Homeట్రెండింగ్ న్యూస్Summer 2023: ఈ వేసవి చాలా హాట్‌.. జాగ్రత్తగా లేకుంటే ముప్పే!

Summer 2023: ఈ వేసవి చాలా హాట్‌.. జాగ్రత్తగా లేకుంటే ముప్పే!

Summer 2023
Summer 2023

Summer 2023: వేసవికి ముందే ఎండలు మండుతున్నాయి. ఈ ఏడాది వర్షాలు సాధారణం కన్నా ఎక్కువగా కురిసినందున ఎండలు తక్కువగా ఉంటాయని అందరూ అంచనా వేశారు. కానీ, అందరి అంచనాలు తలకిందులు చేస్తూ.. దేశంలో 145 ఏళ్ల తర్వాత ఫిబ్రవరిలో సగటు ఉష్ణోగ్రతలు భారీగా నమోదయ్యాయి. ఈ స్థాయిలో చివరిసారి 1877లో నమోదయినట్టు ఐఎండీ తాజా గణాంకాల్లో వెల్లడించింది. ఈ నేపథ్యంలో దక్షిణ భారతం, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు తప్పితే మిగిలిన చోట్ల ఈ వేసవిలో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముందని పేర్కొంది. ఐఎండీ అంచనాలతో అప్రమత్తమైన కేంద్రం.. రాష్ట్రాలకు కీలక సూచనలు చేసింది. వడగాడ్పుల వల్ల తలెత్తే అనారోగ్య సమస్యలపై మార్చి 1 నుంచి రోజువారీగా నిఘా ఉంచాలని ఆదేశించింది.

వందేళ్ల తర్వాత ఫిబ్రవరిలో అధిక ఉష్ణోగ్రతలు..
ఫిబ్రవరిలోనే దేశంలోని కొన్ని ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని, ఈ వేసవి చాలా హాట్‌గా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వారం రోజులుగా కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 11 డిగ్రీల సెల్సియస్‌ ఎక్కువగా నమోదయ్యాయి. దేశంలో 1877 తర్వాత ఈ ఫిబ్రవరిలోనే గరిçష్ట సగటు ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ఐఎమ్‌డీ వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఈ ఏడాది సగటు ఉష్ణోగ్రత 29.54 డిగ్రీలుగా నమోదైందని, గ్లోబల్‌ వార్మింగ్‌ కారణంగానే ఈ పరిణామం చోటుచేసుకున్నట్లు పేర్కొంది.

అలర్ట్‌ చేసిన కేంద్రం..
ఈ వేసవి ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. వడగాడ్పుల వల్ల తలెత్తే అనారోగ్య సమస్యలపై మార్చి 1 నుంచి రోజువారీగా నిఘా ఉంచాలని ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌భూషణ్‌ రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాశారు.

– నేషనల్‌ ప్రోగ్రాం ఆన్‌ క్లైమేట్‌ చేంజ్‌ అండ్‌ హ్యూమన్‌ హెల్త్‌ కింద అన్ని జిల్లాల్లోనూ సమీకృత ఆరోగ్య సమాచార వేదిక ఏర్పాటుచేయాలి.. వడగాడ్పులకు గురైన వారి వివరాలు, మరణాలను నిబంధనల ప్రకారం రూపొందించాలి.

నిబంధనలు ఇవీ..
– నేషనల్‌ ప్రోగ్రాం ఆన్‌క్లైమేట్‌ చేంజ్‌ అండ్‌ హ్యూమన్‌ హెల్త్, నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ జారీచేసే వడగాడ్పుల తీవ్రత వివరాలను ఎప్పటికప్పుడు జిల్లాస్థాయి ఆసుపత్రులకు అందజేయాలి.. వడగాడ్పుల వల్ల ఎదురయ్యే అనారోగ్య సమస్యలను ఎదుర్కొనేందుకు రాష్ట్ర, జిల్లా, నగరస్థాయి వైద్యఆరోగ్య విభాగాలు ప్రణాళికలు రూపొందించి, అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలి. వైద్యాధికారులు, వైద్యసిబ్బంది, క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బందికి వడగాడ్పుల వల్ల తలెత్తే అనారోగ్య సమస్యల తీవ్రత గురించి అవగాహన కల్పించాలి. దీనిని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి, నివారణ చర్యలు తీసుకొనేలా చూడాలి.

