Vyjayanthi Movies: అనగనగనగా కృష్ణా జిల్లాలోని ఒక గ్రామం. ఆ ఊర్లో ఓ యువకుడు డిగ్రీ వరకు చదువుకున్నాడు. చిన్నప్పటినుంచి ఎన్టీఆర్ అంటే వీరాభిమానం. అభిమానంతోనే చేతిలో కొంత నగదు తీసుకొని చెన్నై వెళ్లాడు. ఏకంగా ఎన్టీఆర్ ని కలిసి “మీరంటే నాకు అభిమానం, నేను మీతో సినిమా చేస్తానని” చెప్పేశాడు. దానికి ఆయన భళ్ళున నవ్వాడు.” సినిమా వ్యాపారం అంటే లక్షలతో వ్యవహారం, ఇదంతా నీకెందుకు బ్రదర్? వచ్చినదారినే ఇంటికి వెళ్ళిపో” అన్నాడు. ఆ సమాధానం విన్న ఆ యువకుడు “లేదండి నేను మీతో సినిమా చేస్తానని” ఘంటాపథంగా చెప్పేశాడు. ఆ తర్వాత రూపుదిద్దుకున్నదే ఎదురులేని మనిషి సినిమా. 1975లో విడుదలైంది. అప్పుడే వైజయంతి మూవీస్ పురుడుపోసుకుంది. అప్పటినుంచి ఇప్పటిదాకా ఎన్నో మరుపురాని చిత్రాలను నిర్మించింది. ఆయన వరాల మూటలే ప్రియాంక దత్, స్వప్న దత్, స్రవంతి దత్. ఇప్పుడు ఈ ముగ్గురే వైజయంతి మూవీస్ కి మూల స్తంభాలు. అసలు సినిమా రంగం అంటేనే ఒక జూదం, కోట్ల రూపాయలతో కూడుకున్న వ్యవహారం. ఏ మాత్రం తేడా వచ్చినా ఇక అంతే సంగతులు. అలాంటి సినిమా రంగంలో కాకలు తీరిన యోధులే పెట్టే బేడా సర్దుకుని వెళ్ళిపోయారు. అలాంటి పరిశ్రమలో ఈ ముగ్గురు ఎలా మనగలుగుతున్నారు? దృశకావ్యాలాంటి సినిమాలు ఎలా తీయగలుగుతున్నారు? మొదట్లో వీరికి తగిలిన దెబ్బలు ఎలాంటివి? ఈ ముగ్గురు పిల్లల్ని ఒక శిల్పాలుగా అశ్విని దత్ ఎలా చెక్కారు?

