MI vs RR : ఆడుతోంది ముంబై జట్టేనా? లేకుంటే ఏదైనా ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతోందా? చూస్తున్నది నిజమేనా? ఇదీ సోమవారం ముంబై జట్టు బ్యాటింగ్ చూసిన తర్వాత సగటు అభిమాని దుస్థితి. హిట్ మాన్ సొంత మైదానంలో 0 పరుగులకు అవుట్ అయ్యాడు. నమన్ ధార్ ఏదో అర్జెంట్ పని ఉందన్నట్టు ఇలా వచ్చి అలా వెళ్ళిపోయాడు. బ్రేవిస్ ఆడటం ఇష్టం లేదన్నట్టుగా మైదానం నుంచి వెళ్లిపోయాడు. ఈశాన్ కిషన్ వామ్మో ఈ భారం మోయలేను అన్నట్టుగా అవుట్ అయ్యాడు. హార్దిక్ పాండ్యా కాస్త పర్వాలేదు. పీయూష్ చావ్లా చెప్పుకోవడానికి ఏమీ లేదు. తిలక్ వర్మ మెరుపులు పర్వాలేదు. కోయేట్జీ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఇంతమంది వచ్చి వెళ్తుంటే టిమ్ డేవిడ్ మాత్రం ఏం చేస్తాడు.. అతడు కూడా మిగతా వారినే అనుసరించాడు. ఇది స్థూలంగా ముంబై జట్టు బ్యాటింగ్ పరిస్థితి.
ఇప్పటికే రెండు మ్యాచ్ లు ఓడిపోయి పరువు తీసుకున్న ముంబై జట్టు.. సోమవారం సొంత మైదానంలో జరిగే మ్యాచ్ లో కచ్చితంగా గెలవాలని ఆ జట్టు అభిమానులు కోరుకున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అయినప్పటికీ ముంబై జట్టు ఆట తీరు మారలేదు. అవే పేలవమైన షాట్లు, బాధ్యత రాహిత్యమైన ఆటతీరుతో ఆటగాళ్లు చికాకు తెప్పించారు. అభిమానులకు కోపం కలిగించారు. ఆకాశమే హద్దుగా చెలరేగాల్సిన మ్యాచ్ లో కేవలం 125 పరుగులు చేశారు. ఇందులో తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా మినహా మిగతా వారంతా తుస్సు మనిపించారు.
సొంత మైదానంలో వీరవిహారం చేస్తాడని భావించిన రోహిత్ శర్మ .. తొలి ఓవర్ ఐదో బంతికే ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్లో సంజు కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఒక బంతిని మాత్రమే ఎదుర్కొన్న అతడు గోల్డెన్ డక్ గా ఔట్ కావడంతో అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈశాన్ కిషన్ కూడా పెద్దగా రాణించలేకపోయాడు. 14 బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్స్ కొట్టి మెరుగ్గానే అనిపించినప్పటికీ 16 పరుగులు చేసి బర్గర్ బౌలింగ్ లో సంజు కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. నమన్ ధీర్ కూడా రోహిత్ శర్మనే అనుసరించాడు. బౌల్ట్ బౌలింగ్లో అతడు వికెట్ల ముందు దొరికిపోయాడు. బ్రేవిస్ కూడా చెప్పుకోదగిన ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. అతడు కూడా గోల్డెన్ డక్ గా అవుట్ అయ్యాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా 21 బంతుల్లో ఆరు ఫోర్ల సహాయంతో 34 పరుగులు చేసినప్పటికీ.. అతడు చివరి వరకు ఉండలేకపోయాడు. యజువేంద్ర చాహల్ బౌలింగ్ లో అతడు క్యాచ్ అవుట్ అయ్యాడు..
తిలక్ వర్మ 29 బంతుల్లో రెండు సిక్సర్ల సహాయంతో 32 పరుగులు చేసినప్పటికీ.. కీలక సమయంలో అతడు యజువేంద్ర చాహల్ బౌలింగ్ లో రవిచంద్రన్ అశ్విన్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. పీయూష్ చావ్లా కేవలం మూడు పరుగులు మాత్రమే చేసి ఆవేష్ ఖాన్ బౌలింగ్లో హిట్మేయర్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. టీమ్ డేవిడ్ కూడా 24 బంతుల్లో 17 పరుగులు చేసి బర్గర్ బౌలింగ్లో బౌల్ట్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. కోయేట్జీ నాలుగు పరుగులు మాత్రమే చేసి యజువేంద్ర చాహల్ బౌలింగ్లో హిట్మేయర్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. బుమ్రా 8 పరుగులతో, ఆకాష్ నాలుగు పరుగులతో నాట్ అవుట్ గా నిలిచారు.
ముంబై జట్టు బ్యాటింగ్ లైనప్ అద్భుతంగా ఉంటుంది. ఇప్పటివరకు ఈ జట్టులో బ్యాటర్లకు వంక పెట్టినవారు లేరు. కానీ సోమవారం నాటి మ్యాచ్ తో ముంబై జట్టు ఘనతను నాశనం చేసుకుంది. తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా మినహా మిగతా వారెవరూ చెప్పుకోదగిన స్కోర్ చేయలేదు. రోహిత్ శర్మ, నమన్ ధీర్, బ్రేవిస్ వంటి వారు సున్నాపరుగులకే అవుట్ కావడం ముంబై జట్టును తీవ్ర కష్టాల్లో నెట్టింది. మరోవైపు రాజస్థాన్ బౌలర్లలో బౌల్ట్ మూడు, యజువేంద్ర చాహల్ 3, బర్గర్ 2, ఆవిష్కాన్ ఒక వికెట్ దక్కించుకున్నారు. సొంత మైదానంలో పేలవ ప్రదర్శన చేయడంతో ముంబై జట్టు ఆటగాళ్లపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.