IPL Match Cancelled Due To Rain Refund Rules: ఐపీఎల్ జోరుగా సాగుతోంది. ప్రతిరోజు సాయంత్రం అభిమానులకు వీనుల విందైన క్రికెట్ ఆనందం లభిస్తోంది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. అనుకోకుండా వర్షం కురిస్తే మ్యాచ్ రద్దు అవుతుంది. దీనివల్ల ప్రేక్షకుల్లో అసహనం పెరిగిపోతోంది. అనుకోని పరిస్థితుల్లో మ్యాచ్ రద్దు అయితే.. టికెట్లు కొనుగోలు చేసిన ప్రేక్షకులకు తిరిగి డబ్బులు చెల్లించే విషయంపై మరోసారి వివాదం మొదలైంది.
ప్రస్తుత ఐపిఎల్ లో సోమవారం కోల్ కతా నైట్ రైడర్స్, పంజాబ్ సూపర్ కింగ్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దయింది. ఆకాశం మేఘావృతమైంది. పలుమార్లు చినుకులు పడ్డాయి. ఆ తర్వాత వాతావరణం కాస్త తెరిపి ఇవ్వడంతో అంపైర్లు మ్యాచ్ నిర్వహణకు సిద్ధమయ్యారు. టాస్ గెలిచిన కోల్ కతా జట్టు కెప్టెన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అది ఎంత తప్పుడు నిర్ణయమో తర్వాత గాని అర్థం కాలేదు.
చూస్తుండగానే పంజాబ్ బౌలర్లు కోల్ కతా జట్టులో కీలకమైన రెండు వికెట్లను పడగొట్టారు. బంతి కూడా స్వింగ్ అవడంతో మిగతా బ్యాటర్లు పరుగులు తీయడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. కేవలం 3.4 ఓవర్లు మాత్రమే ఆట సాగింది. అప్పటికి కోల్ కతా జట్టు రెండు వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో వర్షం మొదలైంది. ఎంతసేపటికి తగ్గలేదు. దీంతో అంపైర్లు మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాదని నిలిపివేశారు. రెండు జట్లకు చెరొక పాయింట్ కేటాయించారు.
మ్యాచ్ రద్దు కావడంతో టికెట్ రీఫండ్ విషయంలో బీసీసీఐ అమలు చేస్తున్న నిబంధనలు అభిమానులకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. బిసిసిఐ నిబంధనల ప్రకారం ఒక బంతి పడినా సరే మ్యాచ్ ప్రారంభమైనట్టే. అందువల్లే అభిమానులకు తిరిగి డబ్బులు ఇవ్వరు..కోల్ కతా, పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో కేవలం 22 బంతులు మాత్రమే వేశారు. దీంతో ఫ్యాన్స్ కు రీఫండ్ ఉండదని బీసీసీఐ వర్గాలు స్పష్టం చేశాయి. దీంతో వేల రూపాయల ఖర్చు పెట్టి టికెట్లు కొనుగోలు చేసిన అభిమానులకు ఆవేదన మిగిలింది. వర్షం విపరీతంగా కురవడంతో.. మైదానం నుంచి ఇంటికి వెళ్లడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు..
“మ్యాచ్ చూద్దామని వచ్చాం. వేల రూపాయలు ఖర్చు పెట్టి టికెట్లు కొనుగోలు చేసాం. ఇంత జరిగినప్పటికీ వర్షం కురిసింది. మ్యాచ్ రద్దయింది. చివరికి అంతటి వర్షంలో ఇంటికి వెళ్లడం కూడా ఇబ్బందిగా మారింది. క్రికెట్ ఆనందమేమో కానీ.. వర్షం వల్ల అది మొత్తం ఆవిరి అయిపోయింది. వేల రూపాయలు ఖర్చుపెట్టి టికెట్లు కొనుగోలు చేస్తే చివరికి ప్రయాస మిగిలిందని” అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రీఫండ్ ఇవ్వకుండా బీసీసీఐ ఇష్టానుసారంగా వ్యవహరిస్తుందని మండిపడుతున్నారు.