
కరోనా మహమ్మారి పుణ్యమా అని దేశ వ్యాప్తంగా అత్యంత కఠినమైన ఆంక్షల మధ్య లాక్ డౌన్ ను అమలుపరుస్తున్నారు. దింతో మొన్నటికి మొన్న ముంబైలోని బాంద్రా రైల్వే స్టేషన్ బయట వలస కార్మికులు లాక్ డౌన్ ను ఉల్లంఘించారు. తమ తమ స్వస్థలాలకు వెళ్లిపోతామంటూ దాదాపు 1500 మంది వలస కార్మికులు రోడ్లపైకి వచ్చి, గుమిగూడి ఆందోళన నిర్వహించారు. అదే సమయంలో హైద్రాబాద్ లో కూడా వలస కూలీలు రోడ్లెక్కి ధర్నాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ రోజు కూడా అనేక వందల మంది వలస కూలీలు రోడ్లెక్కారు. తమను ఇంటికి పంపిచాల్సిందే అని ఆందోళనకు దిగారు.
ఐఐటీ హైదరాబాద్ భవనాల నిర్మాణ పనుల కోసం వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన 1600 మంది కార్మికులు లాక్ డౌన్ కారణంగా గత నెలరోజులకు పైగా అక్కడే చిక్కుకు పోయారు. యజమాని సంగారెడ్డి కంది ఐఐటీ వద్దే కార్మికులను ఉంచారు. గత నెలరోజులుగా ఉపాధి లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర అసహనానికి గురయ్యారు. రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సత్వరమే అక్కడకు చేరుకుని ఆ ప్రదేశాన్ని ఖాళీ చేయాలంటూ పదే పదే విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, కార్మికులకు మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది.
కార్మికులు పోలీసులపై రాళ్లు, కట్టెలతో దాడికి యత్నించారు. కార్మికుల రాళ్ల దాడిలో పోలీసు వాహనాలు ధ్వంస మయ్యాయి. రాళ్లు, కట్టెలు పట్టుకుని తిరుగుతూ.. బీభత్సం సృష్టించారు. ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి ఘటనాస్థలికి చేరుకుని, కార్మికులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.