
ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలనే ప్రధాన డిమాండ్ తో 2019లో 52 రోజుల పాటు జరిగిన సమ్మెతో ఆర్టీసీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. చివరికి ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో బస్ చార్జీల ధరలను పెంచి ఆర్టీసీకి కాస్త ఉపశమనాన్ని కలిగించారు. అయితే సమ్మె నష్టాల నుంచి కోలుకుంటున్న సమయంలో ఆర్టీసీ కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ తో నష్టాల్లోకి జారుకుంది. ప్రస్తుత పరిస్థితి కారణంగా భారీ స్థాయిలోనే ఆదాయం కోల్పోవాల్సి వస్తుంది.
లాక్ డౌన్ నుంచి సడలింపులు ప్రారంభమైన ప్రస్తుత స్థితిలో ప్రజారవాణా నిర్వహణపైనా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఆర్టీసీ బస్సులు నడిపే విషయంపై ప్రభుత్వ స్థాయిలో మేధోమథనం జరుగుతోంది. ఇప్పటికే పుట్టెడు నష్టాల్లో ఉన్న ఆర్టీసీ గత నెలన్నర రోజులుగా బస్సులు తిరగకపోవడంతో ఆదాయం కోల్పోయి మరింత కుదేలైంది. సంస్థను కాపాడేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేయూత అందించాలని నిపుణులు సూచిస్తున్నారు. కరోనా వైరస్ కట్టడి కోసం వ్యక్తుల మధ్య దూరం పాటించటం తప్పనిసరి. అదే ప్రజారవాణాకు పెద్ద సవాలు కానుంది. దీన్ని అమలు చేయాలంటే ఒక్కో బస్సులో 25 మందికి మించి ప్రయాణికులను ఎక్కించకూడదు. దీనివల్ల మరింత నష్టాలొస్తాయి. కరోనా నేపథ్యంలో ఆర్టీసీల ఆర్థిక స్థితిగతులపై అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్టు అండర్ టేకింగ్స్ (ఏఎస్‌ఆర్టీయూ)ల ద్వారా కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ ఆరా తీసింది. ఇతర రంగాల మాదిరిగా ఆర్టీసీలకు ఉద్దీపన పథకాన్ని కేంద్రం ప్రకటిస్తుందా? లేదా? అనే విషయంపై త్వరలో స్పష్టత రానుంది.
ప్రజారవాణాపై సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..”ఆర్టీసీ బస్సులు నడిపే విషయంలో ఈ నెల 15వ తేదీ తరువాత నిర్ణయం తీసుకుంటాం. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు వ్యూహరచన చేస్తాం. వ్యక్తిగత దూరం అమలు చేయాలంటే బస్సులో 50 శాతానికి మించి ప్రయాణికులను అనుమతించలేం. ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ధరించాలని, బస్సులో శానిటైజర్లను అందుబాటులో ఉంచుతాం. నష్టాలను ఎలా అధిగమించాలన్న అంశంపై చర్చిస్తాం.” అని అన్నారు. ఖాళీ సీట్ల నష్టాన్ని కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ రూపంలో రాష్ట్ర రవాణా సంస్థలకు ఇవ్వాలి. ఇప్పటికే ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రజారవాణా సంస్థలు దాదాపుగా మూతపడ్డాయి. కేంద్రం సహకరించకపోతే ఇతర రాష్ట్రాలు కూడా ఆ బాటనే పడతాయి. సర్వీసుల సంఖ్యను తగ్గించాలి. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు బాగా తగ్గినందున ఆ ప్రయోజనాన్ని ఆర్టీసీకి మరలించకపోతే రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థల పరిస్థితి మరీ అగమ్యగోచరమే అవుతుంది.
అయితే త్వరలోనే బస్సులు రోడ్డెక్కుతాయనే ఊహగానాలు వినిపిస్తున్నాయి. సీటుకు ఒకరు చొప్పున కూర్చొని భౌతిక దూరం పాటించే విధంగా చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రయాణికుల సంఖ్య తగ్గడంతో మరోసారి ఆర్టీసీ చార్జీలు పెరిగే అవకాశాలు ఉన్నాయని పలువురు పేర్కొంటున్నారు. ఏదేమైనా ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కితే సామాన్య ప్రజల కష్టాలు కొంతమేర తీరుతాయని పలువురు పేర్కొంటున్నారు.