IPL 2025 Rescheduled: నిర్వహణ తేదీలను(దీనిపై అనేక అనుమానాలు వ్యక్తం అయ్యాయి) మార్చినప్పటికీ.. కేంద్ర ప్రభుత్వం.. ఇతర వ్యవస్థల దయవల్ల మళ్లీ ఐపిఎల్ మళ్లీ కొనసాగించడం సాధ్యమవుతోంది. ఐపీఎల్ కు సంబంధించి నిర్వాహక కమిటీ మళ్లీ కొత్త షెడ్యూల్ ప్రకటించింది. ఇందులో భాగంగా మే 17 నుంచి మళ్లీ మ్యాచులు మొదలవుతాయి. బెంగళూరు, లక్నో, జైపూర్, అహ్మదాబాద్, ముంబై, ఢిల్లీ వంటి ప్రాంతాలలో మ్యాచ్ లు నిర్వహిస్తారు. ఇక ఫైనల్ మ్యాచ్ కు సంబంధించి తేదీని కూడా నిర్వాహక కమిటీ డిక్లేర్ చేసింది.. జూన్ 3న చివరి మ్యాచ్ నిర్వహిస్తుంది.. ఫైనల్ పోరులో గెలిచిన జట్టు విజేతగా ఆవిర్భవిస్తుంది. అయితే ప్లే ఆఫ్ వేదికలను కూడా త్వరలోనే ఖరారు చేస్తారు. బార్డర్లో ఏర్పడిన టెన్షన్ వాతావరణం వల్ల ఢిల్లీ, పంజాబ్ మధ్య జరగాల్సిన మ్యాచ్ అకస్మాత్తుగా రద్దయింది. మ్యాచ్ రద్దయ్యే సమయానికి పంజాబ్ జట్టు భీకరంగా బ్యాటింగ్ చేస్తోంది. ఢిల్లీ బౌలర్లను ఒక ఆట ఆడుకుంది. ఇక ఇదే సమయంలో ఒక్కసారిగా మ్యాచ్ నిర్వహణలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.. దానికంటే ముందు నిర్వాహకులు మైదానంలో ఫ్లడ్ లైట్లు మొత్తం నిలిపి వేశారు. ఆ తర్వాత ప్రేక్షకులను యుద్ధ ప్రాతిపదికన బయటికి పంపించారు. ప్రేక్షకులకు వెంటనే తాము తీసుకున్న నిర్ణయాన్ని చెప్పి బయటకు పంపిస్తే.. ప్రమాదం జరుగుతుందని భావించిన నిర్వాహకులు వ్యూహాత్మకంగా ఈ విధానం అమలు చేశారు.
Also Read: ఢిల్లీ మేనేజ్మెంట్ వల్ల కానిది..సన్ రైజర్స్ చేసి చూపించింది.. దటీస్ కావ్య!
కొత్త షెడ్యూల్ లో..
కొత్తగా వెల్లడించిన షెడ్యూల్ ప్రకారం మే 24న జైపూర్ నగరంలో పంజాబ్, ఢిల్లీ జట్లు పరస్పరం తలపడతాయి. ధర్మశాలలో జరిగిన మ్యాచ్ ను పక్కనపెట్టి.. జైపూర్లో మళ్లీ మొదటి నుంచి ఈ ఆట నిర్వహిస్తారని తెలుస్తోంది. అయితే ఐపీఎల్ నిర్వాహక కమిటీ తీసుకున్న నిర్ణయం ఒకరకంగా పంజాబ్ జట్టుకు ఇబ్బంది కలిగించేదే. ఇక నాడు జరిగిన మ్యాచ్లో పంజాబ్ జట్టు అదిరిపోయే రేంజ్ లో బ్యాటింగ్ చేసింది. ఒక వికెట్ మాత్రమే నష్టపోయి 122 రన్స్ స్కోర్ చేసింది. ఇప్పుడు మళ్లీ ఫస్ట్ నుంచి మ్యాచ్ ఆడితే.. పంజాబ్ ఎలా బ్యాటింగ్ చేస్తుందో చెప్పలేము. ఇక ఇప్పటి వరకు పంజాబ్ 11 మ్యాచ్లు ఆడింది. కొత్తగా 15 పాయింట్లతో కొనసాగుతోంది. తదుపరి మూడు మ్యాచ్లో పంజాబ్ ఒకటి గెలిస్తే చాలు ప్లే ఆఫ్ వెళ్లినట్టే. ఇక తాజా షెడ్యూల్ ప్రకారం ఐపిఎల్ లో ఏప్రిల్ 29న క్వాలిఫైయర్ -1 మ్యాచ్ నిర్వహిస్తారు. క్వాలిఫైయర్ -2 మ్యాచ్ జూన్ 1న, జూన్ 3న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి వేదికలను ఇంకా అఫీషియల్ గా డిక్లేర్ చేయలేదు. అయితే జాతీయ మీడియాలో వినిపిస్తున్న కథనాల ప్రకారం ముంబైలో ప్లే ఆఫ్ మ్యాచ్ లు, అహ్మదాబాదులో ఫైనల్ మ్యాచ్ నిర్వహిస్తారని తెలుస్తోంది. ఒకవేళ ఏమైనా అవాంతరాలు చోటు చేసుకుంటే వేదికలను మార్చే అవకాశం కనిపిస్తోంది. మొత్తంగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతాయని నిర్వాహకులు పదేపదే స్పష్టం చేస్తున్నారు.