల భవిష్యత్తు గందరగోళంలో పడింది. ఈ క్రమంలోనే తాలిబన్లు ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారన్న ఉత్కంఠ నెలకొంది.