IND vs PAK: క్రికెట్లో ఒకప్పుడు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య యాషెస్ సిరీస్ జరుగుతోంది అంటే యావత్ ప్రపంచం మొత్తం ఆసక్తి ఉండేది. ఏం జరుగుతుందోననే ఉత్కంఠ ఉండేది. జరిగేది టెస్ట్ మ్యాచ్లు అయినప్పటికీ యావత్ క్రికెట్ అభిమానులు మొత్తం ఆ సిరీస్ ఆసాంతం కళ్ళు అప్పగించి చూసేవారు. క్షణం క్షణం మారిపోతున్న సమీకరణాలను చూసి అసలు సిసలైన క్రికెట్ మజాను ఆనందించేవారు. అయితే కొంతకాలానికి ఈ స్థానాన్ని భారత్, పాకిస్తాన్ ఆక్రమించాయి.
ఫార్మాట్ ఏదైనా సరే భారత్, పాకిస్తాన్ మధ్య జరిగే ప్రతి మ్యాచ్ హై వోల్టేజ్ లాగా రూపాంతరం చెందింది. ప్లేయర్లు నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడుతున్న నేపథ్యంలో చూసే అభిమానులలో ఉత్కంఠ తారాస్థాయికి చేరుతోంది. అందువల్లే ఈ మ్యాచ్ లకు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఆదరణ దక్కుతోంది. రెండు దేశాల మధ్య చాలా సంవత్సరాల నుంచి ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో.. ఈ రెండు జట్లు ఆడే క్రికెట్ మ్యాచ్లకు విపరీతమైన ఆదరణ ఉన్నది. ఈ ఆదరణను అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి సొమ్ము చేసుకుంటున్నది. అందువల్లే అంతర్జాతీయ టోర్నీలలో భారత్, పాకిస్తాన్ మధ్య పోటీ కచ్చితంగా ఉండేలా చూసుకుంటుంది.. దీనిని చాలామంది విమర్శించినప్పటికీ ఐసీసీ ఏమాత్రం తగ్గడం లేదు. పైగా తనకు కాసులు కురిపించే వ్యవహారం కావడంతో భారత్, పాకిస్తాన్ మధ్య కావాలని మ్యాచులు నిర్వహిస్తోంది.
ప్రస్తుతం 2023 నుంచి 2027 వరకు భారత్ పాకిస్తాన్ తలపడే అంతర్జాతీయ మ్యాచ్ లకు సంబంధించి బ్రాడ్ కాస్టింగ్ విలువ ఎంత ఉంటుందనే విషయంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. గూగుల్ అందించిన సమాచారం ప్రకారం ఈ రెండు జట్లు 2023 నుంచి 27 అంటే నాలుగేళ్లలో తలపడే మ్యాచ్లో బ్రాడ్కాస్టింగ్ విలువ దాదాపు మూడు బిలియన్ డాలర్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఇటీవల ఆసియా కప్ లో కూడా ఈ రెండు జట్లు మూడుసార్లు తలపడ్డాయి. మూడుసార్లు కూడా టీమిండియా నే గెలిచింది. లీగ్ నుంచి మొదలు పెడితే ఫైనల్ వరకు భారత్ అప్పర్ హ్యాండ్ కొనసాగించింది. ట్రోఫీ ని కూడా సొంతం చేసుకుంది. మూడుసార్లు పాకిస్తాన్ భారత్ తలపడిన నేపథ్యంలో.. ఐసీసీ నుంచి బ్రాడ్ కాస్టింగ్ హక్కులు దక్కించుకున్న సోనీ వరకు భారీగా ఆదాయం వచ్చింది అని తెలుస్తోంది.
మరోవైపు ఈ రెండు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తతలను ఐసీసీ సొమ్ము చేసుకుంటున్నదని మాజీ క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకెల్ అతర్టన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఒకప్పుడు క్రికెట్ రెండు దేశాల మధ్య దౌత్యానికి వారధిగా పని చేసిందని.. ఇప్పుడు రాజకీయపరమైన ఉద్రిక్తతలకు క్రికెట్ ప్రత్యామ్నాయంగా మారిందని ఆయన వాపోయాడు. ఆర్థిక లాభం కోసం ఐసిసి భారత్, పాకిస్తాన్ దేశాలను ఒకే గ్రూపులో చేర్చడం సరికాదని హితవు పలికాడు.