Harbhajan Singh : హర్భజన్ సింగ్ జాతీయ జట్టుకు వీడ్కోలు పలికిన తర్వాత కొద్ది రోజులు ఐపీఎల్ ఆడాడు. అనంతరం క్రికెట్ కు గుడ్ బై చెప్పేసాడు. ప్రస్తుతం అతడు వ్యాఖ్యాతగా రెండవ ఇన్నింగ్స్ మొదలు పెట్టాడు. సోషల్ మీడియాలో హర్భజన్ యాక్టివ్ గా ఉంటాడు. అప్పుడప్పుడు యూట్యూబర్లకు ఇంటర్వ్యూలు ఇస్తుంటాడు. తాజాగా ఒక పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో హర్భజన్ సింగ్ మాట్లాడాడు. ఈ సందర్భంగా అనేక విషయాలను వెల్లడించాడు. అందులో ముఖ్యమైనది మహేంద్ర సింగ్ ధోనితో తనకు మాటలు లేవని.. మేమిద్దరం మంచి స్నేహితులమైనప్పటికీ.. మాట్లాడుకోక 10 సంవత్సరాలు దాటిందని హర్భజన్ వ్యాఖ్యానించాడు. హర్భజన్ అలా అనడంతో షాక్ అవ్వడం పాడ్ కాస్టర్ వంతయింది. హర్భజన్, ధోనికి మధ్య చిరస్మరణీయమైన బంధం ఉంది. వీరిద్దరూ చాలా కాలం పాటు క్రికెట్ ఆడారు.
2007, 2011లో..
ధోని, హర్భజన్ సింగ్ 2007 t20 ప్రపంచ కప్ సాధించిన టీమిండియాలో కీలక సభ్యులు. అప్పుడు ధోని భారత జట్టుకు కెప్టెన్ గా ఉన్నాడు. 2011లో భారత్ ప్రపంచ కప్ సాధించినప్పుడు.. అప్పుడు కూడా ధోని భారత జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. హర్భజన్ సింగ్ నాటి జట్టులో కీలక సభ్యుడు.. ఐపీఎల్ లో కూడా కేవలం మైదానంలో మాత్రమే ధోని, హర్భజన్ మాట్లాడుకునేవారు. ” నేను ఆశిష్ నెహ్రతో, యువరాజు సింగ్ తో ఎక్కువ మాట్లాడేవాణ్ణి. ధోనితో మాట్లాడే వాన్ని కాదు. మేము ఐపీఎల్ లో మాత్రమే మాట్లాడుకునేవాళ్లం. ఫోన్లో మాట్లాడుకోక చాలా రోజులైంది. దాదాపు పది సంవత్సరాలు గడిచిపోయింది. నాకైతే ధోనితో మాట్లాడకపోవడానికి ఎటువంటి కారణం లేదు. ఒకవేళ అతనికి ఏదైనా కారణం ఉంటే ఉండవచ్చు. ఒకవేళ కారణం కనుక ఉంటే ధోని చెప్పేవాడు కదా..” అని హర్భజన్ వ్యాఖ్యానించాడు. హర్భజన్ చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాలలో సంచలనం సృష్టిస్తున్నాయి. వాస్తవానికి మిస్టర్ కూల్ అయిన ధోని సహచర ఆటగాళ్లతో సరదాగా ఉంటాడు. వారి నుంచి అసలైన ప్రతిభను వెలికి తీస్తాడు. కానీ హర్భజన్ అందుకు విరుద్ధమైన వ్యాఖ్యలు చేయడంతో ధోని లోని కొత్తకోణం బయటికి తెలిసింది. అయితే హర్భజన్ సింగ్ కావాలని ఈ వ్యాఖ్యలు చేస్తున్నాడని కొంతమంది అంటుంటే.. మరి కొంతమందేమో ధోని అసలు వ్యక్తిత్వం బయట పడుతోందని పేర్కొంటున్నారు.. ఈ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో హర్భజన్ మరిన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక్కొక్క ఆటగాడితో తనకున్న అనుబంధాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు.