IND Vs ENG: ఎన్ని అవకాశాలు ఇచ్చినా సద్వినియోగం చేసుకోకపోవడంతో టీమిండియా బ్యాటర్ రజత్ పాటిదార్ పై వేటు పడింది. ఇంగ్లాండ్ తో ధర్మశాల వేదికగా జరిగే ఐదో టెస్టు లో అతడికి బదులు దేవదత్ పడిక్కాల్ కు చోటు దక్కుతుందని తెలుస్తోంది.. ఇప్పటికే భారత్ సిరీస్ గెలిచిన నేపథ్యంలో ఐదో టెస్టు నామమాత్రంగా మారింది. కేఎల్ రాహుల్ ఐదో టెస్టులోనైనా ఆడతాడనుకుంటే అతడు ఇంకా ఫిట్ నెస్ సాధించలేదు. అతడు ఆడతాడని ఊహగానాలు వినిపిస్తున్నప్పటికీ.. పూర్తిస్థాయిలో గాయం నుంచి కోలుకోలేదని తెలుస్తోంది. రాహుల్ స్థానంలో కర్ణాటక వాసి దేవ్ దత్ పడిక్కల్ ను ఆడిస్తారని ప్రచారం జరుగుతోంది. అతడికి రోహిత్ శర్మ, రాహుల్ ద్రావిడ్ అండగా ఉన్నట్టు సమాచారం. మరోవైపు వరుసగా మూడు టెస్టుల్లో విఫలమైన రజత్ పాటిదార్ ను పక్కన పెట్టడం లాంఛనమే అనే చర్చ జరుగుతోంది. ఒకవేళ రాహుల్ అందుబాటులోకి వస్తే పాటిదార్ రిజర్వ్ బెంచ్ కు పరిమితమవుతాడు
పడిక్కల్ కనుక 5 టెస్టుల్లోకి ఎంట్రీ ఇస్తే ఈ సిరీస్ లో ఆరంగేట్రం చేసిన నాలుగో భారతీయ ఆటగాడిగా ఘనత సృష్టిస్తాడు. ఇప్పటికే రాంచి టెస్టులో సర్ఫరాజ్ ఖాన్, రజత్ పాటిదార్, ధృవ్ జురెల్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చారు. ఇందులో పాటిదార్ మినహా మిగతా వారంతా ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో అదరగొడుతున్నారు. ముఖ్యంగా జురెల్ తన అద్భుతమైన ఆట తీరుతో రాంచి మైదానంలో భారత జట్టుకు చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు.. రజత్ మాత్రం వచ్చిన అవకాశాలను చేజార్చుకున్నాడు. ఆరు ఇన్నింగ్స్ ల్లో అతడు కేవలం 64 పరుగులు మాత్రమే చేయగలిగాడు. దీంతో అతడిని తప్పించి పడిక్కల్ ను జట్టులోకి తీసుకోవాలని డిమాండ్లు పెరుగుతున్నాయి.
పడిక్కల్ కొంతకాలంగా రంజీ మ్యాచ్ లలో దూకుడుగా ఆడుతున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లోనూ సత్తా చాటాడు. ఎడమ చేతి వాటం గల ఈ బ్యాటర్ భారీ ఇన్నింగ్స్ లు ఆడగలడు. ఫోర్లు, సిక్స్ లు మంచినీళ్ళు తాగిన ప్రాయం లాగా కొట్టగలడు. అతడి ఆట తీరు దృష్టిలో ఉంచుకున్న జట్టు మేనేజ్మెంట్ ధర్మశాలలో అవకాశం ఇవ్వడం దాదాపు ఖాయమని తెలుస్తోంది. ఒకవేళ ఈ టెస్టులో పడిక్కల్ మెరుగైన ఆట తీరు ప్రదర్శిస్తే మునుముందు అతడి స్థానం జట్టులో పటిష్టమవుతుంది. స్థిరమైన ఫామ్ కొనసాగిస్తే సెంట్రల్ కాంట్రాక్టులో అవకాశం కూడా దక్కుతుంది.