Chennai Super Kings fans : ఐపీఎల్ లో అత్యంత బలమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న జట్లలో చెన్నై ముందు వరుసలో ఉంటుంది. ఐపీఎల్ చరిత్రలో ఐదు సార్లు విజేతగా నిలిచిన ఘనత చెన్నై జట్టుకుంది. చెన్నై జట్టును అన్నిసార్లు ఛాంపియన్ గా నిలిపిన స్టామినా ధోనికి ఉంది. అందువల్లే అతడిని తలా అని పిలుస్తుంటారు.
చెన్నై జట్టుకు బలమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పుకున్నాం కదా.. అనేక సందర్భాలలో ఇది నిరూపితమైంది. సోషల్ మీడియాలో చెన్నై జట్టు మేనేజ్మెంట్ నుంచి చిన్న అప్డేట్ వచ్చినా చాలు.. చూస్తుండగానే విపరీతంగా సర్కులేట్ అవుతుంది. దీనిని బట్టి చెన్నై జట్టుకు ఉన్న అభిమానుల బలాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇతర వేదికలలో ఆడితేనే మైదానం మొత్తం పసుపు వర్ణంతో కనిపిస్తుంది. అటువంటిది సొంతమైదానంలో చెన్నై జట్టు ఆడితే ఎల్లో ఆర్మీ సందడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఐపీఎల్ లో ప్రస్తుతం చెన్నై జట్టు పంజాబ్ తో తలపడుతోంది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసి డబుల్ సెంచరీ స్కోర్ చేసింది. ఆయుష్ మెరుపు వేగంతో హాఫ్ సెంచరీ చేశాడు. చెన్నై ఇన్నింగ్స్ కంటే ముందు మైదానంలో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. అది చెన్నై అభిమానుల బలాన్ని మరోసారి ప్రపంచానికి సగర్వంగా చాటిచెప్పింది.
మ్యాచ్ ప్రారంభానికి ముందు టాస్ వేసే ప్రక్రియ జరిగింది. అది పూర్తి అయిన తర్వాత చెన్నై జట్టు కెప్టెన్ తో మాట్లాడినందుకు వ్యాఖ్యాత ఇయాన్ బిషప్ వచ్చారు. ఆ సమయంలో మైదానంలో ఉన్న చెన్నై అభిమానులు విజిల్ పోడు.. చెన్నై ఆర్మీ.. ఎల్లో ఆర్మీ.. అంటూ నినాదాలు చేశారు. వారి నినాదాలకు మైదానం మొత్తం హోరెత్తిపోయింది. దీంతో బిషప్ మాట్లాడే మాటలు గైక్వాడ్ కు వినిపించలేదు. దీంతో బిషప్ గైక్వాడ్ కు క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. అంతేకాదు మైక్ పట్టుకొని నాలుగు అడుగులు ముందుకు వచ్చి.. గైక్వాడ్ నోటికి దగ్గరగా పెట్టి మాట్లాడాల్సి వచ్చింది. “నన్ను క్షమించండి. ఇంతకుమించి నేను ఏమి చేయలేను. ఇది ఎంతవరకు సాగుతుందో తెలియదు. వారి నినాదాల ముందు నేను చెప్పేది మీకు వినిపించడం లేదు. అందువల్లే ముందుకు వచ్చానని” బిషప్ గైక్వాడ్ తో వ్యాఖ్యానించాడు.. బిషప్ వ్యాఖ్యల నేపథ్యంలో.. సోషల్ మీడియాలో చెన్నై అభిమానులు గర్వంతో పోస్టులు పెడుతున్నారు. మా గుండెల్లో ఎప్పటికీ చెన్నై జట్టు నిలిచి ఉంటుందని.. మా సొంత మైదానంలో చెన్నై జట్టు ఆడుతోంది అంటే అంతకుమించిన ఆనందం మరొకటి ఉండదని.. ఆ ఉత్సాహాన్ని ఇలా ప్రదర్శించామని చెన్నై అభిమానులు చెబుతున్నారు.
