
ఈరోజు ఐపీఎల్ లో ఒక రసవత్తరమైన పోటీ జరుగబోతోంది. రెండు సమ ఉజ్జీలైన బలమైన జట్లు పోటీపడబోతున్నాయి. గత సంవత్సరం ఐపీఎల్ ఫైనలిస్టులు ఢిల్లీ క్యాపిటల్స్.. ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో తమ మొదటి మ్యాచ్ ఆడబోతున్నాయి. ఐపీఎల్ 2020 ఫైనల్ లో ఓడించిన ముంబైపై ప్రతీకారం తీర్చుకోవాలని ఢిల్లీ ఎదురుచూస్తోంది. ఇక ముంబై తన ఆధిపత్యాన్ని కొనసాగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సీజన్‌లో ఇరు జట్లు మూడు మ్యాచ్‌లు ఆడి, వాటిలో రెండు మ్యాచ్‌లను గెలిచాయి. ఈ సంకుల సమరానికి చెన్నై వేదిక కాబోతోంది.
-ధావన్ దూకుడుకు ముంబై కల్లెం వేస్తుందా?
టీమిండియా సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ ఈ సీజన్‌లో మంచి ఫామ్‌లో ఉన్నాడు. గత మ్యాచ్‌లో పంజాబ్‌తో జరిగిన మ్యాచ్ లో సెంచరీకి చేరువై ఢిల్లీని ఒంటిచేత్తో గెలిపించారు. ధావన్ దంచి కొట్టడంతో భారీ లక్ష్యాన్ని ఢిల్లీ సునాయాసంగా చేధించేసింది. అధిక స్ట్రైక్ రేట్‌ను ఎలా కొనసాగించవచ్చో ధావన్ రుజువు చేశాడు.. భారీ లక్ష్యాలను చేధించడంలో యువ క్రికెటర్లందరికీ ఒక ఉదాహరణగా నిలిచాడు. ఇక ఢిల్లీకి మరో ఓపెనర్ పృథ్వీ షా కూడా భీకరంగా ఆడుతున్నాడు. వీరిద్దరినీ ఆపడం ఎవరి తరం కావడం లేదు. ఢిల్లీ ఇక చెన్నైలో ఆడుతున్న మొదటి మ్యాచ్ ఇది. చెన్నై స్పిన్ పిచ్ ఇప్పటివరకు చాలా జట్లను ఇబ్బంది పెట్టింది. ఢిల్లీకి సైతం కొంత ఇబ్బంది ఎదురైంది. ఢిల్లీ బౌలింగ్ దాడిలో అశ్విన్ ప్రముఖ పాత్ర పోషిస్తున్నాడు.
-ముంబై ఎదురుందా?
ముంబై క్లిష్టమైన చెన్నైలోని చేపాక్ పిచ్‌కు అలవాటు పడింది. మ్యాచ్‌లను సులభంగా గెలుచుకుంటుంది. ముఖ్యంగా వారి బౌలర్లు తక్కువ మొత్తాలను రక్షించడంలో అసాధారణంగా రాణిస్తున్నారు. అయితే ముంబై బ్యాటింగ్ ఆందోళన కలిగిస్తుంది. ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, క్వింటన్ డికాక్ వంటి వారు ఈ పిచ్‌లో కష్టపడుతున్నారు. బౌలింగ్ విభాగం అత్యంత పటిష్టంగా ఉంది. ముంబైకి రాహుల్ చాహర్ కీలక స్పిన్నర్ గా ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ట్రెంట్ బౌల్ట్.. జస్‌ప్రీత్ బుమ్రా తమ బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్నారు. కీలకమైన వికెట్లను రాబట్టి ముంబైకి విజయాన్ని అందిస్తున్నారు.
ఐపీఎల్ చరిత్రలో: ముంబై, ఢిల్లీ ఒకరితో ఒకరు 28 మ్యాచ్‌లు ఆడారు. వాటిలో 16 మ్యాచ్ లను ముంబై గెలిచింది. మరో వైపు ఢిల్లీ 12 విజయాలు సాధించింది.
మ్యాచ్ వేదిక: చిదంబరం స్టేడియం, చెన్నై.
మ్యాచ్ సమయం: రాత్రి 07.30