India vs Pakistan Final 2022: 2007 టీ20 తొలి వరల్డ్ కప్ లో ధోని సారథ్యంలోని టీమిండియా గ్రూప్ దశలో పాకిస్తాన్ ను ఓడించి.. చివరకు ఫైనల్ లోనూ నాటకీయ పరిణామాల మధ్య దాయాది జట్టును ఓడించి విశ్వవిజేతగా ఆవిర్భవించింది. ఇప్పుడు సేమ్ అలాంటి వాతావరణమే చోటుచేసుకుంది. ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లో తొలి మ్యాచ్ లోనే పాకిస్తాన్ ను ఓడించిన టీమిండియా ఇప్పుడు సెమీస్ చేరింది. ఇక సెమీస్ చేరాల్సిన దక్షిణాఫ్రికా ఇటీవల నెదర్లాండ్ చేతిలో ఓడి చేజేతులారా పాకిస్తాన్ ను సెమీస్ రేసులోకి నెట్టింది.

ఆ ఊపును కంటిన్యూ చేస్తూ ఏకంగా బలమైన న్యూజిలాండ్ ను సెమీస్ లో ఓడించి సంచలనం రేపింది పాకిస్తాన్. లీగ్ దశలో భారత్, జింబాబ్వే చేతిలో ఓడిన పాకిస్తాన్ పుంజుకున్న తీరు నిజంగానే అద్భుతమని చెప్పాలి. భారత్ చేతిలో ఓడిపోగానే పాకిస్తాన్ ను వాళ్ల అభిమానులు, పాక్ మాజీ క్రికెటర్లు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. కానీ కాలం కలిసి వచ్చి సెమీస్ చేరిన పాకిస్తాన్ విశ్వరూపం ప్రదర్శించింది. చివరి లీగ్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ ను చిత్తు చేసి రెట్టించిన ఉత్సాహంతో వచ్చిన పాక్ సెమీస్ లో ఏకంగా న్యూజిలాండ్ ను చిత్తుగా ఓడించింది.
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ 20 ఓవర్లలో 152 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు.న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్ ను పరుగులు చేయకుండా కట్టడి చేశారు. దీంతో పరుగులు చేయడానికి తండ్లాడిన న్యూజిలాండ్ తక్కువకే పరిమితమైంది.
ఇక అనంతరం 153 పరుగుల లక్ష్య చేధనకు బరిలోకి దిగిన పాకిస్తాన్ కు ఓపెనర్లు రిజ్వాన్, బాబర్ లు చెరో ఆఫ్ సెంచరీతో కదం తొక్కి ఈజీగా మ్యాచ్ ను గెలిపించారు.

2007 టీ20 వరల్డ్ కప్ లోనూ ఇండియా, పాకిస్తాన్ జట్లు సెమీస్ చేరాయి. నాడు తొలి సెమీ ఫైనల్ లో ఇదే న్యూజిలాండ్ ను పాకిస్తాన్ ఓడించడం విశేషం. ఇక రెండో సెమీస్ లో ఆస్ట్రేలియాను టీమిండియా ఓడించి ఫైనల్ చేరింది. ఫైనల్ లో పాకిస్తాన్ ను ఓడించి టీ20 తొలి కప్ గెలిచింది.
ఇక ఈ సంవత్సరం మనకు సెమీస్ లో ఇంగ్లండ్ ఎదురుపడింది. పాకిస్తాన్ ఈజీగా గెలిచి ఫైనల్ చేరగా.. రేపు బలమైన ఇంగ్లండ్ ను టీమిండియా కనుక ఓడిస్తే ఫైనల్ లో పాకిస్తాన్ ను మరోసారి ఢీకొట్టడం ఖాయం. మరి 2007 చరిత్ర పునరావృతం అవుతుందా? టీమిండియా ఫైనల్ చేరుతుందా? రేపు కనుక గెలిస్తే మరోసారి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఫైనల్ గూస్ బాంబ్స్ తెప్పించడం ఖాయం. అది రావాలని.. రేపు టీమిండియా గెలవాలని అందరం కోరుకుందాం.. ఫైనల్ లో పాక్ ను మరోసారి చిత్తు చేసి టీ20 కప్ కొట్టాలని ఆశిద్ధాం. ఆల్ ది బెస్ట్ టీమిండియా..