Nitish Kumar Reddy: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా బాక్సింగ్ డే టెస్ట్ లో సెంచరీ చేసి టీమ్ ఇండియాను సురక్షిత స్థానం వైపు తీసుకెళ్లాడు నితీష్ కుమార్ రెడ్డి.. వాషింగ్టన్ సుందర్ తో అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పిన అతడు.. సూపర్ సెంచరీ తో అదరగొట్టాడు. తన వ్యక్తిగత స్కోర్ 99 పరుగుల వద్ద ఉన్నప్పుడు … అప్పటిదాకా తోడుగా నిలిచిన భాగస్వామి వాషింగ్టన్ సుందర్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన బుమ్రా మూడు బంతులు మాత్రమే ఎదుర్కొని పెవిలియన్ చేరుకున్నాడు. మరో వైపు ప్రమాదకరమైన కమిన్స్ బౌలింగ్ వేస్తున్నాడు.. బ్యాటింగ్లో అంతగా అనుభవం లేని సిరాజ్ క్రీజ్ లోకి వచ్చాడు.. ఈ దశలో సిరాజ్ సహకరిస్తాడా? నితీష్ కుమార్ రెడ్డికి సెంచరీ చేసే భాగ్యం కల్పిస్తాడా? అనే ప్రశ్నలు అందరి మదిని తొలవడం మొదలుపెట్టాయి. అయితే ఈ క్రమంలో కమిన్స్ వేసిన మూడు బంతులను సిరాజ్ ధైర్యంగా ఎదుర్కొన్నాడు. దీంతో తర్వాతి ఓవర్లో స్ట్రైకర్ గా నితీష్ కుమార్ రెడ్డికి అవకాశం వచ్చింది. దీంతో అతడు వెంటనే వచ్చిన అవకాశాన్ని ఏమాత్రం వదులుకోకుండా సూపర్ షాట్ తో బంతిని బౌండరీ వైపు మళ్ళించాడు. అంతే స్టేడియం మొత్తం కేరింతలు.. డ్రెస్సింగ్ రూమ్ లో చప్పట్లు..
రవి శాస్త్రి ఏడ్చాడు
తన కుమారుడు సెంచరీ చేయడంతో నితీష్ కుమార్ రెడ్డి తండ్రి ముత్యాల రెడ్డి కన్నీటి పర్యంతమయ్యాడు. తన త్యాగానికి సార్థకం లభించిందని భావించాడు. కుమారుడు సెంచరీ చేయగానే రెండు చేతులను పైకి లేపి సాధించాం అన్నట్టుగా విక్టరీ సింబల్ ను చూపించాడు ముత్యాల రెడ్డి. ఇక కామెంట్రీ బాక్స్ లో ఉన్న టీమిండియా లెజెండరీ క్రికెటర్, మాజీ కోచ్ రవి శాస్త్రి అయితే ఏడ్చేశాడు. ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకోలేక.. భావోద్వేగానికి గురయ్యాడు.. ” అతడు సాధించాడు. అతడు సెంచరీ చేస్తే నా కళ్ళల్లో కన్నీళ్లు వస్తున్నాయి. మెల్బోర్న్ మైదానంలో అతడు సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇది చాలా కాలం వరకు నిలిచిపోతుంది. ఎందుకంటే ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి ఈ స్థాయి ఘనత సాధించడం మామూలు విషయం కాదు. ఆస్ట్రేలియా బౌలర్లను ఎదుర్కొంటూ ఇంతలా పరుగులు తీయడం అంటే సులభం కాదని” రవి శాస్త్రి వ్యాఖ్యానించాడు. ” తన కుమారుడి కోసం ముత్యాల రెడ్డి తన ఉద్యోగానికి 25 ఏళ్ల ముందుగానే వాలంటరీ రిటైర్మెంట్ ప్రకటించారు. తన కుమారుడు తన కళ్ళముందు గొప్పగా పేరు తెచ్చుకుంటే భావోద్వేగానికి గురవుతున్నారు. ఒక తండ్రికి ఇంతకంటే కావాల్సింది ఏముంది.. ఈ దృశ్యాన్ని చూసి గుండె బరువెక్కుతోందని” రవి శాస్త్రి పేర్కొన్నాడు. అయితే నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ చేయాలని ప్రత్యర్థి జట్టు బౌలర్లు కూడా కోరుకోవడం ఇక్కడ గమనార్హం. ఇక నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ చేసిన తాలూకు దృశ్యాలతో స్టార్ స్పోర్ట్స్ ఒక వీడియోను రూపొందించింది. అది ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో సంచలనంగా మారింది.