India A vs Pakistan A : శ్రీలంక వేదికగా జరిగిన ఎమర్జింగ్ ఆసియా కప్ 2023ను టోర్నీ విజేతగా పాకిస్తాన్ జట్టు నిలిచింది. కొలంబో వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో 128 పరుగులు తేడాతో భారత జట్టు ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ లో ఓటమిపాలైన భారత జట్టుపై అభిమానులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే, భారత జట్టు దారుణంగా ఓడిపోవడానికి ప్రధాన కారణం పాకిస్తాన్ ఆడిన తొండాట అన్న విమర్శలు వస్తున్నాయి. జూనియర్లు ఆడాల్సిన మ్యాచ్ లో సీనియర్లను బరిలోకి దించి పాకిస్తాన్ జట్టు విజయం సాధించిందని విమర్శిస్తున్నారు.
ఎమర్జింగ్ ఆసియా కప్ 2023 పేరుతో ఆసియాలోని క్రికెట్ ఆడే ఏ జట్లకు పోటీ నిర్వహించారు. ఈ టోర్నీలో భాగంగా ఫైనల్ మ్యాచ్ లో పాకిస్తాన్, భారత్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు 352 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా జట్టు 224 పరుగులకే కుప్పకూలి 128 పరుగులు తేడాతో ఓటమిపాలైంది. అయితే, ఈ మ్యాచ్ లో భారత జట్టు దారుణమైన ఓటమికి కారణం పాకిస్తాన్ జట్టులోని సీనియర్ ఆటగాళ్లేనని, జూనియర్స్ ఆడాల్సిన మ్యాచ్ లో సీనియర్ ప్లేయర్లు ఆడి పాకిస్తాన్ జట్టు విజయం సాధించిందని క్రికెట్ అభిమానులు విమర్శిస్తున్నారు. పాకిస్తాన్ ఏ జట్టు పేరుతో వయసు మళ్ళిన ఆటగాళ్లను పాకిస్తాన్ జట్టు బరిలోకి దించిందని ఆ దేశ క్రికెట్ బోర్డుపై నేటిజన్లు మండిపడుతున్నారు.
పాకిస్తాన్ జట్టులో 29 ఏళ్ల క్రికెటర్.. యువకుడిగా బరిలోకి..
పాకిస్తాన్ తుది జట్టులో ముగ్గురు వయసు మల్లిన వారే ఫైనల్ మ్యాచ్ లో ఆడారు. ఫైనల్ మ్యాచ్ లో సెంచరీ(108) తో చెలరేగిన తయ్యబ్ తాహీర్ వయసు 30 ఏళ్లు. ఇక 65 పరుగులతో రాణించిన సాహెబ్జాదా ఫర్హానాకు 27 ఏళ్లు. మరో క్రికెటర్ ఓమైర్ యూసఫ్ కు 24 ఏళ్లు. ఇలా దాదాపు 20 ఏళ్లు పైబడిన వారే ఫైనల్ మ్యాచ్ లో పాకిస్తాన్ ఏ జట్టు తరఫున బరిలోకి దిగారు. వీరిని యువ జట్టులో కలపడం ఎంతవరకు సమంజసం అని నెటిజన్లు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. యువ ఆటగాళ్లు అయితే భారత జట్టును ఓడించలేరు అన్న భయంతోనే పిసీబి వీరిని బరిలోకి దించిందని నెటిజనులు ఆరోపిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఈ విషయంపై ప్రస్తుతం పెద్ద ఎత్తున రచ్చే జరుగుతోంది.
భారత జట్టులో అంతా యువకులే..
పాకిస్తాన్ ఏ జట్టుతో పోలిస్తే భారత ఏ జట్టులో అంతా యువకులే ఆడారు. సాయి సుదర్శన్(20), అభిషేక్ శర్మ(22), నిఖిల్ జోష్(22), యష్ దుల్ (20), ధ్రువ్ జూరేల్ (22), నిశాంత్ సందు(19), హర్షిత్ రాణా (21), మానవ్ సుతార్(20), రాజవర్ధన్ హాంగర్గేకర్ (20), యువరాజ్ సింగ్ దోడియా(22) ఉన్నారు.