ODI World Cup 2023: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రపంచ కప్ సంరంభానికి సమయం ఆసన్నమవుతోంది. ఈ ఏడాది అక్టోబర్లో భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ జరగనుంది. అందుకు అనుగుణంగా ఆతిథ్య భారతదేశం ఏర్పాటు చేస్తోంది. మ్యాచులు నిర్వహించేందుకు అవసరమైన వేదికలు కూడా ఖరారయ్యాయి. ఆ స్టేడియాల్లో ఏర్పాట్లను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. అయితే ఈ వరల్డ్ కప్ కు సంబంధించిన ట్రోఫీని కొత్తరకంగా ఆవిష్కరించారు. ట్రోఫీని అంతరిక్షం అంచుల్లో లాంచ్ చేసి ఔరా అనిపించారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాలు తెగ చక్కెర్లు కొడుతున్నాయి.
వన్డే వరల్డ్ కప్ అంటే యావత్ క్రికెట్ ప్రపంచం ఆశగా ఎదురుచూస్తోంది. క్రికెట్ ను పిచ్చిగా అభిమానించే భారతదేశంలో ఈ మెగా టోర్నీ కోసం వేయి కళ్లతో ఎదురుచూసే కోట్లాదిమంది అభిమానులు ఉన్నారు. అక్టోబర్లో భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీకు సంబంధించిన ట్రోఫీని బీసీసీఐ సరి కొత్తగా ఆవిష్కరించింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో హాట్ హాట్ గా చక్కెర్లు కొడుతున్నాయి.
లక్షా 20 వేల అడుగుల ఎత్తులో ట్రోఫీ ఆవిష్కరణ..
వన్డే వరల్డ్ కప్ ట్రోఫీని బీసీసీఐ సరికొత్తగా ఆవిష్కరించింది. ఈ ట్రోఫీని స్ట్రాటోస్పేరిక్ బెలూన్ సాయంతో ఆకాశంలోకి పంపించింది బీసీసీఐ. నేల మీద నుంచి లక్షా 20 వేల అడుగుల ఎత్తులో ట్రోఫీని ఆవిష్కరించి క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది బీసీసీఐ. అనంతరం అక్కడి నుంచి నేల మీదకు తీసుకువచ్చింది. స్ట్రాటో ఆవరణం నుంచి నేరుగా అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ ట్రోఫీ ల్యాండ్ అయింది. దీనికి సంబంధించిన ఫోటోలను ఐసిసి తమ సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయగా వేలాది మంది క్రికెట్ అభిమానులు లైక్, కామెంట్, షేర్ తో మరింత మందికి చేరువ చేస్తున్నారు.
అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసిన బీసీసీఐ..
ప్రపంచంలోనే ఆర్థికంగా పుష్టివంతమైన క్రికెట్ కంట్రోల్ బోర్డు బీసీసీఐ. బీసీసీఐ వన్డే వరల్డ్ కప్పు నిర్వహిస్తుండడంతో గ్రాండ్ గానే ఏర్పాట్లు చేస్తుందని అంతా భావించారు. బీసీసీఐ ఆ అంచనాలకు అనుగుణంగానే ట్రోఫీ ఆవిష్కరణ అట్టహాసంగా నిర్వహించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా బీసీసీఐ ట్రోఫీ ఆవిష్కరించిన తీరు అద్భుతంగా ఉందంటూ క్రికెట్ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ స్థాయిలో ట్రోఫీ ఆవిష్కరణ ఉంటుందని తామెన్నడు ఊహించలేదని పలువురు అభిమానులు పేర్కొంటున్నారు.