Abstinence Period: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని పనులు శుభ ముహూర్తాలు చేయడం మంచిది అని అంటారు. మంచి సమయంలో పనులు మొదలుపెడితే ఆ పని విజయవంతంగా పూర్తవుతుందని భావిస్తారు. ఇందుకోసం ముందుగా జ్యోతిష్య నిపుణులు సంప్రదిస్తారు. ఇలా సంప్రదించినప్పుడు వారు శుభ ఘడియలతో పాటు వర్జ్యకాలం కూడా చెబుతూ ఉంటారు. వర్జ్య కాలంలో ఎలాంటి పనులు ప్రారంభించరాదు అని అంటారు. అసలు వర్జ్య కాలం అంటే ఏమిటి? ఈ సమయంలో పనులు ప్రారంభిస్తే ఏం జరుగుతుంది?
వర్జ్యం అంటే విడువదగినది.. లేదా విడిచిపెట్టవలసినది.. లేదా నిషేధించబడినది అని అర్థం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పంచాంగం చూసేటప్పుడు వర్జ్య కాలాన్ని కూడా చూస్తారు. శుభ ఘడియలకు వ్యతిరేకంగా వర్జ్య కాలం ఉంటుంది. దీనిని నక్షత్రాన్ని బట్టి నిర్ణయిస్తారు. ప్రతి నక్షత్రంలో ఒక నిర్దిష్ట భాగంగా వర్జ్యం ఉంటుంది. ప్రతి నక్షత్రంలో నాలుగు ఘడియలు అంటే 96 నిమిషాలు వర్జకాలం ఉంటుంది. ప్రతిరోజు దాదాపు వర్జ్యకాలం ఉంటుంది.
మధ్యకాలం అనేది ప్రతికూల శక్తితో కూడుకొని ఉంటుంది. ఈ సమయంలో ఎటువంటి పనులు ప్రారంభించరాదని పండితులు చెబుతారు. ముఖ్యంగా శుభకార్యాలు అంటే వివాహం, ఉపనయనం, గృహప్రవేశం, కొత్త వ్యాపారం ప్రారంభించడం వంటివి చేయకూడదు. అలాగే ఈ సమయంలో దూర ప్రయాణాలను ప్రారంభించకూడదు. కొత్త వస్తువులు కొనుగోలు చేయకూడదు. ముఖ్యంగా ఆభరణాల జోలికి వెళ్లకూడదు. వర్జ్యం సమయంలో శంకుస్థాపన, గృహ నిర్మాణ పనులు ప్రారంభించకూడదు. ఆయా సమయాల్లో ఇవి చేస్తే ఆటంకాలు ఏర్పడడమే కాకుండా మధ్యలోనే ఆగిపోతాయని కొందరు చెబుతుంటారు. అయితే వర్జ్యం సమయంలో ఇతరులకు దానాలు చేయవచ్చును. దైవారాధన చేయవచ్చును. కొందరి జాతకాల ప్రకారం వర్జ్యం ప్రభావం తీవ్రంగా ఉంటే ప్రత్యేక పూజలు చేయాల్సి ఉంటుంది. దీంతో కొంతవరకు పరిహారం ఉంటుంది.
వర్జ్యం కాలానికి వ్యతిరేకంగా అమృత ఘడియలు ఉంటాయి. అంటే ఈ అమృత గడియల్లో శుభకార్యాలు నిర్వహించుకోవచ్చును. కొత్త పనులు ప్రారంభించుకోవచ్చును. దూర ప్రయాణాలు కూడా ప్రారంభించవచ్చును. అంటే అమృతఘడియతో పాటు వర్జ్యం కాలాన్ని చూసి శుభ ముహూర్తాలను ప్లాన్ చేస్తారు. ఏ సమయం అనుకూలంగా ఉంటుందో ఆ సమయంలో మాత్రమే వర్జ్యం ఉందా లేదా అనేది చూసిన తర్వాత ముహూర్తం ఫిక్స్ చేస్తారు. ముఖ్యంగా వివాహ సమయంలో దీని గురించి చర్చ ఎక్కువగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో వర్జ్యం కాలంలో వివాహానికి సంబంధించిన ఎలాంటి పనులను ప్రారంభించరు. ఒకవేళ కొత్త పనులు ప్రారంభించాలని అనుకునే వారికి వర్జ్యం కాలం పోయేవరకు ఆగాల్సిందే. లేదా మరో రోజు నిర్ణయించుకోవాలి. లేకుంటే తీవ్రంగా నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది.