Homeజాతీయ వార్తలుSeptember 17 In Telangana: సెప్టెంబర్ 17: తెలంగాణలో నర మేధ గాథ.. రజాకార్ల పాలనలో...

September 17 In Telangana: సెప్టెంబర్ 17: తెలంగాణలో నర మేధ గాథ.. రజాకార్ల పాలనలో వెలుగులోకి రాని వాస్తవాలెన్నో?

September 17 In Telangana: కొందరు వీలినమంటున్నారు. ఇంకొందరు విమోచనమంటున్నారు. మరికొందరు విద్రోహం అంటున్నారు. పేర్లు ఎలా ఉన్నా రజాకార్ల హింస, దౌర్జన్యం, దోపిడీ మాత్రం ఒక్కటే. “ఓ నిజాము పిశాచమా.. కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడూ” అని ఆనాటి రోజుల్లోనే దాశరధి కృష్ణమాచార్య తన కవితలతో నిజాం అరాచకాలను ఎండగట్టారు. స్వాతంత్రానికి ముందు భారత దేశం ఆంగ్లేయుల పద ఘట్టనల కింద నలిగితే.. తెలంగాణ ప్రాంతం మాత్రం రజాకార్ల అరాచకాలతో అట్టుడికింది. భారత స్వాతంత్రోద్యమం, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం దశాబ్దాల పాటు సమాంతరంగా సాగాయి. జాతీయ ఉద్యమంలో చోటు చేసుకున్న జలియన్ వాలాబాగ్ వంటి వాటికి ఉన్న గుర్తింపు నిజాం రాజ్యంలో జరిగిన దుర్ఘటనలకు చోటు లభించలేదు. గుండ్రంపల్లి, బైరాన్ పల్లి, నెల్లికుదురు, బోనకల్, బ్రాహ్మణపల్లి వంటి వందలాది గ్రామాలను నాటి రోజుల్లో నిరంకుశ నిజాం జలియన్ వాలాబాగులుగా మార్చేశాడు. నిజాం సైన్యంలో పనిచేసే రజాకార్లు వందలాది మంది అమాయకులైన ప్రజలను హత్య చేశారు. కొంతమందిని బతికి ఉండగానే చితిపై పడుకోబెట్టి కాల్చేశారు. పెళ్లయిన మహిళలను, యువతులను చిత్రవధ చేశారు. చివరికి 1948 సెప్టెంబర్ 17న భారత యూనియన్ ప్రభుత్వం చేపట్టిన సైనిక చర్యతో హైదరాబాద్ సంస్థానం భారత్ లో కలిసిపోయింది. ఈ క్రమంలో లక్షలాది మంది ప్రజలు అసువులు బాశారు. చారిత్రాత్మకమైన సాయుధ పోరాటానికి, భారత్ లో హైదరాబాద్ కలిసిన సెప్టెంబర్ 17 కు స్వార్థపూరిత రాజకీయాల వల్ల తగిన గుర్తింపు రాలేదు.

September 17 In Telangana
September 17 In Telangana

-ఒక్కోటి ఒక్కో జలియన్ వాలాబాగ్
నిజాం రాజ్యంలోని జలియన్ వాలా బాగ్ ఘటనల్లో గుండ్రంపల్లి ఒకటి. ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా చిట్యాల మండలం గుండ్రంపల్లి లో రజాకార్లు రక్తపుటేర్లు పారించారు. ఖాసీం రజ్వీ కి అత్యంత సన్నిహితుడైన మక్బూల్ ఈ గ్రామంలో ఎన్నో దురాగతాలకు పాల్పడ్డాడు. దీంతో ఆ గ్రామస్థులంతా ఏకమై తిరగబడ్డారు. గ్రామస్థుల ధాటికి పారిపోయిన మక్బూల్ రజాకార్ల మూకలతో తిరిగివచ్చి గ్రామం మీద పడ్డాడు. 200 మంది గ్రామస్తులను హతమార్చి సమీపంలోని బావిలో పడేశారు. వందమంది మహిళల పుస్తెలు తెంపుకొని ఎత్తుకెళ్లిపోయారు.

