Suryakumar Yadav And Haris Rauf: మరో రెండు రోజుల్లో ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. 41 సంవత్సరాల చరిత్ర ఉన్న ఆసియా కప్ లో తొలిసారి దాయాది జట్లైన పాకిస్తాన్, టీమిండియా ఫైనల్ వెళ్లిపోవడం ఈసారి సంచలనంగా మారింది. ఈసారి కూడా ఆసియా కప్ సాధించి సరికొత్త రికార్డు సృష్టించాలని టీమిండియా భావిస్తోంది. మరోవైపు ఫైనల్ మ్యాచ్లో విజయం సాధించి వరుస పరాజయాల పరంపరకు చరమగీతం పాడాలని పాకిస్తాన్ కృత నిశ్చయంతో ఉంది. ఈ నేపథ్యంలో ఫైనల్ మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశం కనిపిస్తోంది.
ఫైనల్ మ్యాచ్ కు ముందు..
ఫైనల్ మ్యాచ్ కు ముందు అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్, పాకిస్తాన్ బౌలర్ రౌఫ్ కు షాక్ ఇచ్చింది. ఇటీవల జరిగిన సూపర్ 4 మ్యాచ్ లో రౌఫ్ అభ్యంతరకరంగా వ్యవహరించాడు. దీంతో ఈ విషయాన్ని ఐసిసి దృష్టికి భారత క్రికెట్ మేనేజ్మెంట్ తీసుకెళ్ళింది. అతడు చేసిన సంకేతం ఇబ్బందికరంగా ఉందంటూ బోర్డు పెద్దల దృష్టికి తీసుకెళ్లింది. మరోవైపు తమకు షేక్ హ్యాండ్ ఇవ్వని వ్యవహారంపై పాకిస్తాన్ జట్టు ఐసీసీకి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదులను పరిగణలోకి తీసుకున్న ఐసీసీ.. క్రమశిక్షణ కమిటీని రంగంలోకి దింపింది. పూర్వాపరాలను పరిశీలించిన ఐసీసీ క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకుంది.రౌఫ్, సూర్య కుమార్ యాదవ్ మ్యాచ్ ఫీజులో చెరీ 30% కోత విధిస్తున్నట్టు ప్రకటించింది. మరోవైపు గన్ ఫైరింగ్ చేసిన ఫర్హాన్ ను ఐసీసీ తీవ్రంగా హెచ్చరించింది. ఇటువంటి పరిణామాలు మళ్ళీ చోటు చేసుకుంటే తీవ్ర చర్యలు ఉంటాయని గట్టిగా మందలించింది.
విచారణలో రౌఫ్ తన అడ్డగోలు తనాన్ని మరోసారి ప్రదర్శించుకున్నాడు. 6-0 కి అర్థమేంటని ఐసిసి ప్రతినిధులను అతడు తిరిగి ప్రశ్నించాడని తెలుస్తున్నాయి. మరోవైపు ఫర్హాన్ గతంలో ధోని, కోహ్లీ కూడా గన్ ఫైరింగ్ చేశారని ఐసీసీ ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. అయితే అతని వాదనతో ఐసీసీ ప్రతినిధులు విభేదించినట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఫైనల్ మ్యాచ్ ముందు ఐసీసీ తీసుకొన్న నిర్ణయం రెండు జట్లకు షాక్ ఇచ్చింది.