Bengaluru Stampede : ఈ సీజన్లో ఐపీఎల్ విజేతగా నిలిచింది కన్నడ జట్టు. ఐపీఎల్ ప్రారంభమై ఎన్ని సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కన్నడ జట్టు ఒక్కసారి కూడా విజయం సాధించలేదు. అయితే తుది పోరులో అయ్యర్ జట్టుపై కన్నడ జట్టు విజయం సాధించింది. తద్వారా ఐపిఎల్ చరిత్రలో తొలిసారి విజేతగా నిలిచింది. సంవత్సరాలుగా ఎదురుచూసిన తర్వాత విజయం సాధించడంతో కన్నడ ఆటగాళ్ల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ప్రపంచాన్ని జయించినంత స్థాయిలో సంబరాలు జరుపుకున్నారు. ఐపీఎల్ ట్రోఫీ సాధించిన నేపథ్యంలో సొంత గడ్డపై విజయ యాత్ర నిర్వహించాలని కన్నడ జట్టు నిర్ణయించింది. ఫైనల్లో విజయం సాధించిన అనంతరం ఆగ మేఘాల మీద ప్రకటన చేసింది. దీంతో నిర్వాహకులకు తక్కువ సమయం ఉండడం.. పోలీసుల నుంచి అనుమతి రాకపోవడంతో విజయ యాత్ర నిర్వహణపై నీలి నీడలు కమ్ముకున్నాయి. చివరికి ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో పోలీసులు ఒప్పుకోక తప్పలేదు. అయినప్పటికీ విజయ యాత్ర నిర్వహణలో అనేక నిబంధనలు విధించారు. ఆ నిబంధనలను కన్నడ జట్టు అమలు చేయలేకపోయింది. భారీగా ప్రేక్షకులు రావడంతో వారిని అదుపు చేయడం పోలీసుల వల్ల కాకపోయింది. దీంతో ఊహించని దారుణం చోటుచేసుకుంది.
అభిమానులు భారీగా రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో లెక్కకు మిక్కిలి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. చాలామంది గాయపడ్డారు. ఈ ఘటన రాజకీయంగా కన్నడ సీమలో పెను దుమారం రేపింది. దీంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. విచారణ నేపథ్యంలో జ్యుడీషియల్ కమిషన్ కీలక నివేదిక వెల్లడించింది.. జరిగిన దారుణానికి బెంగళూరు జట్టు, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్, ఈవెంట్ నిర్వహించిన డిఎన్ఏ ఎంటర్టైన్మెంట్, పోలీసులదే బాధ్యత అని నివేదిక సమర్పించింది. ఈ జ్యూడిషల్ కమిషన్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు నివేదిక అందించింది. అయితే ఈ దారుణంలో 11 మంది చనిపోయారు. 50 మందికి పైగా గాయపడ్డారు. జరిగిన దారుణంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బీసీసీఐ పెద్దలు కూడా ఆవేదన వ్యక్తం చేశారు.
జరిగిన ఘటనలో బెంగళూరు జట్టు యాజమాన్యానిది కీలకపాత్ర ఉండడంతో బిసిసిఐ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఫిక్సింగ్ ఆరోపణలు వస్తేనే రాజస్థాన్, చెన్నై జట్లపై కొద్ది సంవత్సరాల పాటు బీసీసీఐ సస్పెన్షన్ విధించింది. ఆ తర్వాత ఆ జట్లకు ఆడే అవకాశం కల్పించింది. 11 మంది ప్రాణాలు పోవడానికి .. 50 మందికి పైగా గాయపడడానికి కారణమైన బెంగళూరు జట్టుపై బిసిసిఐ ఎటువంటి చర్యలు తీసుకుంటుందోననే చర్చ మొదలైంది..
వాస్తవానికి విజయ యాత్ర నిర్వహించే తేదీని బెంగళూరు జట్టు యాజమాన్యం అప్పటికప్పుడు ప్రకటించింది..పాస్ ల విషయంలోనూ చివరి వరకు సందిగ్ధతను కొనసాగించింది. దీంతో అభిమానులు భారీగా బెంగళూరుకు వచ్చారు. చిన్న స్వామి స్టేడియం ఎదుట బారులు తీరారు. గేట్లు ఓపెన్ చేయకపోవడంతో గోడ ఎక్కి స్టేడియంలోకి వెళ్లాలనుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు రంగ ప్రవేశం చేసి అభిమానులను అదుపు చేయడానికి ప్రయత్నించారు. చివరికి తొక్కిసలాట జరగడంతో 11మంది అభిమానుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. 50 మందికి పైగా అభిమానులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇప్పటికి చాలామంది కోలుకోలేదు.