T20 World Cup 2024: 2007లో టి20 ప్రపంచ కప్ ప్రారంభించిన సంవత్సరంలో.. భారత్ విజేతగా ఆవిర్భవించింది. ధోని ఆధ్వర్యంలో పొట్టి ప్రపంచ కప్ ను సగర్వంగా ఎత్తుకుంది. అప్పటినుంచి ఇప్పటిదాకా మరో కప్ కోసం ఎదురు చూస్తూనే ఉంది. ఈ ప్రయాణంలో ఎన్నో ఎత్తు పల్లాలు చూసింది. ఈ క్రమంలో అమెరికా – వెస్టిండీస్ వేదికగా టి20 వరల్డ్ కప్ ప్రారంభం కాగా.. భారత్ ఎన్నో ఆశలతో బుధవారం తన టి20 వరల్డ్ కప్ ప్రయాణాన్ని మొదలుపెట్టనుంది. తన తొలి మ్యాచ్ లో ఐర్లాండ్ జట్టుతో తలపడనుంది.
2007లో వెస్టిండీస్ వేదికగా వన్డే వరల్డ్ కప్ నిర్వహించినప్పుడు.. భారత జట్టు టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగింది. కానీ దారుణమైన ఆటతీరుతో అభిమానుల ఆశలను గల్లంతు చేసింది. అదే ఏడాది ప్రవేశపెట్టిన t20 ప్రపంచ కప్ ను ధోని ఆధ్వర్యంలో టీమిండియా నెగ్గింది.. వన్డే ప్రపంచ కప్ లో పేలవమైన ప్రదర్శనతో ఏర్పడిన గాయాన్ని.. టీ -20 కప్ ద్వారా ధోని మానిపించాడు.
సరిగా ఇన్ని సంవత్సరాల తర్వాత మరోసారి వెస్టిండీస్ వేదికగా ప్రపంచ కప్ జరుగుతున్నది. ఈసారి పూర్తిస్థాయిలో వెస్టిండీస్ ఆతిథ్యం ఇవ్వడం లేదు. కానీ అప్పటికి ఇప్పటికీ భారత జట్టు పరిస్థితి పెద్దగా మారలేదు. ఈసారి కూడా వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో పరాజయాన్ని ఎదుర్కొంది. 2007 వన్డే వరల్డ్ కప్ లో తొలి రౌండులోనే ఇంటికి వచ్చిన టీమిండియా.. 2023లో మాత్రం ఫైనల్ దాకా వెళ్ళింది. సొంత గడ్డపై అద్భుతమైన విజయాలు సాధించి.. ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది.
2007 ప్రపంచ కప్ నాటి బాధలోనే ఉన్నారు ప్రస్తుతం అభిమానులు. ఆ బాధను ఇంకా దిగ మింగు కోక ముందే టి20 ప్రపంచకప్ వచ్చేసింది. 2007 వరల్డ్ కప్ లో ఆడిన ఆటగాళ్లలో మిగిలిన రోహిత్ శర్మ ప్రస్తుతం టీమిండియా కు కెప్టెన్ గా ఉన్నాడు. 2007 ప్రపంచ కప్ కెప్టెన్ గా ఉన్న ద్రావిడ్ ఇప్పుడు కోచ్ గా కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో వీరిద్దరూ తమ ఆశయాన్ని సాధిస్తారా? అభిమానుల బాధను తీరుస్తారా అనేది చూడాల్సి ఉంది.
2007లో దక్షిణాఫ్రికా వేదికగా టి20 ప్రపంచ కప్ భారత జట్టు గెలిచినప్పుడు.. ఆ జట్టులో రోహిత్ శర్మ సభ్యుడిగా ఉన్నాడు. ఇక ప్రస్తుతం టీమిండియాకు రోహిత్ శర్మ కెప్టెన్ గా ఉన్నాడు. 2007 నాటి ఆటగాళ్లలో రోహిత్ శర్మ మాత్రమే టీమిండియాలో ఉన్నాడు. ఈ క్రమంలో అద్భుతమైన అనుభవం ఉన్న రోహిత్.. తన కెప్టెన్సీ తో భారత జట్టుకు కప్ అందించాల్సిన బాధ్యత ఉంది. తన నాయకత్వ పటిమతో టీం ఇండియాను గత వరల్డ్ కప్ లో ఫైనల్ దాకా తీసుకెళ్లినప్పటికీ.. చివరి పోరులో ఆస్ట్రేలియా ముందు తల వంచడంతో.. అద్భుతమైన చరిత్ర రోహిత్ కు దూరమైంది. ఇక ప్రస్తుతం కెరియర్ పరంగా రోహిత్ చివరి ప్రపంచకప్ ఆడుతున్నాడు. ఈ తరుణంలో వన్డే వరల్డ్ కప్ లో ఓడిపోవడం ద్వారా అయిన గాయాన్ని.. టి20 కప్ ద్వారా మాన్పించే సదావకాశం రోహిత్ శర్మ ముందుంది.
2007 తర్వాత మరోసారి t20 ప్రపంచ కప్ టీం ఇండియాకు లభించలేదు. పైగా పోటీ కూడా విపరీతంగా పెరిగిపోయింది. విదేశీ మైదానాలలో పొట్టి ప్రపంచ కప్ గెలవడం అనేది ఒక రకంగా భారత క్రీడాకారులకు సవాల్ లాంటిదే. ప్రస్తుతం భారత జట్టు బౌలింగ్ బలంగా కనిపిస్తోంది. బ్యాటింగ్ కూడా అదే స్థాయిలో ఉంది.. ఇలాంటి సమయంలో టీమిండియా సమష్టిగా ఆడితే తిరుగు ఉండదు.
ఇక రాహుల్ ద్రావిడ్ భారత జట్టు శిక్షకుడిగా చివరి ప్రపంచకప్ ఆడుతున్నాడు. 2007లో వన్డే ప్రపంచ కప్ సారధిగా అతడు ఉన్నాడు. అప్పుడు టీమిండియా లీగ్ దశలోనే ఇంటికి వచ్చేసింది. ఆ సమయంలో అతడు తన సారథ్యాన్ని కూడా కోల్పోయాడు. ప్రస్తుత టి20 వరల్డ్ కప్ కోచ్ గా రాహుల్ ద్రావిడ్ కు చివరిది. తన బుర్రకు పదును పెట్టి, అద్భుతమైన వ్యూహాలు రచిస్తే టీమిండియా కు తిరుగుండదు. ఇదే సమయంలో టీమిండియా టి20 వరల్డ్ కప్ గెలిస్తే ద్రావిడ్ కు ఒక మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది. తెర వెనుక అతని పాత్ర కూడా అభిమానులకు గుర్తుండిపోతుంది.