శక్తి సినిమాతో ఆర్దిక ఇబ్బందులు
అప్పటిదాకా వైజయంతి మూవీస్ బ్యానర్ అంటే భారీ చిత్రాలకు పెట్టింది పేరు. ఆ సమయంలోనే మెహర్ రమేష్ తో ఎన్టీఆర్ ను హీరోగా పెట్టి “కంత్రి” అని ఒక సినిమా తీశారు. ఒక మోస్తరుగా ఆడింది. ఆ తర్వాత భారీ అంచనా వ్యయంతో శక్తి అని ఒక సినిమా తీశారు. కానీ అది అశ్వనీ దత్ కు తీవ్ర నష్టాలను మిగిల్చింది. ఆ దెబ్బకు కొన్నేళ్లపాటు వైజయంతి మూవీస్ నుంచి సినిమాలే నిర్మాణం కాలేదు. ఈ తరుణంలో పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలని అశ్వని దత్ ముగ్గురు కుమార్తెలు ” త్రీ ఏంజెల్స్ స్టూడియో” అని ఒక నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఆ బ్యానర్ మీద నారా రోహిత్ హీరోగా “బాణం” అనే సినిమాను తీశారు. అది యావరేజ్ ఫలితాన్ని ఇచ్చింది. ఆ తర్వాత నవదీప్, కాజల్ తో “ఓం శాంతి ఓం ” అనే సినిమా తీశారు. అది ఫ్లాప్ అయింది. దీంతో నిర్మాణ రంగం నుంచి వెనక్కి వచ్చేయాలని తమ ముగ్గురు కుమార్తెలకు అశ్విని దత్ తేల్చి చెప్పారు. కానీ పట్టు విడవని వారు నాన్నను ఒప్పించి నాగ్ అశ్విన్ దర్శకత్వంలో “ఎవడే సుబ్రహ్మణ్యం” అని ఒక సినిమా తీశారు. ఈ చిత్రంలో నాని హీరోగా, సహ నటుడిగా విజయ్ దేవరకొండ నటించారు. క్రిటిక్స్ నుంచి ఈ సినిమా మంచి ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత అదే నాగ్ అశ్విన్ తో విఖ్యాత నటీమణి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా “మహానటి” అనే సినిమా తీశారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం డబుల్ బ్లాక్ బస్టర్ అయింది. అప్పటిదాకా వైజయంతి మూవీస్ కు ఉన్న నష్టాలను మొత్తం తీర్చేసింది. ఇదే ఊపులో దిల్ రాజుతో జతకట్టిన వైజయంతి మూవీస్ నాగార్జున, నాని హీరోలుగా దేవదాస్ అనే సినిమాను నిర్మించింది. కానీ ఆ సినిమా పరాజయం పాలైంది. ఇదే నేపథ్యంలో మహేష్ బాబు హీరోగా దిల్ రాజు, పొట్లూరి వరప్రసాద్, అశ్వని దత్ నిర్మాతలుగా మహర్షి సినిమా తీశారు. ఇది కూడా విజయవంతమైంది. కొన్నాళ్లు బ్రేక్ తీసుకొని ఈసారి వైజయంతి మూవీస్ రూటు మార్చింది.
జాతి రత్నాలు కనక వర్షం కురిపించింది
సినిమా అంటే కథ, కథనం ఉండాల్సిన అవసరం లేదని, రెండున్నర గంటల పాటు ప్రేక్షకులను కదలకుండా సీట్లలో కూర్చోబెడితే వసూళ్లు వాటంతటవే వస్తాయని నిరూపించిన చిత్రమిది. కేవలం కామెడీ అనే జోనర్ ని నమ్ముకుని డైరెక్టర్ అనుదీప్ ఈ సినిమాని అతి తక్కువ బడ్జెట్లో పూర్తి చేశాడు. కానీ పెట్టిన పెట్టుబడికి 10 రెట్లు ఎక్కువ లాభాలను ఈ సినిమా తీసుకొచ్చింది. ఇక నిర్మాతలుగా ముగ్గురు కుమార్తెలు స్థిరపడటంతో అశ్విని దత్ వారికి మరింత స్వేచ్ఛని ఇచ్చాడు. ప్రస్తుతం వైజయంతి బ్యానర్ మీద నిర్మించిన సీతారామం ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. హను రాఘవపూడి తీసిన విధానం, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాగూర్, రష్మిక మందన్న, కిషోర్ నటన, విశాల్ – చంద్రశేఖర్ సంగీతం.. ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ప్రస్తుతం ఇదే బ్యానర్ లో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా “ప్రాజెక్టు కే” అనే సినిమా భారీ అంచనా వ్యయంతో నిర్మితమవుతోంది.

ఆ తండ్రి ఈ పిల్లలను తనకు అనుకూలంగా మలుచుకున్నాడు
అశ్విని దత్ పేరున్న నిర్మాత. కానీ సినీ పరిశ్రమలో అది ఒక్కటే సరిపోదు. ఇక్కడ విజయాలకే విలువ ఉంటుంది. రెండు, మూడు పరాజయాలు పలకరిస్తే అప్పటిదాకా వెంట ఉన్న వారు కూడా పలకరించడం మానేస్తారు. ఆ పరిస్థితులు చూసిన అశ్విని దత్ తన పిల్లలను ఈ పరిశ్రమకు దూరంగా ఉంచాలని అనుకున్నారు. కానీ వారు ఉన్నత విద్యను అభ్యసించిన తర్వాత సినీ పరిశ్రమను లోతుగా అధ్యయనం చేయడం ప్రారంభించారు. దీనిని మొదట్లో అశ్వని దత్ వారించినా.. పిల్లల ఉత్సాహాన్ని చూసి ప్రోత్సహించారు. తనకు ఎదురైన అనుభవాలను ప్రతిక్షణం వివరించారు. తన ముగ్గురు కుమార్తెలు మొదటి తీసిన “బాణం” నుంచి ప్రస్తుత “సీతారామం” వరకు ఒక మార్గదర్శిగా నిలిచారు. తండ్రిని చూస్తూ, సినీ వాతావరణంలో పెరిగిన ఆ పిల్లలు ఆయన అనుభవాలను కూడా నేర్చుకున్నారు. అందుకే ప్రస్తుతం టాలీవుడ్ లో విజయవంతమైన నిర్మాతలుగా కొనసాగుతున్నారు. మహానటి, జాతి రత్నాలు, సీతారామం ఇలా వరుసగా మూడు బ్లాక్ బస్టర్లు సాధించి మునుముందు మరిన్ని విజయాలు సాధించేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. అయితే వీరికి నాగ్ అశ్విన్ కూడా జతవడంతో ప్రస్తుతం వైజయంతి మూవీస్ ప్రయాణం నల్లేరు మీద నడకలాగా సాగుతోంది.
Also Read:Quarrels in Samantha house: సమంత ఇంట్లో గొడవలు.. చెంపచెళ్లుమనిపించిన కన్నతల్లి!


[…] […]