Nija Jyeshtha Masam 2026: తెలుగు పంచాంగం ప్రకారం.. 2026 జూన్ 16 నుంచి నిజ జ్యేష్ఠ మాసం ప్రారంభమవుతోంది. ఈ మాసం జూలై 15 వరకు కొనసాగనుంది. అనంతరం ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. ఈ ఏడాది అధిక మాసం ప్రభావంతో రెండు జ్యేష్ఠ మాసాలు వచ్చిన నేపథ్యంలో, ఇప్పుడు ప్రారంభమవుతున్న నిజ జ్యేష్ఠ మాసానికి ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. ఈ నెలలో వివాహాలు, గృహప్రవేశాలు, ఉపనయనాలు, నిశ్చితార్థాలు వంటి అనేక శుభకార్యాలకు అనుకూలమైన ముహూర్తాలు లభిస్తున్నాయని పండితులు పేర్కొంటున్నారు. అయితే ఈ నెలలో వివాహాలు జరిగే తేదీ లేవు చూద్దాం..
పంచాంగాల ప్రకారం నిజ జ్యేష్ఠ మాసంలో వివాహాలకు అనుకూలంగా పరిగణిస్తున్న ప్రధాన తేదీలు జూన్ 17, 18, 21, 22, 24, 25, 29, 30 అలాగే జూలై 1, 2, 6, 8, 9, 10, 13, 14 తేదీలు. అయితే ప్రాంతీయ పంచాంగ భేదాలు, వధూవరుల జన్మనక్షత్రాలు, రాశులు, గోత్రాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని తుది ముహూర్తాన్ని నిర్ణయించుకోవాలని పండితులు సూచిస్తున్నారు.నిజ జ్యేష్ఠ మాసంలో కొత్త ఇంటి నిర్మాణ ప్రారంభం, భూమి పూజ, గృహప్రవేశం వంటి కార్యక్రమాలకు కూడా అనేక శుభ ముహూర్తాలు ఉన్నాయి. ముఖ్యంగా జూన్ రెండో పక్షం నుంచి జూలై తొలి వారాల వరకు గృహ సంబంధిత శుభకార్యాలకు అనుకూల సమయంగా పరిగణిస్తున్నారు. కొత్త ఇల్లు కొనుగోలు, రిజిస్ట్రేషన్ వంటి కార్యక్రమాలు కూడా ఈ సమయంలో నిర్వహించుకోవచ్చు.
ఈ మాసంలో నిశ్చితార్థాలు, ఉపనయనాలు, అక్షరాభ్యాసం, అన్నప్రాశన, నామకరణం, వ్యాపార ప్రారంభోత్సవాలు, వాహన కొనుగోళ్లు, కొత్త ఉద్యోగంలో చేరిక, కార్యాలయ ప్రారంభం వంటి కార్యక్రమాలు కూడా నిర్వహించుకోవచ్చు. ముఖ్యంగా వ్యాపార విస్తరణ లేదా కొత్త పెట్టుబడులు ప్రారంభించాలనుకునేవారికి ఇది అనుకూల కాలంగా భావిస్తున్నారు.
జూలై 15తో నిజ జ్యేష్ఠ మాసం ముగియనుండగా, అనంతరం ప్రారంభమయ్యే ఆషాఢ మాసంలో సాధారణంగా వివాహాలు వంటి ప్రధాన శుభకార్యాలు నిర్వహించరు. అందువల్ల పెళ్లిళ్లు, గృహప్రవేశాలు లేదా ఇతర ముఖ్యమైన కుటుంబ వేడుకలను ప్లాన్ చేస్తున్నవారు ఈ నెలలో లభించే ముహూర్తాలను వినియోగించుకోవాలని పండితులు సూచిస్తున్నారు.
అయితే పంచాంగాల్లో సూచించిన సాధారణ ముహూర్తాలు అందరికీ ఒకే విధంగా వర్తించవు. వ్యక్తిగత జాతకాలు, దోషాలు, కుటుంబ సంప్రదాయాలు, ప్రాంతీయ పంచాంగ విధానాలను పరిగణనలోకి తీసుకుని స్థానిక పురోహితులను సంప్రదించిన తర్వాతే తుది ముహూర్తాన్ని ఖరారు చేసుకోవడం మంచిదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
