IND Vs NZ: న్యూజిలాండ్ జట్టుతో జరిగే వన్డే సిరీస్ కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. జనవరి 11 నుంచి ఈ వన్డే సిరీస్ మొదలవుతుంది. వన్డే సిరీస్ లో భాగంగా టీమిండియా న్యూజిలాండ్ జట్టుతో మూడు మ్యాచ్ లు ఆడుతుంది. అయితే ఈసారి ప్రకటించిన జట్టులో మేనేజ్మెంట్ కాస్త వైవిధ్యాన్ని ప్రదర్శించింది. అయితే ఒక ఆటగాడికి మాత్రం కోలుకోలేని షాక్ ఇచ్చింది. దీంతో అతడు తీవ్రమైన నిరాశలో మునిగిపోయాడు. డొమెస్టిక్ క్రికెట్లో సత్తా చూపించినప్పటికీ అతడిని సెలెక్టర్లు ఏ మాత్రం పరిగణలోకి తీసుకోలేదు.
ఇటీవల దక్షిణాఫ్రికా జట్టుతో టెస్ట్ సిరీస్ జరుగుతున్నప్పుడు మెడ నొప్పితో కెప్టెన్ గిల్ గాయపడ్డాడు. అతడు వన్డే సిరీస్ కు దూరమయ్యాడు. ఆ తర్వాత టి20 సిరీస్ లోకి వచ్చాడు. టి20 సిరీస్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో అతడిని టి20 వరల్డ్ కప్ కోసం మేనేజ్మెంట్ ఎంపిక చేయలేదు. ఈ క్రమంలోనే న్యూజిలాండ్ జట్టుతో జరిగే వన్డే సిరీస్ కు సారధిగా మేనేజ్మెంట్ ఎంపిక చేసింది. ఉపసారథిగా అయ్యర్ ను ఎంపిక చేసింది.
కొంతకాలంగా బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో చికిత్స పొందుతున్న అయ్యర్ మొత్తానికి జట్టులో స్థానం సంపాదించాడు. వాస్తవానికి ఇతడిని న్యూజిలాండ్ సిరీస్ కు ఎంపిక చేయకుండా.. పక్కన పెడతారని.. అతని స్థానంలో షమీని ఎంపిక చేస్తారని ప్రచారం జరిగింది. అయితే చివరికి ఈ విషయంలో సెలెక్టర్లు షాక్ ఇచ్చారు. షమీని సెలెక్టర్లు ఏమాత్రం లెక్కలోకి తీసుకోలేదు. అతడు 2023 వన్డే వరల్డ్ కప్ లో హైయెస్ట్ వికెట్ టేకర్ గా నిలిచినప్పటికీ.. మేనేజ్మెంట్ ఏమాత్రం కరుణ చూపించడం లేదు. దీంతో అతడికి జట్టులో ద్వారాలు మూసుకుపోయినట్టేనని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.
న్యూజిలాండ్ జట్టుతో జరిగే సిరీస్ లో తనకు అవకాశం లభిస్తుందని షమీ ఆశాభావం వ్యక్తం చేశాడు. కానీ, అతడికి జట్టులో స్థానం లభించలేదు. డొమెస్టిక్ క్రికెట్లో అదరగొట్టినప్పటికీ అతడిని ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదో అర్థం కావడం లేదని మాజీ క్రికెటర్లు వాపోతున్నారు. 2023 లో షమీ తన చివరి మ్యాచ్ ఆడాడు. ఇప్పటికీ అతను గ్రౌండ్లో అడుగుపెట్టక దాదాపు రెండు సంవత్సరాలు దాటిపోయింది.
న్యూజిలాండ్ సిరీస్ కు భారత జట్టు ఇది
గిల్(కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, అయ్యర్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ కృష్ణ, కులదీప్ యాదవ్, రిషబ్ పంత్, నితీష్ కుమార్ రెడ్డి, అర్ష్ దీప్ సింగ్, యశస్వి జైస్వాల్.