How many times South Africa has lost: 1998లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ.. అప్పట్లో దీనిని నాకౌట్ టోర్నీ అని పిలిచేవారు. నాడు దక్షిణాఫ్రికా నాకౌట్ టోర్నీ గెలిచిన తర్వాత.. ఇంతవరకు ఐసీసీ నిర్వహించే ఏ మేజర్ టోర్నీలో విజయం సాధించలేకపోయింది. గిబ్స్, పొలాక్, డొనాల్డ్ వంటి లెజెండరి ప్లేయర్లు కూడా ప్రోటీస్ జుట్టుకు వన్డే వరల్డ్ కప్ అందించలేకపోయారు.. ఆ తర్వాత తరంలో గొప్ప గొప్ప ప్లేయర్లు వచ్చినప్పటికీ పొట్టి ఫార్మాట్ లో కూడా గొప్పగా చెప్పుకునే విజయాన్ని అందించలేకపోయారు. దీంతో ప్రోటీస్ జట్టు అత్యంత దురదృష్టకరమైన జట్టుగా పేరుపొందింది.. వాస్తవానికి లెజెండరీ ప్లేయర్లు ఉన్నప్పటికీ దక్షిణాఫ్రికా జట్టు ట్రోఫీలను అందుకోలేకపోయింది. టోర్నీ ఆసాంతం గొప్పగా ఆడటం.. తీరా గెలిచే సమయంలో ఓడిపోవడం.. ఫలితంగా అత్యంత దురదృష్టకరమైన జట్టుగా దక్షిణాఫ్రికా చెత్త రికార్డును తన పేరు మీద రాసుకుంది. మోస్ట్ అన్ లక్కీ టీం గా పేరుపొందింది.
ఎన్నిసార్లు ఓడిపోయిందో తెలుసా
లెజెండరీ ప్లేయర్లు ఉన్న సఫారీ జట్టు క్రికెట్ చరిత్రలోనే లెక్కకు మిక్కిలి సార్లు ట్రోఫీలకు చేరువై ఓటమిపాలైంది.. ఐసీసీ మెగా టోర్నీలలో 12సార్లు సెమీఫైనల్ లో దక్షిణాఫ్రికా జట్టు ఓడిపోయింది. రెండుసార్లు క్వార్టర్ ఫైనల్ లో ఓడిపోయింది. ఒకసారి ఫైనల్లో ఓడిపోయింది.. 50 ఓవర్ల క్రికెట్ వరల్డ్ కప్ లో 1992, 1999, 2007, 2015, 2023లో సఫారీ జట్టు సెమీఫైనల్ మ్యాచ్లలో ఓటమిపాలైంది. ఇక టి20 వరల్డ్ కప్ లో 2024 లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఓడిపోయింది. ఇక చాంపియన్ ట్రోఫీలో 2000, 2002, 2006, 2013, 2025లో జరిగిన సెమీఫైనల్ మ్యాచులలో ఓటమిపాలైంది.. ఐసీసీ నిర్వహించిన మెగా టోర్నీలలో రెండు క్వార్టర్, 12 సెమీఫైనల్స్, ఒకసారి ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా ఓడిపోయింది. మొత్తంగా 2025లో సుదీర్ఘ ఫార్మాట్ తుది పోరులో గెలిచి 1998 తర్వాత.. 27 ఏళ్ల గ్యాప్ అనంతరం టెస్ట్ గదను సొంతం చేసుకుంది.
అనేక సందర్భాలలో ట్రోఫీలను గెలవడానికి దగ్గరగా వచ్చి ప్రోటీస్ జట్టు ఓటమిపాలైంది. నాటి సందర్భాలలో ఆటగాళ్లు గుండె పగిలే విధంగా రోదించారు. తట్టుకోలేక మైదానంలోనే కింద పడిపోయారు.. వాస్తవానికి దక్షిణాఫ్రికా జట్టు లో అద్భుతమైన ప్లేయర్లు ఉన్నారు. అనితర సాధ్యంగా పరుగులు చేసే ప్లేయర్లు ఉన్నారు. కానీ కీలక దశలో ఒత్తిడికి గురి కావడంతో వారు చాలా సందర్భాలలో చేతులెత్తేశారు. అయితే ఇన్నాళ్లకు వారి మొర దేవుడు ఆలకించినట్టున్నాడు. అందువల్లే విజయం సాధించారు. బలమైన కంగారు జట్టును లార్డ్స్ మైదానంలో పడుకోబెట్టి.. టెస్ట్ గదను అందుకున్నారు. గదను అందుకున్న తర్వాత ఆటగాళ్లు ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు.. కన్నీటి పర్యంతమవుతూ ఆలింగనం చేసుకుంటూ.. సంబరాలు జరుపుకున్నారు.