Homeజాతీయ వార్తలుTeachers Assets: టీచర్ల దెబ్బకు వెనక్కి తగ్గిన ప్రభుత్వం.. అసలు కథ ఇదీ

Teachers Assets: టీచర్ల దెబ్బకు వెనక్కి తగ్గిన ప్రభుత్వం.. అసలు కథ ఇదీ

Teachers Assets: కొరివితో తలగోక్కుంటోంది తెలంగాణ సర్కార్. కేసీఆర్ కు టీచర్లు అంటే అంత కోపం ఎందుకో? ఎందుకు ఇలా చేస్తున్నాడో అర్థం కావడం లేదు. విద్యార్థులకు, ప్రజలకు ప్రభుత్వాల తీరుపై అవగాహన కల్పించడంలో టీచర్లు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. ఇక ఎన్నికల విధుల్లో కూడా వాళ్లే ఉంటారు. కేవలం జీతాల మీద ఆధారపడి బతికే వీళ్లు బయట చేసే పనులు కష్టపడి సంపాదించినవే. కానీ ఎలాంటి అవినీతికి పాల్పడరు. రియల్ ఎస్టేట్ కానీ.. చిట్టీలు కానీ న్యాయంగానే చేస్తుంటారు. అయితే పాఠశాలల్లో విద్యాబోధన నిర్లక్ష్యం చేస్తున్నారన్న దానిపై మాత్రం చర్యలు తీసుకోవచ్చు.కానీ ఆస్తుల లెక్కలు చెప్పాలనడమే ఇప్పుడు దుమారం రేపుతోంది.

ఒక్క ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఉద్యోగ విధులను నిర్లక్ష్యం చేసి బయట దందా చేసి పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టాడని అందరినీ అలా అనుకోవడం పొరపాటే. ఇదే విద్యాశాఖకు కోపం వచ్చింది. వెంటనే ఆస్తుల ప్రకటించాలని హుకూం జారీ చేసింది. విద్యార్థులకు పాఠాలు బోధించడమే ఉపాధ్యాయుల విధి. అవినీతికి పాల్పడే, ప్రజలను పీడించి సొమ్ము చేసుకునే అవకాశం లేని ఉద్యోగం వారిది. ఒకవేళ విధులు నిర్వహించడంలో నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంది. అట్లాకాకుండా ఉపాధ్యాయులపై కక్ష కట్టినట్లుగా ఆదేశాలు జారీ చేయడం అన్యాయం.

ఉపాధ్యాయులు విద్యావంతులు. మేధావులు. సమాజాన్ని చైతన్యవంతం చేయడంలో వారి పాత్ర క్రియాశీలకం. తెలంగాణ ఉద్యమంలో, స్వరాష్ట్ర సాధనలో ఉపాధ్యాయుల పాత్ర మరువలేనిది. ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, అవినీతి, అరాచకాలతో రాష్ట్రం అథో:గతి పాలవుతుంటే విద్యావంతులైన ఉపాధ్యాయ లోకం ప్రశ్నిస్తోంది. ఉద్యోగ, ఉపాధ్యాయ వ్యతిరేక విధానాలపై పోరాడుతూ నిలదీస్తోంది.

రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలవల్ల రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై ప్రజలను చైతన్యం చేస్తుంటే జీర్ణించుకోలేని కేసీఆర్ టీచర్లపై కక్ష కట్టినట్లుగా వ్యవహరిస్తున్నారు. 317 జీవో పేరుతో స్థానికతతో సంబంధం లేకుండా టీచర్లను బదిలీ చేస్తూ ఆయా కుటుంబాలను చెట్టుకొకరు పుట్టకొకరుగా వేరు చేశారు. పాత జీవోలను తెరమీదకు తెస్తూ టీచర్లు వేధిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.

టీచర్లను వేధించేందుకే ఈ ఆదేశాలిచ్చినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఉపాధ్యాయుల ఆస్తుల లెక్క కోరుతున్న ప్రభుత్వం ముందుగా సీఎంతో సహా మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆస్తుల లెక్కలు ముందుగా ఇవ్వాలి. 2014 లో ఈ ప్రభుత్వం రాకముందు టీఆర్ఎస్ నాయకుల ఆస్థులు, నేడు వాళ్ల ఆస్తుల్ని ముందుగా ప్రకటించాలి.

అయితే టీచర్లు తమ విధులను నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసుకోవచ్చు. కానీ వారు మాత్రమే అవినీతిపరులు అని ఫోకస్ చేయడమే ప్రభుత్వం చేస్తున్న అతిపెద్ద తప్పు. రాష్ట్రంలో అత్యంత అవినీతిమయమైన శాఖ ఏదైనా ఉందటే అది ‘రెవెన్యూశాఖ’నే. ముఖ్యంగా భూలావాదేవీలు జరిగే రిజిస్ట్రేషన్ , తహసీల్దార్ ఆఫీసులు అవినీతికి అడ్డాగా ఆరోపణలున్నాయి. ఇక్కడ అటెండర్ ఆస్తులు చెక్ చేసినా కోట్లలో ఉంటాయి. ఇదే కాదు.. మిగతా శాఖల్లోనూ డైరెక్టుగా లంచాలు తీసుకుంటారు. కోట్లకు పడగలెత్తుతారు. వేల కోట్ల అవినీతి జరుగుతుందన్న ఆరోపణలున్న శాఖలపై ఈ ప్రభుత్వం ఎందుకు దృష్టిపెట్టలేదు. ఆ అవినీతిలో ప్రభుత్వ పెద్దలకు వాటాలు అందుతున్నాయన్న విమర్శలకు ఏం సమాధానం చెబుతారని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. మీకు దమ్ముంటే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మీ పార్టీ నాయకుల ఆస్థుల వివరాలను ముందుగా ప్రకటించాలన్న డిమాండ్ వినిపిస్తోంది.

ఇక ఉపాధ్యాయులపై కేసీఆర్ సర్కార్ కోపానికి ప్రధాన కారణం ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతలు చేపట్టాలని టీచర్లు ఉద్యమకార్యాచరణకు సిద్ధం కావడమే. ఉద్యమాన్ని నిర్వీర్యం చేయడానికే సర్కార్ ఇలాంటి నిర్ణయం తీసుకుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఉపాధ్యాయులతో పెట్టుకున్న ప్రభుత్వాలు మనుగడ సాగించలేవన్న చరిత్రను గుర్తుచేసుకుంటే మంచిది. మిగతా ఉద్యోగులందరినీ వదిలేసి వేలల్లో సంపాదించే టీచర్లపై ప్రభుత్వం పడడమే వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకునేలా చేసింది. ప్రజా సేవలు జరిగే శాఖల అధికారులను వదిలిపెట్టి టీచర్లను ఆస్తుల లెక్కచూపాలనడమే వివాదానికి కారణమైంది. ప్రభుత్వ ఉద్యోగులందరినీ ఈ లెక్కలు చెప్పమంటే తెలంగాణ ప్రభుత్వం చేసిన పనికి ఓ సార్థకత ఉంటుంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular