Dipendra Singh Ayiri : బంతి వేయడమే ఆలస్యం.. బ్యాటర్ తాండవం చేశాడు. ఫీల్డర్లను కష్టపెట్టలేదు. మరో మాటకు తావివ్వలేదు.. దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. మైదానాన్ని హోరెత్తించాడు. “మిస్టర్ 360” మాదిరి మైదానం నలుమూలలా బంతిని గాల్లోకి లేపి స్టాండ్స్ లో ల్యాండ్ చేశాడు. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టాడు. ఈ అరుదైన ఘనతను నేపాల్ క్రికెటర్ దీపేంద్ర సింగ్ అయిరీ సాధించాడు. ఒకే ఓవర్ లో 6 సిక్స్ లు కొట్టి తన పేరు మీద కొత్త రికార్డు సృష్టించుకున్నాడు. ఖతార్ తో జరిగిన టి20 మ్యాచ్ లో.. ఈ నేపాల్ బ్యాటర్ అరుదైన ఘనత సాధించాడు..ఖతార్ పేస్ బౌలర్ కమ్రాన్ ఖాన్ బౌలింగ్ లో ఆరు సిక్సర్లు కొట్టి అంతర్జాతీయ టీ – 20 ల్లో ఈ ఘనత సాధించిన మూడో క్రికెటర్ గా చరిత్ర సృష్టించాడు.
దీపేంద్ర సింగ్ ఈ మ్యాచ్ లో 21 బంతుల్లో 64 పరుగులు చేశాడు. దీపేంద్ర సింగ్ చేసిన బ్యాటింగ్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాదు టి20 లో అత్యంత వేగంగా అర్ధ సెంచరీ నమోదు చేసిన ఘనత దీపేంద్ర సింగ్ పేరు మీదనే ఉండడం విశేషం. గత ఏడాది చైనా వేదికగా జరిగిన ఏషియన్ గేమ్స్ లో దీపేంద్ర సింగ్ మంగోలియాతో జరిగిన మ్యాచ్ లో 9 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తి చేశాడు. తద్వారా యువరాజ్ సింగ్ రికార్డును బద్దలు కొట్టాడు. టి20 లో యువరాజ్ సింగ్ కేవలం 12 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తి చేశాడు. ఇంగ్లాండ్ తో జరిగిన టి20 మ్యాచ్లో యువరాజ్ సింగ్ ఈ ఘనత సాధించాడు. స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్ లో వరుసగా ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టి అప్పట్లో సరికొత్త చరిత్రను సృష్టించాడు.
యువరాజ్ సింగ్ కంటే ముందు 1968 లో సర్ గార్బిల్డ్ సోబర్స్ కౌంటీ క్రికెట్ లో మాల్కం నాష్ బౌలింగ్ లో వరుసగా ఆరు సిక్సర్లు కొట్టాడు. 1985లో రంజీ ట్రోఫీలో ముంబై ఆటగాడు రవి శాస్త్రి బరోడా బౌలర్ తిలక్ రాజ్ బౌలింగ్ లో వరుసగా ఆరు సిక్సర్లు కొట్టాడు. 2007లో ప్రపంచ కప్ లో నెదర్లాండ్ బౌలర్ డాన్ వాన్ బంగే బౌలింగ్ లో.. దక్షిణాఫ్రికా బ్యాటర్ హర్షల్ గిబ్స్ ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టాడు. 2007లో టి20 వరల్డ్ కప్ లో ఇండియన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఇంగ్లాండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్ లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టి సరికొత్త చరిత్ర సృష్టించాడు. 2014లో వోర్ సెస్టర్ రాపిడ్స్ ఆటగాడు రాస్ వైట్లి యార్క్ షైర్ వైకింగ్స్ జట్టుతో జరిగిన టి20 మ్యాచ్ లో 6 సిక్సర్లు కొట్టాడు. తాజాగా నేపాల్ బ్యాటర్ దీపేంద్ర సింగ్ ఖతార్ జట్టుతో జరిగిన టి20 మ్యాచ్ లో వరసగా ఆరు సిక్సర్లు కొట్టి ఈ ఘనత సాధించాడు.
Dipendra Singh Airee has etched his name in cricketing history with his extraordinary display of batting prowess, hitting six sixes on six balls. Well done#NepvQAT
6️⃣6️⃣6️⃣6️⃣6️⃣6️⃣
AI Amerat Cricket Ground, Oman Cricket pic.twitter.com/PHHmmDAAdl— Basanta Ghimire (@basantaplp) April 13, 2024