Pakistan Super League: భారత్ ఉగ్రవాద స్థావరాలపై చేసిన దాడుల వల్ల పాకిస్తాన్ సూపర్ లీగ్ ఆగిపోయింది. ఉగ్రవాదులపై దాడులు చేస్తే.. పాకిస్తాన్ భారతదేశంపై కవ్వింపు చర్యలకు దిగింది. సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి.. కాల్పులకు తెగబడింది. దీంతో దాయాది దేశానికి బుద్ధి చెప్పడానికి భారత్ ఎదురుదాడికి దిగింది. శత్రుదేశంలోని ప్రధాన నగరాలలో భారత్ కౌంటర్ ఎటాక్ కు పాల్పడటంతో.. భద్రత దృష్ట్యా.. విదేశీ ఆటగాళ్ల విజ్ఞప్తి దృష్టిలో పెట్టుకొని పీఎస్ఎల్ ను నిలుపుదల చేశారు. ఈ సీజన్ లో మిగతా మ్యాచ్లను దుబాయ్ కేంద్రంగా జరపడానికి ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి వివరాలు కూడా వెల్లడించారు. అయితే ఇప్పుడు పి ఎస్ ఎల్ ను నిర్వహించడానికి యూఏఈ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) ఒప్పుకోలేదని తెలుస్తోంది.. దీనికి సంబంధించి జాతీయ మీడియాలో ప్రముఖంగా వార్తలు ప్రచారం అవుతున్నాయి. “ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు కు అత్యంత సన్నిహితంగా ఉండే వర్గాలు ఒక కీలక విషయాన్ని వెల్లడించాయి. భారత్ – పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తత నేపథ్యంలో పి ఎస్ ఎల్ ను నిర్వహించడానికి యూఏఈ ఒప్పుకోవడం లేదు. మొత్తంగా చూస్తే ఈ టోర్నీ నిలిచిపోయే అవకాశం కనిపిస్తుందని” ప్రఖ్యాత న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ పేర్కొంది.
Also Read: మీ వల్లే మేమిలా.. సైన్యానికి విరాట్ కోహ్లీ హాట్సాఫ్!
తెర వెనుక ఎవరి మంత్రాంగం
పిఎస్ఎల్ నిర్వహించడానికి యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ ముందుకు రాకపోవడానికి ప్రధాన కారణం ఐసీసీ అధ్యక్షుడు జైషా అని తెలుస్తోంది. భారతదేశంపై దాడులకు పాల్పడుతున్న శత్రుదేశానికి ఈ విధంగా కూడా బుద్ధి చెప్పాలని జై షా అనుకున్నారని.. అందువల్లే తెర వెనుక మంత్రాంగం నడిపించారని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.. భారత్ చేసిన ప్రతిదాడుల నేపథ్యంలో పిఎస్ఎల్ లో ఆడుతున్న విదేశీ ఆటగాళ్లు దాయాది దేశంలో ఉండడానికి నిరాకరించారని తెలుస్తోంది. అందువల్లే పిఎస్ఎల్ ను దుబాయ్ లో నిర్వహించడానికి పీసీబీ నిర్ణయం తీసుకుంది. కానీ భారత చేసిన కౌంటర్ అటాక్స్ వల్ల పి సి బి తలవంచక తప్పలేదు. చివరికి దుబాయ్ లో టోర్నీ నిర్వహించడానికి ఏర్పాట్లు చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. పిఎస్ఎల్ ను దుబాయ్ లో కనుక నిర్వహిస్తే.. భారతదేశానికి వ్యతిరేకంగా వ్యవహరించినట్టు అవుతుందని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ భావించింది. అందులో భాగంగానే పి ఎస్ ఎల్ నిర్వహించలేమని ముఖం మీద తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది. మరోవైపు ఇటీవల ఐసీసీ నిర్వహించిన ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ తన మ్యాచ్లను దుబాయ్ వేదికగా ఆడింది. అంతే తప్ప శత్రు దేశానికి వెళ్లలేదు. నాడు భారత్ ఆడాల్సిన మ్యాచ్లకు దుబాయ్ సగర్వంగా ఆతిథ్యం ఇచ్చింది. భారత్ ఆడిన మ్యాచ్లకు దుబాయ్ నగరానికి భారీగా భారత అభిమానులు పోటెత్తడం విశేషం.