India Vs Sri Lanka Asia Cup 2025: ఇప్పటికే టీమ్ ఇండియా ఫైనల్ వెళ్లిపోయింది. శ్రీలంక ఆసియా కప్ మీద ఆశలు వదిలేసుకుంది. మొత్తంగా చూస్తే శుక్రవారం టీమిండియా, శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్ ఏమంత గొప్పది కాదు. ఊహించినంత ఆసక్తికరమైనది కూడా కాదు. అయితే మ్యాచ్ మాత్రం అలా సాగలేదు. అనుక్షణం ఉత్కంఠ కలిగించింది. బంతి బంతికి సమీకరణం మారడంతో ప్రేక్షకులను సీటు చివరి ఎడ్జ్ లో కూర్చోబెట్టింది. అంతేకాదు టి20 వినోదాన్ని సరికొత్తగా అందించింది.
ఆసియా కప్ లో భాగంగా సూపర్ 4 పోరులో టీమిండియా సూపర్ విజయాన్ని అందుకుంది. భారత్ చేసిన 200 పైగా పరుగులను శ్రీలంక చేసింది. చివర్లో ఒత్తిడికి గురి కావడంతో మ్యాచ్ టై అయింది. ఆ తర్వాత అది సూపర్ ఓవర్ కు దారి తీసింది. సూపర్ ఓవర్ లో టీమిండియా అద్భుతంగా బౌలింగ్ చేసింది. దీంతో శ్రీలంకకు మరో ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ 61, తిలక్ వర్మ 49*, సంజు 39, అక్షర్ పటేల్ 31* పరుగులతో ఆకట్టుకున్నారు. శ్రీలంక బౌలర్లలో మహిష తీక్షణ, దుష్మత్ చమీరా, హసరంగ, శనక, అసలంక చెరో వికెట్ పడగొట్టారు.
టీమిండియా విధించిన 202 పరుగుల టార్గెట్ ను శ్రీలంక ఫినిష్ చేసే క్రమంలో రంగంలోకి దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో శ్రీలంక కూడా 202 పరుగులు చేసింది. నిస్సాంక 107 పరుగులు చేశాడు. కుషాల్ ఫెరీర 58 పరుగులతో ఆకట్టుకున్నాడు. శనక 22* పరుగులతో అదరగొట్టాడు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా, కులదీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, అర్ష్ దీప్ సింగ్, హర్షిత్ రాణా తలా ఒక వికెట్ పడగొట్టారు.
అదే మలుపు తిప్పింది
చివరి ఓవర్లో శ్రీలంక గెలుపుకు 12 పరుగులు అవసరమయ్యాయి. ఆ సమయంలో హర్షిత్ బంతి అందుకున్నాడు. తొలి బంతికే నిస్సాంక ను క్యాచ్ అవుటుగా వెనక్కి పంపించాడు. ఆ తర్వాత మూడు బంతుల్లో ఐదు పరుగులు ఇచ్చాడు. ఐదో బంతిని షనక ఫోర్ కొట్టాడు. దీంతో చివరి బంతికి శ్రీలంక జట్టుకు మూడు పరుగులు అవసరమయ్యాయి. ఈ దశలో రెండు రన్స్ మాత్రమే వచ్చాయి. ఫలితంగా మ్యాచ్ టై అయింది. సూపర్ ఓవర్ ఆడాల్సిన పరిస్థితి నెలకొంది.. నిస్సాంక అవుట్ కావడంతో మ్యాచ్ ఒక్కసారిగా టీమిండియా వైపు మళ్ళింది.
సూపర్ ఓవర్ లో
సూపర్ ఓవర్లో అర్ష్ దీప్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ వేశాడు. తొలి బంతికి కుషాల్ ఫెరిరా ను ఔట్ చేశాడు. ఆ తర్వాత రెండు బంతులకు వైడ్ ద్వారా వచ్చాయి. నాలుగో బంతికి షనక సింగిల్ తీయబోయాడు. రన్ అవుట్ అయ్యాడు. దానికంటే ముందుగానే అంపైర్ క్యాచ్ ఔట్ ఇచ్చాడు. అయితే రన్ అవుట్ కంటే ముందు అంపైర్ క్యాచ్ అవుట్ నిర్ణయాన్ని ప్రకటించిన నేపథ్యంలో శ్రీలంక ఆటగాడు షనక అత్యంత తెలివిగా రివ్యూ తీసుకున్నాడు. కానీ ఆ బంతి బ్యాట్ కు తగలలేదు. నాటౌట్ గా తేలిపోయింది. అంపైర్ నిర్ణయం తర్వాతి బంతి డెడ్ అయింది కాబట్టి రనౌట్ పరిధిలోకి రాదు. దీంతో అతడు నాట్ అవుట్ గా బతికిపోయాడు. వాస్తవానికి ఈ నిర్ణయం అభిమానులు మాత్రమే కాదు భారత ప్లేయర్లను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ తర్వాత అంపైర్లు ఈ విషయం గురించి ప్లేయర్లకు వివరించి చెప్పారు. కానీ ఆ తర్వాతి బంతికే అతడు అవుట్ అయ్యాడు. దీంతో టీమిండియా టార్గెట్ 3 రన్స్ మాత్రమే అయింది. అనంతరం రంగంలోకి దిగిన టీం ఇండియా మూడు పరుగులను సులువుగా చేసి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇప్పటివరకు వన్ సైడ్ మ్యాచ్ లతో ఆసియా కప్ చప్పగా సాగింది. కానీ ఈ మ్యాచ్ మాత్రం అభిమానులకు అద్భుతమైన క్రికెట్ ఆనందాన్ని అందించింది. అంతేకాదు సూపర్ ఓవర్ మ్యాచ్ల చరిత్రలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంది.