
గత నెల(నవంబర్) 27న రాత్రి 9.30 నుండి తర్వాత రోజు ఉదయం 3.30 మధ్య కాలంలో “దిశ” ఆత్యాచారం గావించబడి, హత్యకు గురైంది. నిజానికి ఆ రోజు రాత్రే దిశ కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు కానీ పోలీసుల నిర్లక్యం వల్ల ‘దిశ’ ఉదంతం విషాదంగా మారింది.ఈ మాటలకు అనేకమంది ఏకీభవించి పోలీసులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అలాగే సంఘటన జరిగిన తరువాత అనేకమంది రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు ఆ ఘటనను ఖండించారు, దిశ కుటుంబాన్ని కూడా పరామర్శించారు. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కనీసం స్పందించలేదు. ఈ రెండు విషయాలపై మీడియాలో, ప్రజల్లో పెద్ద ఎత్తున్న అటు పోలీసుల పైన ఇటు కెసిఆర్ పైన వ్యతిరేకత వచ్చింది.
అదే సమయంలో దిశ నిందితులకు 14రోజుల రిమాండ్ విధించి, చర్లపల్లి జైలులో ఉంచారు. వ్యతిరేకత పెరుగుతున్న తరుణంలో పోలీసులు, హైకోర్టు కి అప్పీల్ చేసుకొని, నిందితులను బయటకు తీసుకొచ్చి చాలా తెలివిగా ఎన్‌కౌంటర్ చేశారు. “ఒక్క దెబ్బకు రెండు పిట్టలు” అనే సామెత తరహాలో ఇటు పోలీసుల పైన వ్యతిరేకత పోవడమే కాకుండా ప్రజల్లో హీరోలుగా ముద్ర వేయించుకున్నారు, అటు కెసిఆర్ పై విమర్శలు పోవడమే కాకుండా ప్రశంసలు, అభినందనలు అందుకున్నారు, అందులో భాగంగా నిన్న ఏపీ సీఎం జగన్ కూడా మెచ్చుకున్న విషయం తెలిసిందే..
ఇప్పుడు మళ్ళీ సీన్ మారింది. ఒక వైపు జాతీయ మానవ హక్కుల కమిటి, మరో వైపు మహిళా సంఘాలు, కెసిఆర్ ప్రభుత్వ తీరును తప్పు పడుతున్నాయి. అందరికి ఒకే న్యాయం చేయాలి “ధనికులకో న్యాయం-దళితులకో న్యాయమా?” అంటూ విమర్శల పర్వం మొదలయింది. అలాగే దిశ నిందితుల కుటుంబాల పైన సానుబూతి పెరుగుతుంది, వారికి న్యాయం చేయాలనీ డిమాండ్ చేస్తున్న తరుణంలో కెసిఆర్ సర్కార్ కొత్త డ్రామాకు తెర లేపింది. దిశ హత్య కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై తెరాస కొంత సానుభూతిని ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తుంది. అందుకు తార్కాణంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే గొంగిడి సునీత దిశ నిందితుల ఎన్‌కౌంటర్ చాలా బాధాకరమంటూ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఆలేరులో జరిగిన ఓ కార్యక్రమంలో సునీత ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. యువకుల తల్లిదండ్రులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన యువకుల తల్లిదండ్రులు చాలా బాధపడి ఉంటారని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. సునీత తరహాలోనే నిందితుల కుటుంబీకులకు, మరికొంత మంది తెరాస నేతలు సానుభూతి తెలిపే అవకాశాలు లేకపోలేదు.