https://oktelugu.com/

India vs England : బెన్ డక్కెట్ ఒక్క సెంచరీ.. ఎన్ని రికార్డులు సృష్టించిందో తెలుసా?

మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ చేయడం ద్వారా డక్కెట్ కూడా అలాంటి ప్రశంసలనే అందుకుంటున్నాడు. అన్నట్టు డక్కెట్ కు ఇది మూడో టెస్ట్ సెంచరీ.

Written By:
  • NARESH
  • , Updated On : February 16, 2024 / 10:19 PM IST
    Follow us on

    India vs England : రాజ్ కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ ఆసక్తికరమైన మలుపులు తీసుకుంటోంది. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 445 పరుగులు చేసి ఆలౌట్ అయింది. భారత్ ఇన్నింగ్స్ ముగిసిన అనంతరం తొలి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టుకు తొలి వికెట్ కు 89 పరుగుల భాగస్వామ్యం లభించింది. రెండో వికెట్ కు కూడా 93 పరుగుల విలువైన భాగస్వామ్యం నమోదయింది. మొత్తానికి ఇంగ్లాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో ఆట ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. జో రూట్, డక్కెట్ ప్రస్తుతం క్రీజ్ లో ఉన్నారు. భారత బౌలర్లలో రవిచంద్రన్, మహమ్మద్ సిరాజ్ చెరొక వికెట్ దక్కించుకున్నారు.

    ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో హీరోగా నిలిచింది బెన్ డక్కెట్ అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అతడు కేవలం 88 బంతుల్లో 19 ఫోర్లు, 2 సిక్స్ ల సహాయంతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టెస్టుల్లో భారత జట్టుపై అత్యంత వేగంగా సెంచరీ చేసిన ఇంగ్లీష్ బ్యాటర్ గా గుర్తింపు పొందాడు. భారతదేశంలో అత్యంత వేగంగా సెంచరీ చేసిన మూడవ విదేశీ క్రికెటర్ గా డక్కెట్ నిలిచాడు. 1990 లో ఇంగ్లాండ్ జట్టుకు చెందిన గ్రాహం గూచ్ అనే బ్యాట్స్ మెన్ ఇంగ్లాండ్ లోని లార్డ్స్ వేదికగా భారత జట్టుపై జరిగిన టెస్ట్ మ్యాచ్లో 95 బంతుల్లో సెంచరీ సాధించాడు.. రాజ్ కోట్ మైదానం విషయానికొస్తే.. ఇదే వేదికపై వెస్టిండీస్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో భారత బ్యాటర్ పృథ్వి షా 99 బంతుల్లో సెంచరీ సాధించాడు.

    న్యూజిలాండ్ జట్టు ఆటగాడు రాస్ టైలర్ 2012లో భారత జట్టుతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో 99 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు.. అయితే అత్యంత వేగంగా సెంచరీ చేసిన క్రికెటర్ రికార్డు మాత్రం ఆస్ట్రేలియా ఆటగాడు గిల్ క్రిస్ట్ మీద ఉంది. 2001లో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో అతడు 84 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు.. ఈ జాబితాలో వెస్టిండీస్ ఒకప్పటి ఆటగాడు క్లైవ్ లాయిడ్ రెండో స్థానంలో ఉన్నాడు. 1974 లో జరిగిన మ్యాచ్ లో అతడు కేవలం 85 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేయడం విశేషం. ఇక డక్కెట్ శుక్రవారం జరిగిన మూడో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో 88 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. తక్కువ బంతుల్లో సెంచరీ సాధించిన మూడవ విదేశీ బ్యాటర్ గా డక్కెట్ నిలిచాడు. సెంచరీ చేయడమే కాదు విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పాడు. జాక్ క్రాలీ తో కలిసి మొదటి వికెట్ కు 89 పరుగులు, పోప్ తో కలిసి రెండో వికెట్ కు 93 పరుగులు జోడించాడు. డక్కెట్ సెంచరీ చేసిన నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా అతడికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.. మొదటి టెస్టులో పోప్ ఎలాగైతే ఓవర్ నైట్ స్టార్ అయి కితాబులు పొందాడో.. మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ చేయడం ద్వారా డక్కెట్ కూడా అలాంటి ప్రశంసలనే అందుకుంటున్నాడు. అన్నట్టు డక్కెట్ కు ఇది మూడో టెస్ట్ సెంచరీ.