MI vs DC : వరుసగా మూడు ఓటముల తర్వాత ముంబై జట్టు ఈ ఐపీఎల్ సీజన్ లో తొలి విజయాన్ని అందుకుంది.. ఢిల్లీ క్యాపిటల్స్ తో ఆదివారం వాంఖడే మైదానం వేదికగా జరిగిన మ్యాచ్ లో 29 పరుగుల తేడాతో విజయం దక్కించుకుంది. విజయం సాధించినప్పటికీ హార్థిక్ పాండ్యా కెప్టెన్సీ ఇంకా డోలాయమానంలోనే ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ముందుగా ముంబై బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. దీంతో ఆ జట్టు బ్యాటర్లు సొంతమైదానంలో ఆకాశమే హద్దుగా చెలరేగారు. 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 234 పరుగులు చేశారు. రోహిత్ శర్మ 49, కిషన్ 42, డేవిడ్ 45*, షెపార్డ్ పది బంతుల్లో 39* (మూడు ఫోర్లు, నాలుగు సిక్స్ లు) చెలరేగి ఆడారు.
అనంతరం చేజింగ్ లో ఢిల్లీ జట్టు 8 వికెట్లు కోల్పోయి 205 రన్స్ చేసింది. ఢిల్లీ జట్టులో ట్రిస్టన్ స్టబ్స్ 71* (25 బంతుల్లో మూడు ఫోర్లు, ఏడు సిక్సర్లు) వీరోచితంగా పోరాడాడు. దీంతో ఢిల్లీ జట్టు ఆ స్థాయి స్కోర్ చేయగలిగింది. వాస్తవానికి 22 పరుగుల వద్ద ఢిల్లీ జట్టు డేవిడ్ వార్నర్ రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. అతడు ఔటయిన తర్వాత అభిషేక్ పోరెల్ 41, పృథ్వీ షా 66 మెరుగ్గా బ్యాటింగ్ చేసి ఢిల్లీ ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు. వీరిద్దరూ ధాటిగా ఆడుతున్న నేపథ్యంలో ఢిల్లీ గెలిచేలా కనిపించింది. వీరు రెండో వికెట్ కు ఏకంగా 88 పరుగులు నమోదు చేశారు.
ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని బుమ్రా.. పృథ్వీ వికెట్ తీసి విడగొట్టాడు. కాసేపటికే బుమ్రా అభిషేక్ నూ ఔట్ చేసి ఢిల్లీని కోలుకోకుండా చేశాడు. అయినప్పటికీ స్టబ్స్ వీరోచిత పోరాటం చేశాడు. దూకుడుగా ఆడుతూ లక్షాన్ని తగ్గించే ప్రయత్నం చేశాడు. సహచర ఆటగాళ్ళ నుంచి తోడ్పాటు లేకపోవడంతో అతడు ఒంటరి పోరాటం చేశాడు. ముంబై బౌలర్లలో బుమ్రా రెండు వికెట్లు, కొయెట్జీ నాలుగు వికెట్లు పడగొట్టాడు.
ముంబై జట్టు విజయం సాధించిన నేపథ్యంలో.. అందరి దృష్టి మొత్తం కెప్టెన్ హార్దిక్ పాండ్యా పైనే ఉంది. ఎందుకంటే వరుసగా రెండు మ్యాచ్ ల్లో జట్టును గెలిపించకపోతే కెప్టెన్సీ నుంచి పక్కన పెడతామని యాజమాన్యం హెచ్చరించిందని ఇటీవల వార్తలు వినిపించాయి.. దీనిని ధ్రువపరిచే విధంగా హార్దిక్ వ్యవహార శైలి కొనసాగింది. అంతేకాదు తన కెప్టెన్సీ పోకుండా ఉండేందుకు హార్థిక్ పాండ్యా సోమనాధుడికి పూజలు కూడా చేశాడు. ఆ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. యాజమాన్యం వరుసగా రెండు మ్యాచ్ లలో గెలిపించాలని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ముంబై ఆటగాళ్లు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆడారు. హార్థిక్ పాండ్యా కూడా సమయోచితంగా నిర్ణయాలు తీసుకున్నాడు. ఫలితంగా ముంబై జట్టు గెలిచింది. దీంతో హార్దిక్ పాండ్యా కు కొంత ఉపశమనం లభించింది. అయినప్పటికీ అతడి కెప్టెన్సీ పై కత్తి వేలాడుతూనే ఉంది. మరో మ్యాచ్ లో ముంబై ఇదే జోరు కొనసాగిస్తుందా? లేదా? అనేది వేచి చూడాల్సి ఉంది. ఒకవేళ ఇదే ఆట తీరు ప్రదర్శించకుంటే అప్పుడు హార్దిక్ కెప్టెన్ గా కొనసాగడం కష్టమవుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.