CSK Vs DC: భారీగా పరుగులు నమోదైన చోట వికెట్లు తీయడం కష్టమవుతుంది. పిచ్ నుంచి సహకారం లభించకపోవడం.. బంతిపై నియంత్రణ లేకపోవడం.. డ్యూ ఉండటం.. ఇవన్నీ కూడా కారణాలుగా నిలుస్తాయి. ఐపీఎల్ లాంటి రన్ కోస్టర్ టోర్నీలలో అరుదైన సందర్భాలలో బ్యాటర్లు అదరగొడితే.. బౌలర్లు బెదరగొడతారు. అటువంటి సంఘటన ఆదివారం నాటి ఢిల్లీ, చెన్నై (DC vs CSK) మ్యాచ్ లో జరిగింది. ముఖ్యంగా చెన్నై అభిమానులు ఇప్పట్లో ఈ మ్యాచ్ ను మర్చిపోరు. ఎందుకంటే ఆ స్థాయిలో అద్భుతాలు చేశారు ఆ జట్టు ఆటగాళ్లు. ముఖ్యంగా వీరిద్దరు.
టి20 వరల్డ్ కప్ ను టీమిండియా గెలిచిన తర్వాత సంజు శాంసన్ (Sanju Samson) ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. ఐపీఎల్ లో మాత్రం ఆ స్థాయిలో ఆడ లేకపోయాడు. భారీగా అంచనాలు ఉండడం.. ఒత్తిడి వల్ల తన స్థాయి టెక్నిక్ ప్రదర్శించలేకపోయాడు. పరుగుల ప్రవాహాన్ని సాగించలేకపోయాడు. దీంతో విమర్శలు.. వీటన్నింటికీ ఒకే ఒక ఇన్నింగ్స్ తో సమాధానం చెప్పాడు సంజు. ఏకంగా 115* పరుగులు చేసి వారెవా అనిపించాడు.. ఢిల్లీ బౌలర్లకు 70 ఎంఎం సినిమా చూపించాడు. ఈ ఐపీఎల్లో తొలి సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు.
సంజు అదరగొడితే.. ఓవర్టన్ (Jamie Overton) ఢిల్లీ బ్యాటర్లను బెదరగొట్టాడు. సూపర్ బౌలింగ్ వేసి సంచలనం సృష్టించాడు. కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి.. నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఈ ఐపీఎల్లో ఇప్పటివరకు ఈ స్థాయిలో ఏ బౌలర్ కూడా ప్రదర్శన చేయలేకపోయాడు. పిచ్ నుంచి సహకారం లేకపోయినప్పటికీ.. బంతిపై నియంత్రణ కలిగి ఉంటే వికెట్లు కచ్చితంగా తీయవచ్చు అని ఓవర్టన్ నిరూపించాడు.. ఐపీఎల్ లో బౌలర్లు ధారాళంగా పరుగులు ఇస్తున్న చోట ఓవర్టన్ ఏమాత్రం భయపడకుండా బౌలింగ్ వేశాడు. లైన్ అండ్ లెంగ్త్ తో బంతులు విసిరి.. వికెట్లు పడగొట్టాడు.. తద్వారా ఈ ఐపీఎల్లో ఇప్పటివరకు ఏ బౌలర్ కూడా సాధించని గణాంకాలను తన పేరుమీద లిఖించుకున్నాడు. బ్యాటింగ్లో సంజు 115* పరుగులు చేసి.. ఇప్పటివరకు ఈ ఐపీఎల్లో బ్యాటర్ సాధించని రికార్డు సృష్టించాడు..
సలార్ సినిమాలో ఒకడు గర్జన.. ఒకడు ఉప్పెన. వెరసి ప్రళయాలే.. అని ఒక పాట ఉంటుంది. ఆ పాటకు తగ్గట్టుగానే సంజు బ్యాటింగ్.. ఓవర్టన్ బౌలింగ్ సాగిపోయింది. మ్యాచ్ చూస్తున్న చెన్నై అభిమానులకు అసలు సిసలైన క్రికెట్ మజా లభించింది. తలా లేకపోయినా.. ఆ లోటును వీరిద్దరూ భర్తీ చేశారు. దీంతో చెన్నై అభిమానులు విజిల్ పోడు అంటూ మైదానంలో సందడి చేశారు.