Nitish Kumar Reddy: చిన్నప్పటినుంచి నితీష్ కుమార్ రెడ్డికి క్రికెట్ అంటే చాలా ఇష్టం. చివరికి క్లాస్ రూమ్ లో కూడా పుస్తకాన్ని బ్యాట్ లాగా మార్చి క్రికెట్ ఆడేవాడు. కొడుకు ఇష్టాన్ని కాదన లేక సతీష్ కుమార్ రెడ్డి తండ్రి ముత్యాల రెడ్డి హిందుస్థాన్ జింక్ లో తన ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. వాస్తవానికి ముత్యాల రెడ్డికి రాజస్థాన్ రాష్ట్రానికి బదిలీ అయింది. అక్కడికి వెళ్తే నితీష్ కుమార్ రెడ్డికి క్రికెట్లో ట్రైనింగ్ ఇప్పిచ్చే అవకాశం ఉండదని భావించి.. ఉద్యోగానికి రాజీనామా చేశాడు. అదే సమయంలో కడపలో ఎమ్మెస్ కే ప్రసాద్ క్రికెట్ అకాడమీలో చేర్పించాడు. అలా కడపలో కొద్ది రోజులు ఉన్న తర్వాత.. ఆంధ్ర క్రికెట్ జట్టుకు రంజీ లో నితీష్ కుమార్ రెడ్డి ఎంపికయ్యాడు. దీంతో అతని ప్రస్థానం మళ్లీ విశాఖపట్నం కి మారింది. అయితే విశాఖపట్నంలో స్టేడియం.. ముత్యాల రెడ్డి ఉంటున్న ప్రాంతానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉండేది. అలా ప్రతిరోజు నితీష్ కుమార్ రెడ్డిని తీసుకెళ్లి.. వస్తూ ఉండేవాడు. ఉద్యోగానికి రాజీనామా చేయడంతో నితీష్ కుమార్ రెడ్డి ఆటే.. ముత్యాల రెడ్డి కి ప్రాణమయింది. ఇక నితీష్ కుమార్ రెడ్డి తల్లి ఉదయాన్నే నాలుగు గంటలకు లేచేది. నితీష్ కుమార్ రెడ్డిని రెడీ చేసి పంపించేది. ప్రతిరోజు రెండున్నర గంటల పాటు అకాడమీలో నితీష్ కుమార్ రెడ్డి ప్రాక్టీస్ చేసేవాడు. ఆ తర్వాత విజయనగరంలోనూ తన క్రికెట్ ప్రస్థానాన్ని కొనసాగించాడు. ఆంధ్ర క్రికెట్ జట్టుకు రంజీలో ఆడటంతో నితీష్ కుమార్ రెడ్డి ప్రతిభ హైదరాబాద్ జట్టు యాజమాన్యం దృష్టికి వెళ్లింది. దీంతో ఐపీఎల్లో సన్ రైజర్స్ యాజమాన్యం నితీష్ కుమార్ రెడ్డిని 20 లక్షల కనీస ధరకు కొనుగోలు చేసింది. దీంతో నితీష్ కుమార్ రెడ్డి పేరు ఒకసారిగా వార్తల్లోకి వచ్చింది. ఐపీఎల్ ద్వారా తన ప్రతిభను నిరూపించుకోవడంతో.. జాతీయ జట్టులోకి అతడికి ఎంట్రీ లభించింది.
డబ్బులు లేక ఇబ్బంది పడ్డారు..
కుమారుడి కోసం ఉద్యోగానికి రాజీనామా చేసిన ముత్యాల రెడ్డి.. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒకానొక దశలో డబ్బులు లేక కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. ఆయన కూడా కొడుకు లక్ష్యం ముందు ఇవన్నీ బలాదూర్ అని ఆయనలో ఆయన చెప్పుకొని మానసిక ధైర్యంతో ముందడుగు చేశారు. నితీష్ కుమార్ రెడ్డికి మంచి మంచి అకాడమీ లలో ట్రైనింగ్ ఇప్పించారు. ఎప్పుడైతే అతడు ఐపిఎల్ లో తనను తాను నిరూపించుకున్నాడో.. ముత్యాల రెడ్డి కి ఇబ్బంది లేకుండా పోయింది. నితీష్ కుమార్ రెడ్డి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జాతీయ జట్టుకు ఎంపిక కావడం.. టెస్ట్ ఆడాలి అనే అతని కోరికను నెరవేర్చుకోవడం వెంటవెంటనే జరిగిపోయాయి. పైగా ఈ టోర్నీలో మెల్ బోర్న్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ చేయడం ఒక్కసారిగా అతడి పేరును మార్మోగేలా చేసింది. స్ఫూర్తిదాయకమైన ఇన్నింగ్స్ ఆడిన నేపథ్యంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నితీష్ కుమార్ రెడ్డికి 25 లక్షల నగదు నజరానాను ప్రకటించింది. త్వరలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేతుల మీదుగా ఈ బహుమతిని నితీష్ కుమార్ రెడ్డికి అందజేయనుంది. ఇప్పటికే ఐపీఎల్ లో అదరగొట్టిన నితీష్ కుమార్ రెడ్డి.. టెస్టులలోనూ తను ఏమిటో నిరూపించుకున్నాడు. వన్డే, టి20 లలోనూ సత్తా చాటితే టీమిండియాలో నితీష్ కుమార్ రెడ్డికి సుస్థిరమైన స్థానం ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు.
