NTR 30 Devara : ఎన్టీఆర్ మాస్ హీరో. ఆయన టీనేజ్ లోనే కత్తి పట్టాడు. రికార్డులను ఊచకోత కోశాడు. కొన్నాళ్లుగా ఎన్టీఆర్ నుండి ఆ యాంగిల్ మిస్ అవుతుంది. పూర్తి స్థాయి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ చేసి చాలా కాలం అవుతుంది. ఫ్యాన్స్ ఒకింత నిరాశలో ఉన్నారు. దర్శకుడు కొరటాల శివ వారి దాహం తీర్చేలా ఉన్నాడు. ఎన్టీఆర్ 30 చిత్ర ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ ఆయన బర్త్ డే కానుకగా విడుదల చేశారు. నల్ల పంచె, చొక్కా, కాలికి, చేతికి కడియాలు, చేతిలో పెద్ద ఆయుధం పట్టి యోధుడిలా ఎన్టీఆర్ ఉన్నాడు.
దేవర అనే పవర్ఫుల్ టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ పదం చాలా హెవీ గా ఉంది. దేవర అంటే గొప్ప వ్యక్తి, నలుగురికి ఆదర్శవంతమైన వాడు, వీరుడు, భగవంతుడితో సమానమైనవాడు అనే అర్థాలు వస్తాయి. ఆయన లుక్ కూడా తన వాళ్ళ కోసం ఆయుధం పట్టి యుద్ధం చేస్తున్న వ్యక్తిలా ఉన్నాడు. నీతి న్యాయం కోసం ఎంతకైనా తెగించే మొరటు మనిషిలా ఉన్నాడు. దర్శకుడు కొరటాల ఈ చిత్ర కథ గురించి ఒక పాయింట్ చెప్పారు. సముద్ర నేపథ్యంలో సాగుతుంది. హీరో క్యారెక్టర్ రాక్షసులను భయపెట్టే వీరుడిలా ఉంటుందన్నారు.
ఆయన చెప్పిన ఫీచర్స్ తోనే దేవర చిత్ర ఫస్ట్ లుక్ ఉంది. ఇక దేవర ఎందుకు కత్తి పట్టాడు? తన శత్రువులు ఎవరు? వాళ్ళు తనకు లేదా తన వాళ్లకు చేస్తున్న అన్యాయం ఏమిటీ? ఈ ప్రశ్నల సమాహారమే దేవర టైటిల్. ఫ్యాన్స్ ఊహకు మించిన హైప్ ఇచ్చాడు. ఎన్టీఆర్ నుండి ఈ రేంజ్ ఊరమాస్ అవతార్ ఊహించనిది. ఓ కొత్త ఎన్టీఆర్ ని కొరటాల ఆవిష్కరించనున్నాడని అర్థమవుతుంది. మొత్తంగా దర్శకుడు కొరటాల మొదటి ప్రయత్నం సక్సెస్ అని చెప్పాలి. ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ తో ఇంప్రెస్ చేశాడు.
దేవర శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. విడుదలకు తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో కొరటాల వరుస షెడ్యూల్స్ ప్లాన్ చేశారు. 2024 సమ్మర్ కానుకగా దేవర విడుదల కానుంది. జాన్వీ కపూర్ ఫస్ట్ టైం ఒక సౌత్ మూవీలో నటిస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ చేస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ నిర్మిస్తున్నాయి. దేవర చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.