Ind Vs Nz 5th t20 Sanju Samson: అదే నిర్లక్ష్యం. అదే బాధ్యతరాహిత్యం.. మైదాన మారుతోంది. మిగతా ఆటగాళ్ల ఆట తీరు కూడా మారుతోంది. కానీ అతని ఆట తీరు మాత్రం ఏమాత్రం మారడం లేదు. పైగా పరుగులు తీయలేకపోతున్నాడు. వికెట్ కాపాడుకోలేకపోతున్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా దారుణంగా అవుట్ అవుతున్నాడు.
ఇదంతా చెప్పేది టీమిండియా యంగ్ బ్యాటర్ సంజు శాంసన్ గురించి. న్యూజిలాండ్ తో చివరి ఐదవ టి20 మ్యాచ్ తిరువనంతపురంలో జరుగుతోంది. తిరువనంతపురం అనేది సంజు శాంసన్ కు సొంత మైదానం. ప్రస్తుత సిరీస్లో సంజు అంతగా ఆకట్టుకోలేకపోతున్నాడు. భారీగా పరుగులు చేయలేకపోతున్నాడు. సమర్థవంతంగా పరుగులు చేయలేక వికెట్ పారేసుకుంటున్నాడు. ఇలా నాలుగు సందర్భాల్లో అదే జరిగింది.
తిరువనంతపురం సొంత మైదానం కావడంతో సంజు అదరగొడతాడని అందరూ అనుకున్నారు. కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ కూడా తిరువనంతపురంలో సంజు సమర్థవంతమైన ప్రదర్శన చేస్తాడని ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. టి20 వరల్డ్ కప్ ముందు సంజు స్థానాన్ని కదిలిస్తే అది మొదటికే మోసం వస్తుందని భావించిన గంభీర్, సూర్య కుమార్ యాదవ్.. అతడికి వరుసగా అవకాశాలు ఇచ్చుకుంటూ వస్తున్నారు. అయితే సంజు మాత్రం వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు.
నాలుగో టి20 మ్యాచ్లో అభిషేక్ శర్మ, సూర్య కుమార్ యాదవ్ వరుసగా అవుట్ అయినప్పుడు.. నిలబడి సమర్థవంతంగా బ్యాటింగ్ చేయాల్సిన సంజు అవుట్ అయ్యాడు. ఇక శనివారం నాడు తిరువనంతపురంలో జరుగుతున్న ఐదవ టి20 మ్యాచ్లో కూడా అదే విఫల ప్రదర్శన చేశాడు. ఆరు పరుగులు చేసిన అతడు ఫెర్గు సన్ బౌలింగ్లో జాకబ్ పట్టిన క్యాచ్ కు అవుట్ అయ్యాడు. అలా అతడి అవుట్ కావడంతో తిరువనంతపురం ప్రేక్షకులు ఒక్కసారిగా ఢీలా పడిపోయారు. వాస్తవానికి ఈ మైదానం మీద సంజు శాంసన్ కు మెరుగైన రికార్డు ఉంది. కానీ అతడు ఈ మ్యాచ్లో కొనసాగించలేకపోయాడు. అన్నింటికంటే ముఖ్యంగా మరోసారి సింగిల్ డిజిట్ స్కోర్ కు ఔట్ అయి.. పరువు తీసుకున్నాడు.
సంజు విఫలమైన ఆట తీరు ప్రదర్శిస్తున్న నేపథ్యంలో టి20 వరల్డ్ కప్ లో అతడికి తుది జట్టులో చోటు దక్కుతుందా? అనే అనుమానాలు అభిమానులలో వ్యక్తమవుతున్నాయి. ఇషాన్ కిషన్, శివం దుబే భీకరమైన ఫామ్ లో ఉన్న నేపథ్యంలో సంజుకు తుది జట్టులో చోటు దక్కేది అనుమానమేనని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.