WTC Rankings: ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన ఐదు టెస్టుల సిరీస్ ను 4-1 తేడాతో గెలుచుకున్న భారత జట్టు.. టెస్ట్ ర్యాంకింగ్స్ లో మళ్లీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఇప్పటికే టీమిండియా వన్డే, టీ-20 ఫార్మాట్ లో అగ్రస్థానంలో కొనసాగుతోంది.. ఇంగ్లాండ్ కంటే ముందు దక్షిణాఫ్రికాతో ఆ దేశం వేదికగా జరిగిన టెస్ట్ సిరీస్ ను 1-1 తో డ్రాగా ముగించింది. ఫలితంగా రోహిత్ సేన అగ్రస్థానాన్ని కోల్పోయింది. అదే సమయంలో ఆస్ట్రేలియా మొదటి స్థానం దక్కించుకుంది. అయితే ఇటీవల స్వదేశంలో ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన ఐదు టెస్టుల సిరీస్ ను భారత్ 4-1 తో దక్కించుకోవడంతో తిరిగి మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది.
ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా ఉప్పల్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ లో భారత్ తొలి ఇన్నింగ్స్ లో లీడ్ కొనసాగించింది. రెండవ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్లో తడబాటుకు గురి కావడంతో 28 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆ తర్వాత విశాఖపట్నం, రాజ్ కోట్, రాంచి, ధర్మశాలలో జరిగిన టెస్ట్ మ్యాచ్లలో భారత్ అద్భుతమైన విజయాలు సాధించింది. ముఖ్యంగా రాజ్ కోట్ టెస్ట్ లో 434 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ జట్టుపై విజయం సాధించింది. ఈ గెలుపు ద్వారా టెస్టుల్లో అతిపెద్ద విజయాన్ని తన ఖాతాలో నమోదు చేసుకుంది. ఈ వరుస విజయాలతో 122 పాయింట్లు సాధించి టెస్ట్ ర్యాంకింగ్స్ లో రోహిత్ సేన నెంబర్ వన్ ర్యాంక్ కైవసం చేసుకుంది. ఇటీవల జరిగిన టెస్టులో న్యూజిలాండ్ జట్టు పై 172 పరుగుల తేడాతో విజయం సాధించినప్పటికీ ఆస్ట్రేలియా 117 పాయింట్లతో రెండవ స్థానంలో కొనసాగుతోంది.
టీమిండియా టెస్టుల్లో మాత్రమే కాకుండా WTC Rankings లోనూ మొదటి స్థానంలో కొనసాగుతోంది. వన్డేల్లో, టీ- 20 ల్లోనూ నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది.. ఇంగ్లాండ్ జట్టుపై 4 టెస్ట్ లను వరుసగా భారత జట్టు గెలవడంతో.. బీసీసీఐ సెక్రటరీ జై షా టెస్ట్ క్రికెట్ ఇంటెన్సివ్ స్కీంకు శ్రీకారం చుట్టారు.. దీని వల్ల ఆటగాళ్లకు ఫీజు తో పాటు అదనపు నగదు ప్రయోజనాలు కూడా లభిస్తాయి.