Danish Kaneria: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో మంగళవారం (ఏప్రిల్ 22న) జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా ఆగ్రహాందోళనలను రేకెత్తించింది. ఈ దాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. ఈ ఘటనపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ దాడి వెనుక పాకిస్తాన్ పాత్ర లేకపోతే, ఎందుకు ఉలికిపాటు పడుతోందని ప్రశ్నించారు.
Also Read: ఉగ్రవాదులు బైసరన్ లోయనే ఎందుకు ఎంచుకున్నారు? కారణాలు ఇవే
బైసరన్ మేడోస్‌లో రక్తపాతం
పహల్గామ్‌లోని బైసరన్ మేడోస్‌లో జరిగిన ఈ దాడి, 2019 పుల్వామా దాడి తర్వాత కాశ్మీర్‌లో జరిగిన అత్యంత ఘోరమైన ఉగ్రదాడుల్లో ఒకటిగా నిలిచింది. సైనిక దుస్తులు ధరించిన ఆరుగురు ఉగ్రవాదులు, ఆటోమేటిక్ ఆయుధాలతో పర్యాటకులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో మరణించిన వారిలో ఒక నవవరుడు,వ్యాపారవేత్త, నేవీ అధికారి వినయ్ నర్వాల్ వంటి వ్యక్తులు ఉన్నారు. దాడి బాధ్యతను లష్కర్–ఎ–తోయిబాతో సంబంధం ఉన్న ‘ద రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్‌ఎఫ్)’ సంస్థ వహించినట్లు తెలుస్తోంది. ఉగ్రవాదులు పురుష పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని, వారి మతాన్ని అడిగి దాడి చేసినట్లు సాక్షులు తెలిపారు.
డానిష్ కనేరియా ఆగ్రహం..
పాకిస్తాన్ మాజీ లెగ్ స్పిన్నర్ డానిష్ కనేరియా, హిందూ మతస్థుడైన తొలి పాకిస్తాన్ క్రికెటర్‌లలో ఒకరు, ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో ఆయన రాసిన పోస్ట్‌లో, ‘‘పహల్గామ్ ఉగ్రదాడిలో పాకిస్తాన్ పాత్ర లేకపోతే, ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇంతవరకు ఎందుకు ఖండించలేదు? పాక్ సైన్యం హఠాత్తుగా ఎందుకు అప్రమత్తమైంది? ఎందుకంటే వారికి సత్యం తెలుసు. పాకిస్తాన్ ఉగ్రవాదులను ఆశ్రయిస్తూ, పెంచి పోషిస్తోంది,’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సహకారం లేకుండా ఇటువంటి దాడులు సాధ్యం కాదని, హిందూ పర్యాటకులను ఎందుకు లక్ష్యంగా చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. కనేరియా గతంలోనూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తనను మతపరమైన కారణాలతో వివక్ష చూపిందని ఆరోపించిన సంగతి తెలిసిందే.
పాకిస్తాన్ ఖండన..
ఇదిలా ఉంటే.. పహల్గామ్ దాడిపై పాకిస్తా¯Œ ఆలస్యంగా స్పందించింది. అంతర్జాతీయంగా భారత్‌కు మద్దతు పెరగడంతో పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ స్పంచారు. దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించారు. ఇది భారతదేశంలోని ‘‘హిందుత్వ రాజకీయాల’’కు వ్యతిరేకంగా జరిగిన ‘‘స్థానిక తిరుగుబాటు’’ అని వాదించారు. పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా ఈ దాడిని ‘‘ఉగ్రవాద చర్య’’గా ఖండించకుండా, కేవలం ‘‘ఆందోళన’’ వ్యక్తం చేసింది. అయితే, దాడి తర్వాత పాకిస్తాన్ సైన్యం అప్రమత్తమై, కరాచీ నుంచి రావల్పిండిలోని నూర్ ఖాన్ వైమానిక స్థావరానికి యుద్ధ విమానాలను తరలించినట్లు సమాచారం. ఈ చర్యలు పాకిస్తాన్‌లో ఆందోళనను సూచిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
రాజకీయ, క్రీడా ప్రముఖుల స్పందన
ఈ దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సౌదీ అరేబియా పర్యటనను అర్ధంతరంగా ముగించి, భద్రతా వ్యవహారాల కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఇండస్ నీటి ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేయడం, అటారీ సరిహద్దు మూసివేయడం వంటి కఠిన చర్యలు తీసుకున్నారు. రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్, దాడి వెనుక ఉన్నవారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. క్రీడా రంగం నుంచి విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్, గౌతమ్ గంభీర్ వంటి క్రికెటర్లు ఈ దాడిని ఖండిస్తూ సంతాపం తెలిపారు. మాజీ క్రికెటర్ శ్రీవాత్స్ గోస్వామి, పాకిస్తాన్‌తో క్రికెట్ సంబంధాలను పూర్తిగా తెంచుకోవాలని డిమాండ్ చేశారు. బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కూడా ఈ దాడిని ‘‘మానవత్వానికి విరుద్ధం’’ అని వ్యాఖ్యానించారు.
అంతర్జాతీయ స్పందనలు..
ఈ దాడిని అమెరికా, రష్యా, ఆస్ట్రేలియా, నేపాల్ వంటి దేశాలు ఖండించాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ.వాన్స్, భారత్‌లో పర్యటిస్తున్న సమయంలో ఈ దాడిని ఖండిస్తూ, భారత్‌కు సంపూర్ణ మద్దతు అందిస్తామని ప్రకటించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారత్‌కు సహకరిస్తామని చెప్పారు.
ఉగ్రవాదుల చిత్రాలు విడుదల..
భారత భద్రతా బలగాలు ఈ దాడిలో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదుల స్కెచ్‌లను విడుదల చేశాయి. వీరి పేర్లు అసిఫ్ ఫౌజీ, సులేమాన్ షా, అబు తల్హా అని తెలిపాయి. అనంత్‌నాగ్, పుల్వామా జిల్లాల్లో విస్తృత శోధన కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) కూడా విచారణలోకి దిగింది.
భద్రతా వైఫల్యాలు..
పహల్గామ్ దాడి భద్రతా వైఫల్యాలను బయటపెట్టిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బైసరన్ మేడోస్ వంటి పర్యాటక ప్రాంతంలో భద్రతా ఏర్పాట్లు లేకపోవడంపై స్థానిక నాయకులు ప్రశ్నలు లేవనెత్తారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్‌లో శాంతి నెలకొందని ప్రభుత్వం చెప్పినప్పటికీ, ఈ దాడి స్థానిక అసంతృప్తి, ఉగ్రవాద కార్యకలాపాలను మరోసారి బహిర్గతం చేసింది.