
YCP – Times Now Survey : విపరీతమైన ప్రజా వ్యతిరేకత పెల్లుబికుతున్న వేళ వైసీపీకి క్లీన్ స్వీపా? పార్టీలో ధిక్కార స్వరాలు వినిపిస్తున్న వేళ వైసీపీకి 25కు 25 లోక్ సభ స్థానాలా? మొన్నటికి మొన్న పట్టభద్రుల స్థానాల్లో ఓటమి తరువాత ఏకపక్ష విజయమా? విపక్షాల సభలకు ఆదరణ పెరుగుతున్నవేళ వారికి ఒక్క ఎంపీ సీటు రాకపోవడమా? ఇప్పుడు ఏపీలో ఇదే హాట్ టాపిక్. ఎన్నికలకు ఏడాది ముందు ఓ సర్వే పేరిట వెల్లడైన ఈ ఫలితాల సరళి సగటు పౌరుడికి అనుమానం కలిగిస్తోంది. అలాగని ఈ సర్వే చేసింది ఆషామాషి సంస్థ కాదు. జాతీయ స్థాయిలో మంచి పేరున్న మీడియా సంస్థ. అటువంటప్పుడు ఈ ఏకపక్ష విజయాలు కట్టబెట్టడం ఏంటి అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. దీని వెనుక ఉన్న కథ ఏంటి అన్న చర్చ నడుస్తోంది. అయితే దీని వెనుక ఉన్నది క్విడ్ ప్రో అని తెలియడం ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. వైసీపీ ప్రభుత్వం నుంచి రూ.25 కోట్లు ఆయాచితంగా లబ్ధిపొందిన టైమ్స్ నౌ ఈటీజీ సంస్థ ఇలా ఏకపక్ష విజయాలను జగన్ పార్టీకి కట్టబెట్టిందన్న మాట.
ముందస్తు ఒప్పందం
జగన్ ఎప్పుడూ ముందుచూపుతోనే వ్యవహరిస్తారు. అటు జాతీయ స్థాయిలో బీజేపీతో దోస్తీ కొనసాగాలంటే తమపై సానుకూల ప్రభావం ఉండాలని భావించారు. అందుకే టైమ్స్ నౌ ఈటీజీ మాతృక అయిన ‘బెనెట్ కోల్ మన్ అండ్ కో’తో ఒప్పందం చేసుకున్నారు. ప్రభుత్వంతో పాటు పార్టీ నాయకుల ఇమేజ్ పెంచడం ఈ సంస్థ పని దీనికిగాను ఏడాదికి రూ.8 కోట్లు చెల్లిస్తూ వస్తున్నారు. గత మూడేళ్లో ముచ్చటగా రూ.25 కోట్లు సమర్పించుకున్నారు. ఉన్న రెండేళ్లలో మరో రూ.16 కోట్లు చెల్లింపునకు సిద్ధపడ్డారు. జగన్ సర్కారు పాత పథకాలనే పేరు, తీరు మార్చి అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ఆయా పథకాలకు ఎప్పటికప్పుడు నిధులు అందేవి. కానీ, జగన్ సర్కారు ఒకే పథకానికి పలుమార్లు నిధులు విడుదల చేస్తూ… బటన్ నొక్కిన ప్రతిసారీ మీడియాకు కోట్ల రూపాయల విలువైన ప్రకటనలు జారీ చేస్తోంది. ఇలా సొంత మీడియాకే వందల కోట్లు కట్టబెట్టింది. స్థానికంగా ఎంపిక చేసిన పత్రికలతోపాటు జాతీయ స్థాయి పత్రికలు, వెబ్‌సైట్లకూ కోట్ల విలువైన ప్రకటనలు ఇస్తోంది. అలా టైమ్స్ నౌ ఈటీజీ సంస్థకు కూడా ఇతోధికంగా నగదు ముట్టజెప్పిందన్న మాట.

జాతీయ స్థాయిలో ఖ్యాతి కోసమే..
దేశంలోనే ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు ఏపీలో అమలు జరుగుతున్నాయి అని చర్చ జరగడమే ఈ ఒప్పంద ముఖ్య ఉద్దేశ్యం. దాంతో పాటు వైసీపీ సర్కారుకు ఇబ్బందులు ఎదురైతే జాతీయ స్థాయిలో అనుకూల కథనాలు ప్రచురించాలని కూడా ఒక ఒప్పందం. అంతటితో ఆగకుండా ఎన్నికల రివ్యూలు, సర్వేల్లో అనుకూలంగా వ్యవహరించడం ముందస్తు ఒప్పందంలో ఒక భాగం. అందుకే అన్ని మీడియాలకు ఇస్తున్న ప్రకటనలతో పాటు ఏడాదికి రూ.8 కోట్లు చెల్లించేందుకు జగన్ సర్కారు డిసైడయ్యింది. దీనిపై 2020 అక్టోబరు 28వ తేదీన జీవో ఆర్టీ 1692 విడుదల చేసింది. ఇది 2020-, 21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించింది. ఆతర్వాత మరో రెండేళ్లు గడిచిపోయాయి. ఆ రెండేళ్లు కూడా ఈ ఒప్పందం అమలైందనే భావించవచ్చు. ఎందుకంటే.. ప్రభుత్వం అన్ని జీవోలను రహస్యంగానే జారీ చేస్తోం ది. వెరసి… ఏటా 8.15కోట్ల చొప్పున మూడేళ్లలో దాదా పు రూ.25కోట్లు సమర్పించుకున్నందుకు ప్రతిఫలం గా…ఇలా క్లీన్‌స్వీప్ సర్వే వెలువడినట్లు అనుమానాలు వెలువడుతున్నాయి.
రూ.100 కోట్ల చెల్లింపులు..
ఈ నాలుగేళ్లలో ప్రకటనలతో కలిపి టైమ్స్ నెట్‌వర్క్‌కు జగన్ సర్కారు వంద కోట్ల దాకా చెల్లించినట్లు రాజకీయవర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు,పాలనా బాగుంటే జాతీయ మీడియా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన సందర్భాలున్నాయి. అయితే దానికి డబ్బుతో రేటు కట్టిన ఘనత జగన్ కే దక్కుతుంది. గతంలో ఎన్టీఆర్ సర్కారు బలహీనవర్గాలకు ఇళ్ల పథకం, రెండు రూపాయలకు కిలోబియ్యం పథకం ప్రవేశపెట్టినప్పుడు జాతీయ స్థాయిలో సంచలనమైంది. జాతీయ మీడియా వీటి గురించి వివరించింది. ఇలాంటి పథకాలనే ఇతర రాష్ట్రాలూ అమలు చేశాయి. ఇటీవల జయలలిత ప్రవేశపెట్టిన ‘అమ్మా క్యాంటీన్ లకు ఇదేస్థాయిలో ఆదరణ పొందాయి. కానీ జగన్ లా ఎదురెళ్లి రూ.100 కోట్లు అందించడం ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇటువంటి ప్యాకేజీలు తీసుకొని మీడియా పాత్రను తగ్గించుకోవడం కూడా జుగుప్సాకరంగా ఉంది. ఇప్పటికే ఇలాంటి చర్యల వల్ల ఆక్టోపస్ లా పేరుగాంచిన చాలా మంది ఫేడ్ అవుట్ అయ్యారు. అటువంటి చరిత్రనే టైమ్స్ నౌ ఈటీజీ సంస్థ మూటగట్టుకుందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.