Vangaveeti Ranga 75th Jayanti Celebrations : వంగవీటి రంగా.. ఒక వ్యక్తి వ్యవస్థగా మారి అణగారిన వర్గాల గొంతుగా మారారు. వ్యవస్థలో చైతన్యం తీసుకొచ్చి తిరుగుబాటు చేశారు. బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి అయ్యారు. ఈ పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంది. ఈ నేలను విడిచి మూడు దశాబ్దాలు దాటినా ఆ స్పూర్తి ఇంకా రగులుతునే ఉంది. సజీవంగానే ఉంది. ఇప్పటికీ ఏదో సందర్భంలో వంగవీటి మోహన్ రంగా పేరు వినిపిస్తునే ఉంది. కాపు కుల నాయకుడిగా ముద్రపడినా.. ఆయన అందరివాడు. అణగారిన వర్గాలను సైతం అక్కున చేర్చుకున్నారు. నేనున్నా అంటూ భరోసా కల్పించారు. అందుకే అమరుడైనా ప్రజల గుండెల్లో మాత్రం చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆయన భౌతికంగా దూరమై 34 సంవత్సరాలు గడుస్తున్నా.. ఇప్పటికీ చెరగని ముద్ర వేసుకున్నారు. ఒక తరం మారినా.. వంగవీటి మోహన్ రంగా చరిత్ర మాత్రం సజీవంగా ఉండడం ఆయన పోరాట పటిమ తెలియజేస్తోంది. ఎమ్మెల్యేగా మూడున్నరేళ్ల పాటు పదవి చేపట్టినా.. ఇప్పటికీ రాజకీయాలపై ఆయన ప్రభావం ఉందంటే ఆయన ఎంత ప్రభావశీలుడో అర్థంచేసుకోవచ్చు.

వంగవీటి రంగా తెలుగు రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. ఆయన గుర్తుగా.. ఆయనకు చిహ్నంగా.. ఒక సామాజిక చైతన్య దీపికగా చిరస్థాయిగా నిలిపేందుకు విజయవాడలో కొందరు నేతలు ఏకమయ్యారు. వంగవీటి రంగా 75 వసంతాల జయంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు, కాపు నేతలంతా ఒక్కతాటిపైకి వచ్చారు. ఏపీలోనే ఎక్కడా లేని విధంగా 75 అడుగుల అతిఎత్తైన విగ్రహాన్ని నెలకొల్పడానికి రెడీ అయ్యారు. ఇందుకోసం తలోచేయి వేసి విరాళాలు సేకరించారు.
Also Read: Prakasam District: ప్రియుడిపై కోపంతో మర్మాంగాన్ని కోసిన మహిళ…వివాహేతర సంబంధం మాటున ఉన్మాదం
వంగవీటి రంగా 75 అడుగుల విగ్రహానికి ‘రమాదేవి’, వాళ్ల అబ్బాయి పాకనాటి కృష్ణ శ్రవంత్, కఠారి శ్రీనివాస్ లు కీలక పాత్ర పోషిస్తున్నారు. విజయవాడ-గుంటూరు పరిసర ప్రాంతాల్లో వీరు విరాళంగా ఇచ్చిన 1100 అడుగుల స్థలంలోనే ఈ భారీ విగ్రహ ఏర్పాటుకు నడుం బిగించారు. ఇక కాపు నేతలు, అభిమానుల నుంచి విగ్రహ నిర్మాణం కోసం.. ఏర్పాటు కోసం విరాళాలు పారదర్శకంగా సేకరిస్తున్నారు. ఒక బ్యాంక్ అకౌంట్ ఏర్పాటు చేసి రంగా అభిమానులంతా విగ్రహానికి దానం చేయాలని.. అవన్నీ పారదర్శకంగా నిర్వహిస్తున్నామని రంగా అన్న కుమారుడు తెలిపారు.
ఎన్ని ప్రభుత్వాలు మారినా.. వంగవీటి రంగా కోసం ఎవరూ ఇలాంటి కార్యక్రమాలు చేయలేదు. మొదటి సారి ఇలా అంతా ఏకమై తమకు తామే ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేస్తున్నారు. వంగవీటి రంగా తమ్ముడు కుమారుడు అయిన వంగవీటి నరేంద్రను ఈ విగ్రహ నిర్మాణంలో భాగస్వాములను చేశారు. ఈయన మాట్లాడుతూ విగ్రహానికి స్థలం ఇచ్చిన రమాదేవికి కృతజ్ఞతలు తెలిపారు. ‘రంగా అభిమానులు పల్లెపల్లెలో ఉన్నారని.. ఏపీ వ్యాప్తంగా తిరిగి రంగా అభిమానుల నుంచి ఒక ఇటుక నుంచి వారి పాత్ర ఎంత ఉంటే అంతా సేకరిస్తామని.. ఈ కట్టడంలో భాగస్వాములను చేస్తామని తెలిపారు.

