India Vs England: ఐదు టెస్టుల సీరిస్ లో భాగంగా రాజ్ కోట్ వేదికగా ఇంగ్లాండ్, భారత్ జట్ల మధ్య జరుగుతున్న టెస్ట్ రసవత్తరంగా మారుతున్నది. తొలి రోజు మూడు వికెట్లు పడేదాకా ఇంగ్లాండ్ ఆధిపత్యం ప్రదర్శిస్తే.. తర్వాత భారత జట్టు జోరు చూపింది. శుక్రవారం మొదటి సెషన్ వరకు ఇంగ్లాండ్ బౌలర్లు దూకుడుగా బౌలింగ్ చేస్తే.. ఆ తర్వాత భారత బ్యాటర్లు జోరు చూపించారు. చివర్లో ఇంగ్లాండు బౌలర్లు సత్తా చూపించడంతో భారత్ భారీ స్కోర్ చేయలేకపోయింది. లేకుంటే ఆట మరో విధంగా ఉండేది.
గురువారం టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఇండియా.. తొలి రోజు 5 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. ఒకానొక దశలో 33 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయిన నేపథ్యంలో రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా సమయోచితంగా ఆడారు. నాలుగో వికెట్ కు రెండువందల పైచిలుకు పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. గురువారం తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఐదు వికెట్ల నష్టానికి ఇండియా 326 పరుగులు చేసింది. శుక్రవారం రెండవ రోజు ఆట ప్రారంభించిన ఇండియా ధృవ్, రవిచంద్రన్ అశ్విన్, బుమ్రా దూకుడయిన ఆటతీరు దర్శించడంతో 445 పరుగులకు ఆల్ అవుట్ అయింది. రవిచంద్రన్ అశ్విన్ మిడిల్ పిచ్ వివాదం నేపథ్యంలో అంపైర్ ఇండియాకు ఫెనాల్టీ విధించారు. దీంతో ఇంగ్లాండ్ జట్టుకు ఐదు పరుగులు లభించాయి. ఫలితంగా ఇంగ్లాండ్ జట్టు 5/0 తో తొలి ఇన్నింగ్స్ లో ఆటను ప్రారంభించింది.
మైదానం బ్యాటర్లకు క్రమేపీ సహకరిస్తున్న నేపథ్యంలో ఇంగ్లాండ్ బజ్ బాల్ బ్యాటింగ్ దూకుడుగా ప్రారంభమైంది. ముఖ్యంగా ఇంగ్లీష్ బ్యాటర్లలో బెన్ డక్కెట్ (118 బంతుల్లో 21 ఫోర్లు, 2 సిక్స్ లు 133 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు) విధ్వంసకర శతకం బాదాడు. దీంతో రెండవ రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ రెండు వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది.. క్రీజ్ లో జో రూట్(9), డక్కెట్ ఉన్నారు. జాక్ క్రాలీ(15), ఓలీ పోప్(39) త్వరగానే ఔటయ్యారు. భారత బౌలర్లలో సిరాజ్, రవిచంద్రన్ అశ్విన్ చెరో వికెట్ తీశారు. తొలి రోజు ఇంగ్లాండ్ బౌలర్లకు సహకరించిన మైదానం.. ప్రస్తుతం బ్యాటర్లకు స్వర్గధామంలా మారుతున్నది. బంతి టర్న్ కాకపోవడంతో బ్యాటర్లు పండగ చేసుకుంటున్నారు. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో వికెట్లేమీ నష్టపోకుండా 89 పరుగులు చేసిందంటే పిచ్ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 89 పరుగుల వద్ద జాక్ క్రాలీని రవిచంద్రన్ అశ్విన్ క్యాచ్ ఔట్ గా పెవిలియన్ చేర్చాడు. ఈ వికెట్ తో అశ్విన్ టెస్టుల్లో 500 వికెట్లు పడగొట్టిన ఘనత సాధించాడు. క్రాలీ ఔట్ తర్వాత ఓలీ పోప్ క్రీజ్ లోకి వచ్చాడు. అతడు కూడా దూకుడుగా బ్యాటింగ్ చేయడంతో ఇంగ్లాండు జట్టు స్కోరు పరుగులు పెట్టింది. 18.1 ఓవర్లలో ఆ జట్టు 100 పరుగులు పూర్తి చేసుకుంది.
రెండో రోజు ఆటలో హీరో ఎవరంటే అది నిస్సందేహంగా బెన్ డక్కెటే. వన్డే తరహాలో ఆడిన ఈ ఇంగ్లీష్ బ్యాటర్ 88 బంతుల్లో సెంచరీ సాధించాడు. భారత గడ్డపై అత్యంత వేగంగా శతకం బాదిన ఇంగ్లాండ్ బ్యాటర్ గా డక్కెట్ రికార్డు సృష్టించాడు. సెంచరీ అనంతరం కూడా అతడు అదే జోరు కనబరిచాడు. ఓలీ పోప్ కూడా అదే స్థాయిలో ఫోర్లు కొట్టాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ రివ్యూకు వెళ్లడంతో ఓలీ పోప్ ఎల్ బీ డబ్ల్యూ గా వెనుతిరిగాడు. దీంతో రెండో వికెట్ కు నమోదైన 93 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం క్రీ జ్ లోకి వచ్చిన జో రూట్ తో కలిసి డక్కెట్ మరో వికెట్ పడకుండా ఆటను ముగించారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ 207/2 స్థితిలో ఉంది. 238 పరుగుల వెనుకంజలో ఉంది.