– ఇందుకు సంబంధించి నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ రూపొందించిన శిక్షణ విధానాలను అనుసరించాలి. ఆసుపత్రుల్లో అత్యవసర ఔషధాలు, ఫ్లూయిడ్స్, ఐస్‌ ప్యాక్స్, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, అవసరమైన పరికరాలు, తాగునీరు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి.

వైరల్‌ జ్వరాల విజృంభణ..
ఇప్పటికే ఎండ వేడికి సీజనల్‌ వ్యాధులు విజృంభిస్తున్నాయి. జ్వరాలతోపాటు ఒళ్లు నొప్పులు, గొంతు నొప్పి, దగ్గు, జలుబుతో ఇప్పటికే ప్రజలు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. మార్చిలోనే పరిస్థితి ఇలా ఉంటే వచ్చే ఏప్రిల్, మే నెలల్లో ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయో అన్న ఆందోళన నెలకొంది.

Summer 2023
Summer 2023

వడగాలుల ముప్పు..
ఈ వేసవిలో వడగాలులతో ముప్పు పొంచి ఉంది. వడగాల్పులకు గురయితే పెద్దల్లో అయోమయం, గందరగోళం, మతిస్థిమితం తప్పినట్లు వ్యవహరించడం, ఆందోళన, చికాకు, మూర్చ, కోమా, పొడిచర్మం, శరీర ఉష్ణోగ్రతలు 104 డిగ్రీల ఫారిన్‌ హైట్‌కు చేరడం, దడపుట్టించేలా తలనొప్పి, ఆందోళన, మైకం, తేలికపాటి తలనొప్పి, కండరాల్లో బలహీనత, తిమ్మిర్లు, వికారం, వాంతులు, గుండె స్పందనలో, శ్వాసలో వేగం పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వెంటనే వారికి చికిత్స అందించకుంటే ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది.

జాగ్రత్తలు..
ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు ముఖ్యంగా మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య బయటకు రాకూడదు.
బయట ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు శ్రమతో కూడిన కార్యకలాపాలను నిలిపివేయడం
మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య పనులు ఆపేసి, ప్రయాణాల్లో నీళ్ల సీసా వెంట ఉంచుకోవాలి.
శరీరంలో నీటి పరిమాణాన్ని తగ్గించే మద్యం, టీ, కాఫీ, కార్బోనేటెడ్‌ శీతల పానీయాలకు దూరంగా ఉండాలి.
ఆరు బయట నిలిపిన వాహనాల్లో పిల్లలు, పెంపుడు జంతువులను ఉంచొద్దు.

ఇలా చేయాలి..
– వీలైనంత మేరకు నీరు ఎక్కువగా తాగడం, లేత రంగు, తేలికపాటి, వదులైన వస్త్రాలు, ఖద్దరు దుస్తులు వేసుకోవడం, బయటకు వెళ్లాల్సి వస్తే కళ్లద్దాలు, గొడుగు లేదా టోపీ, షూ లేదా చెప్పులు తప్పనిసరి.
– ఒకవేళ ఎండలో పనిచేయాల్సి వస్తే తల, మెడ, ముఖం భాగాలను కప్పి ఉంచేలా రక్షణ చర్యలు తీసుకోవాలి.
– అనారోగ్యం అనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
ఓఆర్‌ఎస్, ఇంటిలో తయారుచేసే లస్సీ, గంజి, నిమ్మరసం, మజ్జిగ వంటివి ఎక్కువగా తీసుకోవాలి. దీని వల్ల డీహైడ్రేషన్‌ కాకుండా ఉంటుంది.
– ఇంటిని చల్లగా ఉంచుకోవడం, కర్టెయిన్లు, షట్టర్లు, సన్‌షేడ్లతో పాటు రాత్రిపూట కిటికీలు తెరిచి ఉంచాలి.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular