Ayodhya Ramalayam:అయోధ్యలో కొలువైన రామ్ లల్లాను దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో 2024 జవనరి 22న బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్టించారు. అత్యాధునికమైన, సాంప్రదాయ విలువలతో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఎన్నో ప్రత్యేకతలు కలిగిన ఈ ఆలయంలో ఈ శ్రీరామనవమికి ఓ అద్భుతం జరగనుంది. ప్రతీ శ్రీరామనవమికి రామాలయంలో ప్రత్యేక పూజలు ఉంటాయి. కానీ ఈసారి అయోధ్య ఆలయంలో జరిగే విశేషాలేంటంటే?
అయోధ్య రామమందిరం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆలయంగా ప్రఖ్యాతి చెందింది. ప్రస్తుతం అంకోర్ వాట్ లోని దేవాలయం ప్రపంచంలోనే అతిపెద్ద ఆలయంగా రికార్డులో ఉంది. ఆ తరువాత తమిళనాడులోని రంగనాథ స్వామి ఆలయంగా పేరు తెచ్చుకుంది. అయోధ్య రామమందిరం లో ఎక్కడా ఇనుము, స్టీల్, సిమెంట్, కాంక్రీట్ వాడలేదు. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ నుంచి ప్రత్యేక శిలలను తెచ్చి నిర్మించారు. హైదరాబాద్ నుంచి ప్రధాన తలుపులను తీసుకొచ్చి సెట్ చేశారు. ఇక రిక్టర్ స్కేల్ పై 10 తీవ్రతతో భూకంపాలు వచ్చినా, మరే విపత్తులు ఏర్పడినా 2,500 ఏళ్ల పాటు ఆలయం ఉండేలా నిర్మించారు.
అయోధ్య రామాలయంలో ప్రతీ శ్రీరామనవమికి ఓ అద్భుతం చోటు చేసుకోనుంది. ఇప్పటి వరకు ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం గర్భగుడిలోని మూల విరాట్ పై సూర్య కిరణాలు పడినట్లుగానే.. ఈసారి శ్రీరామనవిరోజు బాల రాముడి విగ్రహంపై సూర్యకిరణాలు ప్రసరించేలా నిర్మాణం చేపట్టారు. శ్రీరామనవమి రోజు బాలరాముడిని దర్శించుకునే భక్తులు ఈ అరుదైన దృశ్యాన్ని చూడొచ్చు.
దీనికి సంబందించి ఇప్పటికే ట్రయల్ రన్ నిర్వహించారు. బాల రాముడి నుదుటిపై తిలకం లా సూర్యకిరణాలు పడేలా సెట్ చేశారు. లెన్స్ ప్రత్యేక అద్దాల సహాయంతో ఈ ప్రత్యేక వ్యవస్థను రూపొందించినట్లు ట్రస్ట్ అధికారులు వెల్లడించారు. ఈ దృశ్యాన్ని శ్రీరామనవమి రోజు మధ్యాహ్నం 12 గంటలకు మొదలై సుమారు 4 నిమిషాల పాటు ఉంటుందని తెలిపారు. సీఎస్ఐఆర్ ఆధ్వర్యంలో సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇని స్టిట్యూట్ ఆధ్వర్యంలో దీనిని రూపొందించారు. 500 ఏళ్ల తరువాత అయోధ్యలో రాముడు జన్మస్థలంలో వేడుకలు జరగడం విశేషంగా చెప్పుకుంటున్నారు.