
IPL corona: ఐపీఎల్ తొలి భాగాన్ని కరోనా(Corona) ఆవహించి అర్థాంతరంగా ఆపేసింది. ఇప్పుడు రెండో భాగాన్ని కూడా కరోనా కమ్మేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ను కరోనా వదలనంటోంది. ఈ ఆదివారం ప్రారంభమైన లీగ్ లో మ్యాచ్ లు ఉత్కంఠగా సాగుతున్న వేళ అభిమానులకు షాకిస్తూ ఆటగాడు కరోనా బారినపడ్డాడు. లీగ్ ప్రారంభమైన నాలుగోరోజే సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు , భారత స్టార్ పేసర్ టి.నటరాజన్(Natarajan) కు పాజిటివ్ రావడంతో అంతా షాక్ అయ్యారు. నటరాజన్ తో సన్నిహితంగా ఉన్న ఆరుగురు క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. ఈరోజు రాత్రి ఢిల్లీతో సన్ రైజర్స్ మ్యాచ్ ఉంది. ఈ కీలక సమయంలో సన్ రైజర్స్ స్టార్ పేసర్ నటరాజన్ కరోనా బారినపడడం కలకలం రేపుతోంది.
ఇక నటరాజన్ తో సన్నిహితంగా ఆల్ రౌండర్ విజయ్ శంకర్ కూడా ఉన్నాడు. మిగతా ఆటగాళ్లు అందరికీ నెగెటివ్ రావడంతో వారు ఆడనున్నారు.ఢిల్లీతో మ్యాచ్ కు కొద్ది గంటల ముందు సన్ రైజర్స్ బౌలర్ నటరాజన్ కరోనా బారినపడినట్లు ఐపీఎల్ ప్రకటించింది. అయితే నటరాజన్ కు ఎలాంటి లక్షణాలూ లేవని.. జ్వరం, దగ్గు, జలుబు లాంటి సాధారణ లక్షణాలు కూడా లేవని తెలుస్తోంది.
ప్రస్తుతం నటరాజన్ ను దుబాయ్ హోటల్ లో మిగతా టీం సభ్యులకు దూరంగా ఐసోలేషన్ లో ఉంచారు. నటరాజన్ ఇటీవలే గాయం నుంచి కోలుకొని పూర్తి ఫిట్ నెస్ సాధించాడు. ఐపీఎల్ 2021 కోసం యూఏఈ వచ్చాడు. ఒక్క మ్యాచ్ ఆడకుండానే అతడికి కరోనా సోకడంతో ఇప్పుడు టోర్నీలో ఆడడం అనుమానంగా మారింది.
నటరాజన్ తోపాటు సన్నిహితంగా ఉన్న సన్ రైజర్స్ ప్లేయర్ విజయ్ శంకర్ కూడా ఐసోలేషన్ లోకి వెళ్లాడు. ఇద్దరితోపాటు ఎస్ఆర్.హెచ్ టీం మేనేజర్ విజయ్ కుమార్, ఫిజియో శ్యామ్ సుందర్, డాక్టర్ అంజనా వన్నన్, నెట్ బౌలర్ పెరియసామి, తుషార్ ఖేడ్కర్ లను ఐసోలేషన్ లోకి పంపారు.
అందరికీ కరోనా పరీక్షలు చేయగా.. మిగతా సన్ రైజర్స్ ఆటగాళ్లకు నెగెటివ్ వచ్చింది. దీంతో ఢిల్లీతో మ్యాచ్ షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని ఐపీఎల్ స్పష్టం చేసింది.