గాలిలో వ్యాపించే మాయదారి అంటురోగం.. అందరికీ వినోదాన్ని పంచుతున్న క్రికెట్ క్రీడపై కూడా పడింది. ఈ మహమ్మారి కఠిన బయో బబుల్ ఉండే ఐపీఎల్ ను తాకడం అందరినీ షాక్ కు గురిచేసింది. మొన్న కోల్ కతా ఇద్దరు ఆటగాళ్లు.. నేడు జరిగే సన్ రైజర్స్ ఆటగాడు సైతం కరోనా బారినపడడంతో బీసీసీఐ జాగ్రత్త పడింది. ముందే మేలుకుంది.
హోటల్ తోపాటు మైదానంలో కఠిన కోవిడ్ నిబంధనల మధ్య ఐపీఎల్ సాగుతోంది. అయినా కూడా ఈ కరోనా మహమ్మారి ఆటగాళ్ల వరకు చేరడంతో ఇక చేసేదేం లేక బీసీసీఐ ఈ టోర్నీ ప్రస్తుతానికి వాయిదా వేసింది. ఈనెలలో అయితే పున: ప్రారంభం అయ్యే సూచనలు కనిపించడం లేదు.
ఐపీఎల్ ను కరోనా వెంటాడుతోంది. తాజాగా మరో ఇద్దరు క్రికెటర్లు కోవిడ్ బారిన పడ్డారు. సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు వృద్ధిమాన్ సాహా, ఢిల్లీ క్యాపిటల్స్ కు ప్రాతినిత్యం వహిస్తున్న అమిత్ మిశ్రాకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఇక కోవిడ్ నేపథ్యంలో ఇప్పటికే రెండు ఐపీఎల్ మ్యాచ్ లను వాయిదా వేసిన సంగతి తెలిసిందే.
ఇప్పటికే పలు జట్లు ఐసోలేషన్ లో ఉండటం, బయో బబుల్ లో ఉన్నా ఆటగాళ్లు కరోనా బారిన పడుతుండటంతో టోర్నిని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఈ విషయాన్ని బీబీసీఐ ఉపాధ్యక్షడు రాజీవ్ శుక్లా ధ్రువీకరించారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ఐపీఎల్ ను నిరవధికంగా వాయిదా వేస్తున్నామని.. పరిస్థితులు అనుకూలిస్తే అప్పుడు కొనసాగిస్తామని ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ తాజాగా పీటీఐతో మాట్లాడుతూ స్పష్టం చేశారు. ఇక ఈ సీజన్ ను ఐపీఎల్ మ్యాచ్ లను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్ల ప్రకటించారు. దీంతో ఇక సాయంత్రాలు ఐపీఎల్ సందడికి చెక్ పడింది.
కరోనా కల్లోలంతో కాసింత వినోదాన్ని పంచుతున్న ఐపీఎల్ వాయిదా పడడం క్రికెట్ అభిమానులను షాక్ కు గురిచేసింది. ఈ మయదారి రోగం మధ్యలో టెన్షన్ తో గడుపుతున్న ప్రేక్షకులకు ఉత్సాహాన్నిచ్చే ఈ భారీ ఈవెంట్ ఆగిపోవడం నిజంగానే పెద్ద దెబ్బ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.