Rohit Sharma records: టీమిండియాలో రోహిత్ శర్మను హిట్ మాన్ అని పిలుస్తుంటారు. ఎందుకంటే అతడు చేసే బ్యాటింగ్ ఆ స్థాయిలో ఉంటుంది కాబట్టి. రోహిత్ శర్మ టీం మీడియా సాధించిన ఎన్నో విజయాలలో ముఖ్యపాత్ర పోషించాడు. దశాబ్దాలుగా టీమిండియా క్రికెట్ గతిని అతడు మార్చేస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం అతడి వయసు 38 సంవత్సరాలు అయినప్పటికీ.. ఏ మాత్రం వెనకడుగు వేయకుండా బ్యాటింగ్ చేస్తున్నాడు. అదనపు బరువును పూర్తిగా తగ్గించుకొని.. సన్న జాజి తీగలాగా మారిపోయాడు. వికెట్ల మధ్య వేగంగా పరుగులు పెడుతున్నాడు. తాజా ఆస్ట్రేలియా సిరీస్ లో ఒక సెంచరీ, మరో హాఫ్ సెంచరీ తో రోహిత్ అదరగొట్టాడు. మెన్ ఆఫ్ ది మ్యాచ్, సిరీస్ అవార్డులను కూడా సొంతం చేసుకున్నాడు.
సిడ్నీ మైదానంలో..
సిడ్నీ మైదానంలో జరిగిన మూడో వన్డేలో సెంచరీ చేయడం ద్వారా రోహిత్ శర్మ అనేక రికార్డులను బద్దలు కొట్టాడు.. ఇదే మైదానంలో 2008 లో ఆస్ట్రేలియా తో జరిగిన మ్యాచ్ లో 87 బంతుల్లో 66* రన్స్ చేసి.. భారత జట్టు గెలుపులో ముఖ్య పాత్ర పోషించాడు. 2016లో ఇదే మైదానంలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో 108 బంతుల్లో 99 పరుగులు చేసి టీమ్ ఇండియాను గెలిపించాడు. ఇక ప్రస్తుత సిరీస్ లో 125 బంతుల్లో 121* పరుగులు చేసి భారత జట్టు విజయంలో ముఖ్యపాత్ర పోషించాడు.
భాగస్వామ్యాలపరంగా
విరాట్ కోహ్లీతో ఈ మ్యాచ్లో 150 పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నమోదు చేసిన రోహిత్.. సరికొత్త రికార్డు సృష్టించాడు. టెండూల్కర్, గంగూలీ సరసన విరాట్, రోహిత్ జోడి చేరింది. అంతేకాకుండా రోహిత్ వన్డే ఫార్మాట్లో 68 సార్లు 100కు పైగా పరుగుల భాగస్వామ్యాలను నిర్మించాడు. టీం ఇండియా సాధించిన విజయాలలో తన వంతు పాత్ర పోషించాడు. గంగూలీ, సచిన్ 12సార్లు 150 కి పైగా పరుగుల భాగస్వామ్యాలను నమోదు చేశారు. విరాట్, రోహిత్ కూడా 12సార్లు 150 కి పరుగులకు పైగా భాగస్వామ్యాలను నమోదు చేశారు. దిల్ షాన్, సంగక్కర కూడా వన్డేలలో శ్రీలంక తరఫున ఏడుసార్లు 150 కి పైగా పరుగుల భాగస్వామ్యాలను నమోదు చేశారు.
సెంచరీల పరంగా
తాజా సెంచరీ తో రోహిత్ అన్ని ఫార్మాట్లో కలిపి 50 శతకాలు చేసిన ఆటగాడిగా నిలిచాడు. రోహిత్ టెస్టులలో 12, వన్డేలలో 33, టి20లలో ఐదు సెంచరీలు చేశాడు.. అంతేకాదు ఆస్ట్రేలియా జట్టుపై వన్డే ఫార్మాట్లో పర్యాటక జట్టు తరఫున అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలిచాడు. 33 ఇన్నింగ్స్లలో అతడు ఆస్ట్రేలియా జట్టుపై ఆరు సెంచరీలు చేశాడు. విరాట్ కోహ్లీ 32 ఇన్నింగ్స్ లలో ఐదు సెంచరీలు, శ్రీలంక ఆటగాడు కుమార సంగకర 49 ఇన్నింగ్స్ లో ఐదు సెంచరీలు చేశాడు. పర్యాటక, ఆతిధ్య జట్ల విభాగాలను కలుపుకుంటే ఆస్ట్రేలియా మీద రోహిత్ శర్మ ఏకంగా తొమ్మిది సెంచరీలు చేశాడు. ఈ జాబితాలో సచిన్ తర్వాతి స్థానంలో అతడు కొనసాగుతున్నాడు.