Pakistan Vs India Asia Cup 2025: చమత్కారం ఉంటుంది. అదే స్థానంలో మమకారం కూడా ఉంటుంది. తిక్క రేగితే గొడ్డుకారం రేంజ్ లో ఆగ్రహం కూడా ఉంటుంది. తెలుగు వాళ్ల గురించి చెప్పాలంటే పై ఉపోద్ఘాతం నూటికి నూరుపాళ్ళు సరిపోతుంది. కష్టం వస్తే అక్కున చేర్చుకుంటారు. బాధ అనిపిస్తే గుండెలకు హత్తుకుంటారు. ఆకలిగా ఉందంటే కడుపుకు ఇంత బువ్వ పెడతారు. అలాగే దేశం విషయంలో ఎక్కువ తక్కువ మాట్లాడితే కోసి కారం పెడతారు. తెలుగోళ్లకు పౌరుషం ఎక్కువగా ఉంటుంది.. కాబట్టే ఇలా వ్యవహరిస్తుంటారు.
ఆసియా కప్ ప్రారంభానికి ముందు పాకిస్తాన్ ప్లేయర్లు ఓవర్ గా మాట్లాడారు. మన జట్టను తక్కువ చేసి వ్యాఖ్యానించారు. మైదానంలో అదరగొడతామని.. టీమ్ ఇండియాను బెదరగొడతామని.. ఆసియా కప్ వెతుకుపోతామని.. బీభత్సంగా సెటైర్లు వేశారు. కొందరు పాకిస్తాన్ మాజీ ఆటగాళ్ళు అయితే భయం అంటే ఏమిటో మా ఆటగాళ్లు చూపిస్తారని హెచ్చరికలు కూడా చేశారు. ఇక సామాజిక మాధ్యమాల ప్రభావిత వ్యక్తులు ఇష్టానుసారంగా మాట్లాడారు. ఇన్ని జరిగినప్పటికీ భారత శిబిరం నుంచి ఒక్క ప్రతిస్పందన కూడా ఎదురు కాలేదు. మాజీ ప్లేయర్ లో నుంచి మొదలు పెడితే సామాజిక మాధ్యమాల ప్రభావిత వ్యక్తుల వరకు అందరూ నిశ్శబ్దాన్ని పాటించారు. కానీ ఆ తర్వాతే అసలు సినిమా చూపించడం మొదలుపెట్టారు.
ఆసియా కప్లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్లో భారత్ దాయాది జట్టుకు దిమ్మతిరిగిపోయే షాక్ ఇచ్చింది. ఏకంగా 7 వికెట్ల తేడాతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా భారత ఇన్నింగ్స్ సమయంలో పాకిస్తాన్ ఫీల్డర్లు చేసిన తప్పులు మామూలువికావు. ఆ తప్పుల వల్ల భారత ఆటగాళ్లు జీవధానాలతో పాటు.. పరుగులు కూడా భారీగా సాధించారు. దీంతో దాయాది జట్టు మీద తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా మ్యాచ్ లైవ్ టెలికాస్ట్ ఐతున్నప్పుడు తెలుగు కామెంట్రీ బాక్స్ లో ఉన్న వ్యక్తులు పాకిస్తాన్ జట్టు ప్లేయర్లను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. దీంతో సోషల్ మీడియాలో ఈ వీడియో నవ్వులు పూయిస్తోంది. తెలుగు వాళ్లతో పెట్టుకుంటే ఇలానే ఉంటుంది అంటూ అభిమానుల నుంచి హెచ్చరికలు వస్తున్నాయి.