https://oktelugu.com/

Rishabh Pant : పంత్ భయ్యా.. నువ్వు కింద పడుకుని సిక్స్ కొడితే.. ఆస్ట్రేలియా కెప్టెన్ కళ్లప్పగించి చూశాడు.. వైరల్ వీడియో

బంతి ఎదురుపడితే గట్టిగా ఎవడైనా కొడతాడు.. అదే కింద పడుకొని సిక్స్ కొడితే.. అలా కొట్టిన వాడికి ఓ రేంజ్ ఉంటుంది.. ఆ రేంజ్ ను అనుభవిస్తున్న వాడి పేరు రిషబ్ పంత్.. ఈ ఐదు అక్షరాల పేరు టీమిండియాలో ఇప్పుడు సంచలనం.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 22, 2024 4:23 pm
    Rishabh Pant

    Rishabh Pant

    Follow us on

    Rishabh Pant : రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదం నుంచి కోలుకొని వచ్చిన తర్వాత సరికొత్త క్రికెట్ ఆడుతున్నాడు. అద్భుతమైన ఇన్నింగ్స్ ను నిర్మిస్తున్నాడు. వాటిని మూడంకెల స్కోర్ లు గా మలచలేకపోతున్నప్పటికీ.. ప్రత్యర్థి బౌలర్ల గుండెల్లో సింహ స్వప్నం లాగా మిగిలిపోతున్నాడు. ఇటీవల న్యూజిలాండ్ సిరీస్ లో.. ముంబై వేదికగా జరిగిన మూడవ టెస్ట్ మ్యాచ్ రెండవ ఇన్నింగ్స్ లో.. భారత జట్టును విజయ తీరం వద్దకు రిషబ్ పంత్ చేర్చాడు. తోటి ఆటగాళ్లు విఫలమవుతున్నప్పటికీ ఒంటి చేత్తో పోరాటం చేశాడు. ఆ పోరాటం భారత ఆటగాళ్లకే కాదు, న్యూజిలాండ్ ఆటగాళ్లకు కూడా నచ్చింది. అందువల్లే అతడు ఆడుతున్నప్పుడు అభినందించారు. ఫోర్లు కొడితే చప్పట్లు కొట్టారు. సిక్స్ లు కొడితే భుజం తట్టి కీర్తించారు.. అయితే అలాంటి ఆటనే పంత్ మరోసారి నిరూపించాడు. ఆస్ట్రేలియా వేదికగా ప్రదర్శించాడు. పంత్ బ్యాటింగ్ స్టైల్ చూసి ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ సైతం ఆశ్చర్యపోయాడు. ఏం బ్యాటింగ్ అంటూ కితాబిచ్చాడు.

    37 పరుగులు..

    పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ లో భారత జట్టు ముందుగా బ్యాటింగ్ చేసింది. వెంట వెంటనే వికెట్లను కోల్పోయింది. దీంతో రిషబ్ పంత్ మరొకసారి ఆపద్బాంధవుడి పాత్ర పోషించాల్సి వచ్చింది. ఈ క్రమంలో అతడు 78 బంతులు ఎదుర్కొని 37 పరుగులు చేశాడు. ఇందులో మూడు ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి.. ముఖ్యంగా ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ బౌలింగ్ లో పంత్ కొట్టిన సిక్సర్ టీమిండియా ఇన్నింగ్స్ కే హైలెట్ గా నిలిచింది. 42 ఓవర్లో కమిన్స్ తన చివరి బంతిని అవుట్ సైడ్ హాఫ్ స్టంప్ దిశగా వేశాడు. అయితే ఆ బంతి తనకు ఎడమవైపు రావడంతో.. వెనక్కి జరిగి డీప్ బ్యాక్ వర్డ్ స్క్వేర్ మీదుగా స్కూప్ షాట్ కొట్టాడు. అయితే ఆ బంతి అమాంతం గాల్లో లేచి బౌండరీ లైన్ దాటింది. సమయంలో తల బ్యాలెన్స్ ఆపుకోలేక పంత్ ముందుగా మోకాలి పై పడిపోయాడు. ఆ తర్వాత అమాంతం శరీరం మొత్తాన్ని కిందకి వాల్చాడు. అతడు కొట్టిన దెబ్బకు బంతి స్టాండ్స్ లో పడింది. దీంతో స్టేడియం మొత్తం నవ్వులు విరిసాయి. కామెంటేటర్లు సైతం ఆశ్చర్యపోయారు. ” అద్భుతాన్ని మరోసారి ఆవిష్కరించాడు. ఇలా విచిత్రమైన గేమ్ ఆడటం పంత్ కు మాత్రమే సొంతం. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు అతడు దూకుడుగా ఆడతాడు. అందువల్లే అతడు అందరికీ నచ్చుతాడని” పంత్ ను కొనియాడారు. పంత్ కొట్టిన షాట్ చూసి ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ సైతం ఆశ్చర్యపోయాడు.