రంగా విగ్రహ నిర్మాణం కోసం ఏపీ వ్యాప్తంగా ‘సామాజిక చైతన్య యాత్ర’ను ఈనెల 21 నుంచి నరసారావుపేట నుంచి చేపట్టబోతున్నట్టు వంగవీటి నరేంద్ర తెలిపారు. అన్ని గ్రామాలు తిరుగుతూ రాష్ట్రం మొత్తం కవర్ చేస్తామని తెలిపారు.
Also Read :Maa Bhoomi: చరిత్రతో వచ్చి చరిత్ర సృష్టించింది.. నిజాం నిరంకుశత్వంపై నినదించిన సినిమా ‘మా భూమి’
ఈ సందర్భంగా నేతలంతా రంగా విగ్రహ నమూనాను ఆవిష్కరించారు. మీడియాకు చూపించారు. ఈ కార్యక్రమంలో విగ్రహ స్థల దాత రమాదేవి పాల్గొన్నారు. ఇక విగ్రహ నిర్మాణానికి కృష్ణాజిల్లా రాధా, రంగ మిత్రమండలి కొల్లేటి ధర్మరావు , చల్లా శీనుబాబు, మల్లేశ్వరరావులు పదివేల నూట పదహార్లు విరాళంగా అందించారు. ప్రతీ రూపాయికి లెక్క చూపుతామన్నారు. రంగా విగ్రహ నిర్మాణం పేరిట ఎవరికో దానాలు ఇవ్వరాదని.. ఒక వెబ్ సైట్ రూపొందించి.. బ్యాంక్ అకౌంట్ తీసి ప్రతీ రూపాయి విరాళాన్ని అందులో చూపిస్తామని తెలిపారు. ప్రతి రూపాయికి జవాబుదారిగా ఉంటామన్నారు. ఇది మిస్ యూజ్ కాకుండా చేస్తామన్నారు.

రంగా 75 వసంతాల సందర్భంగా 75 అడుగుల విగ్రహం నమూనాను ఆవిష్కరించారు. రంగా విగ్రహం కోసం ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని రంగా అభిమానులందరూ ఈ బృహత్కార్యంలో మమేకం కావాలని నేతలంతా కోరారు. ఎక్కడ ఎవరున్నా సహకారాన్ని అందించాలని పిలుపునిచ్చారు. దీంతో రంగా సృతివనాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతామన్నారు.
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన రంగా కోసం నేతలు, సామాజికవర్గం, అభిమానులు ఒక్కటై ఈ అద్భుత కార్యానికి పురుడు పోశారు. అంబేద్కర్ ఆశయాలను, ఆలోచనలను పుణికిపుచ్చుకొని ఆచరణలో చూపించిన మహోన్నత వ్యక్తి రంగా.. ఆయనకు గుర్తింపు కోసం ఇలా అందరూ ఇప్పటికైనా ఒక్కటైన తీరు వారిలోని ఐక్యతను మళ్లీ చాటిచెబుతోంది. రంగా ఆదర్శాలను జనంలోకి తీసుకురావాలన్న వారి ఆశయం నెరవాలని అందరూ కోరుకుంటున్నారు.