Ind Vs NZ T20 Abhishek Sharma: టి20లో అభిషేక్ శర్మ తుఫాన్ తరహాలో బ్యాటింగ్ చేస్తాడు. దూకుడుకు అసలు సిసలైన అర్ధాన్ని చెబుతాడు. బీభత్సాన్ని సరికొత్త విధంగా ప్రదర్శిస్తాడు. అందువల్లే అతడిని డైనమైట్ అని పిలుస్తుంటారు. అభిషేక్ శర్మ తనను తాను అనేక సందర్భాలలో నిరూపించుకున్నాడు. తను ఎంతటి ప్రమాదకరమైన ఆటగాడినో ప్రతి మ్యాచ్లో అతడు నిరూపించుకుంటూనే ఉన్నాడు. అయితే నాగ్ పూర్ వేదికగా న్యూజిలాండ్ జట్టుతో జరిగిన టి20 మ్యాచ్లో మాత్రం అభిషేక్ శర్మ తన విశ్వరూపాన్ని చూపించాడు.
తొలి ఓవర్లో ప్రతి బంతిని డిఫెన్స్ ఆడడానికి ప్రయత్నించాడు అభిషేక్ శర్మ. దీంతో మైదానంలో మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకులు ఒక రకమైన గందరగోళానికి గురయ్యారు. అభిషేక్ శర్మకు ఏమైంది అంటూ చర్చించుకున్నారు. కానీ ఆ ఓవర్ చివరి బంతిని స్టాండ్స్ అవతలికి పంపించాడు అభిషేక్ శర్మ. ఆ తర్వాత ఇక ఏ ఓవర్ లో కూడా అతడు న్యూజిలాండ్ బౌలర్ల పై కనికరం చూపలేదు. విధ్వంసానికి పరాకాష్టగా బ్యాటింగ్ చేశాడు. ఏమాత్రం భయం అనేది లేకుండా పరుగులు రాబట్టాడు. బంతిని మైదానంలో నలుమూలల పరుగులు పెట్టించాడు. తద్వారా ప్రారంభంలోనే రెండు వికెట్లు కోల్పోయినప్పటికీ.. ఆ ప్రభావం జట్టు మీద పడకుండా చేశాడు అభిషేక్ శర్మ.
అభిషేక్ శర్మ ఈ మ్యాచ్లో 35 బంతుల్లో 84 పరుగులు చేశాడు. అతడు ఇన్నింగ్స్ లో ఐదు ఫోర్లు మాత్రమే ఉన్నాయి. సిక్సర్లు మాత్రం ఏకంగా ఎనిమిది నమోదు అయ్యాయి. దీనిని బట్టి అతని బ్యాటింగ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. రెండు వికెట్లను టీమిండియా వెంట వెంటనే కోల్పోయినప్పటికీ.. అభిషేక్ శర్మ సూర్య కుమార్ యాదవ్ తో మూడో వికెట్ కు ఏకంగా 99 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. తద్వారా టీమిండియాను అత్యంత పటిష్ట స్థితిలోకి తీసుకెళ్లాడు.
నాగ్ పూర్ మైదానంలో హాఫ్ సెంచరీ చేయడం ద్వారా అభిషేక్ శర్మ అనేక రికార్డులను బదులు కొట్టాడు.. 25 కంటే తక్కువ బంతుల్లో 50 పరుగులు చేసిన ఆటగాడిగా సరికొత్త రికార్డు సృష్టించాడు. ఎనిమిది సార్లు అభిషేక్ శర్మ ఈ ఘనతన అందుకున్నాడు. అతడి తర్వాత సాల్ట్ ఏడుసార్లు, సూర్య కుమార్ యాదవ్ ఏడుసార్లు, ఏవిన్ లెవిస్ ఏడుసార్లు ఈ రికార్డు సృష్టించారు. అభిషేక్ శర్మ కంటే ముందు సాల్ట్ ఉండేవాడు. కానీ, అతడి రికార్డును నాగ్ పూర్ మైదానంలో చేసిన హాఫ్ సెంచరీ ద్వారా అభిషేక్ శర్మ బద్దలు కొట్టాడు. అంతేకాదు, న్యూజిలాండ్ జట్టుపై ఒక మ్యాచ్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా అభిషేక్ శర్మ నిలిచాడు. 2012లో హామిల్టన్ వేదికగా జరిగిన మ్యాచ్లో రిచర్డ్ లేవీ 13 సిక్సర్లు కొట్టాడు. 2020లో పొలార్డ్ ఆక్లాండ్ వేదికగా జరిగిన మ్యాచ్లో 8 సిక్సర్లు కొట్టాడు. తాజా మ్యాచ్లో అభిషేక్ శర్మ ఎనిమిది సిక్సర్లు కొట్టి.. పొలార్డ్ సరసన చేరాడు.
ఈ మ్యాచ్లో 200+ పరుగులు చేసిన టీ మీడియా సరికొత్త రికార్డు సృష్టించింది. టి20 లలో 44 వసారి 200+ మించి పరుగులు చేసిన జట్టుగా ఘనత అందుకుంది. సౌత్ ఆఫ్రికా పై 8 సార్లు, ఆస్ట్రేలియాపై ఏడుసార్లు, శ్రీలంక పై ఆరుసార్లు, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లపై ఐదుసార్లు, వెస్టిండీస్, ఐర్లాండ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లపై మూడుసార్లు, బంగ్లాదేశ్ పై రెండుసార్లు, జింబాబ్వే, నేపాల్ పై ఒకసారి టీమిండియా 200+ స్కోర్ చేసింది.