Team India T20: టీమిండియా ఉప్పల్ స్టేడియంలో జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో విజయం సాధించి ప్రేక్షకులకు కనులవిందు చేసింది. కానీ మన లోపాలు విజయంతో కనిపించకుండా పోయినా మనకు మాత్రం కచ్చితంగా కనిపిస్తున్నాయి. దీంతో రాబోయే మ్యాచుల్లో విజయం అంత సులభం కాదని తెలుస్తోంది. దక్షిణాఫ్రికాతో సెప్టెంబర్ 28 నుంచి మూడు టీ20 మ్యాచులు ఆడనుండటంతో మన లోపాలు ఎదుటివారికి ప్లస్ అయితే కష్టమే. మన విజయం కాస్త అపజయంగా మారనుందనే భయం పట్టుకుంది. ఆసీస్ తో సిరీస్ సందర్భంగా మన బౌలింగ్ గాడి తప్పినట్లు కనిపించినా బ్యాటింగుతో మెరుపులు మెరియడంతో మన లోపాలు అందులో కలిసిపోయాయి.

భువనేశ్వర్ కుమార్ 18వ ఓవర్ లో ఏకంగా 21 పరుగులు సమర్పించుకోవడం అందరిని ఆశ్చర్యపరచింది. 19వ ఓవర్ లో బుమ్రా బౌలింగ్ లో 18 పరుగులు రాబట్టారు. మన బౌలర్ల అసమర్థతను వారు క్యాష్ చేసుకున్నారు. ఫలితంగా పరుగులు రాబట్టుకున్నారు. ఇంకా తక్కువ స్కోరుకే కట్టడి చేయాల్సిన ఆసీస్ ను మన లోపంతో అత్యధిక పరుగులు సమర్పించుకోవడం తెలిసిందే. దీంతో మన వారి నైపుణ్యత లేని బౌలింగ్ ను వారు ఆడుకున్నారు. పరుగులు పిండుకున్నారు. రోహిత్ శర్మ దీనిపై ఆందోళన వ్యక్తం చేశాడు. ఇలాగైతే మన విజయం కష్టమేననే భావన వ్యక్తం చేస్తున్నాడు. బౌలింగ్ లో ఇంకా మెరుగైన ప్రదర్శన కావాలని ఆశిస్తున్నాడు.
టీ20ల్లో వేగవంతంగా బౌలింగ్ చేస్తూ ప్రత్యర్థిని కంగారు పెట్టాల్సిన మనమే గాబరా పడితే వారికే ప్లస్ అవుతోంది. హర్షల్ మాత్రం ఏడు పరుగులు ఇవ్వడం మనకు మంచి శుభ పరిణామమే కానీ మిగతా వారు కూడా తమ బౌలింగ్ నైపుణ్యం పెంచుకోవాల్సిన అవసరం ఏర్పడింది. లేకపోతే ప్రపంచ కప్ లో విజయం సాధించడం కష్టమవుతుంది. దక్షిణాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్ లో ఈ తప్పులు చేస్తే కష్టమే. వారి ఆటతీరు పటిష్టంగా ఉంది. మనం కూడా ఆ దిశగా తయారు కావాల్సిన అవసరం ఏర్పడింది.
ఈ మ్యాచ్ లో అక్షర్ పటేల్ ఒక్కడే పరిమితంగా బౌలింగ్ చేసినట్లు తెలుస్తోంది. రెండు ఓవర్లు వేసి 13 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. దీంతో ఆస్ట్రేలియాను తక్కువ స్కోరుకే పరిమితం చేయగలిగాడు. అక్షర్ లా మిగతా బౌలర్లు కూడా ఉత్తమ ప్రదర్శన చేస్తే పరిణామాలు వేరేలా ఉండేవి. కానీ అలా కాకుండా అందరు విచ్చలవిడిగా పరుగులు ఇవ్వడంతో ఆస్ట్రేలియా 180 పరుగులు చేయగలిగింది. ఇకనైనా మన బౌలర్లు పటిష్టంగా బౌలింగ్ చేసి ప్రత్యర్థిని కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చాహల్ కూడా పరిమితంగానే బౌలింగ్ చేశాడు. 22 పరుగులు ఇచ్చి ఓ వికెట్ తీశాడు.
ఇక బ్యాటర్లలో ఓపెనర్లు విఫలమైతే మిడిలార్డర్ ఆదుకుంటోంది. ఉప్పల్ లో రోహిత్ శర్మ, రాహుల్ విపలమైనా సూర్యకుమార్, విరాట్ కోహ్లి, హార్థిక్ పాండ్యాలు ఆదుకోవడం చూస్తుంటే జట్టులో సమన్వయం పెరుగుతోంది. రెండో టీ20లో చివరి ఓవర్లో 9 పరుగులు అవసరమైన సందర్భంలో రెండు బంతుల్లో సిక్స్, ఫోర్ కొట్టి కార్తీక్ భారత్ ను రేసులో నిలిపాడు. ప్రస్తుతం జట్టులో సీనియర్ ఆటగాడు డీకే కావడం తెలిసిందే. వ్యూహాలకు పదును పెట్టాల్సిందే. దీంతో టీమిండియా బౌలింగ్, ఫీల్డింగ్ మీద ప్రత్యేక ఫోకస్ పెట్టాలి. సఫారీలను ఎదుర్కోవాలంటే మన జట్టు పటిష్టంగా కావాల్సిందే మరి.