Also Read: CM Jagan- Amaravati: అమరావతి.. జగన్ పాలనలో జీవిత కాలం లేటే..

అలాగే తెలంగాణ విమోచన పోరాటంలో నెల్లికుదురు, బైరాన్ పల్లి, బోనకల్ గ్రామాల వీరత్వం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ గ్రామాల్లో గ్రామ రక్షక దళాలను ఏర్పాటు చేసుకొని గ్రామస్తులు బురుజులు కట్టుకున్నారు. బురుజులపై నగరా మోగిస్తూ రజాకార్లతో పోరాటాలు చేశారు. ఒకసారి బైరాన్ పల్లి పక్క గ్రామం లింగాపూర్ పై రజాకార్లు దాడి చేసి ధాన్యాన్ని ఎత్తుకెళుతుండగా బైరాన్ పల్లి వాసులు అడ్డుకొని ఎదురు దాడి చేశారు. దీంతో గ్రామస్తులపై కక్ష కట్టిన రజాకార్లు మొదటిసారి 60 మందితో, మరొకసారి 150 మందితో దాడికి యత్నించి పలాయనం చిత్తగించారు. ప్రతీకారేచ్చతో రగిలిపోయిన రజాకార్లు 400 మంది సైన్యంతో, మారణాయుధాలతో ఊరిపై పడ్డారు. మహిళలు, యువతులు, అన్న తేడా లేకుండా కనిపించిన వారిని కనిపించినట్టే కాల్చి చంపారు. మహిళలను బలాత్కరించారు. విల్లంబులు, కత్తులు, గొడ్డళ్ళతో ఎదురు తిరిగిన బైరాన్ పల్లి గ్రామ రక్షక దళం సభ్యులు మొత్తం 108 మంది వీర మరణం పొందారు. ఆనాటి వీరోచిత పోరాటాలకు బైరాన్పల్లి బురుజు ఇప్పటికీ సాక్ష్యంగా నిలిచి ఉంది.

బోనకల్ మండలం లో రజాకార్లకు ఎదురు తిరిగిన పాపానికి ఒకే చితిపై ఏడుగురు సాయుధ రైతాంగ పోరాట వీరులను బతికి ఉండగానే పడుకోబెట్టి సజీవ దహనం చేశారు. నేటికీ గ్రామ సరిహద్దుల్లో ఆ అమరుల స్తూపం నాటి దురాగతానికి నెత్తుటి గుర్తుగా ఉంది. 1947 సెప్టెంబర్ 2న హైదరాబాద్ సంస్థానాన్ని భారత్లో విలీనం చేయాలంటూ నినదించిన పరకాల గ్రామస్తులపై రజాకార్లు, సైనికులు చేసిన దాడిలో 19 మంది మరణించారు. మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు.

జల్ – జమీన్- జంగల్ కోసం పోరాడిన రాంజీ గోండు తో పాటు అతని వెయ్యి మంది అనుచరులను నిర్మల్ లోని మర్రిచెట్టుకు ఉరితీసారు. ఆ మర్రి గోండ్ మర్రి, వెయ్యి ఊర్ల మర్రిగా ప్రసిద్ధి చెందింది. అమరచింత సంస్థానం పరిధిలోని అప్పంపల్లి పరిసర గ్రామాలైన నెల్లికొండ, వడ్డేమాన్, దాసరపల్లి, లంకాల, అమరచింత తదితర గ్రామాలకు చెందిన రెండువేల మంది ఉద్యమకారులపై నిజాం పోలీసులు కాల్పులు జరపడంతో 11 మంది మరణించారు. 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. భువనగిరి సమీపంలోని రేణికుంటపై 1948 మార్చి 4న నిజాం పోలీసులు, రజాకార్ మూకలు ఈ తెగబడ్డారు. వారిని ఆ గ్రామస్తులు ప్రతిఘటించగా ఆ పోరాటంలో 26 మంది గ్రామస్తులు అమరులయ్యారు. పన్నుల విధానంపై గొంతెత్తిన పాతర్ల పహాడ్ వాసులను నిజాం పోలీసులు ఊచకోత కోశారు. ఈ దారుణంలో 17 మంది అమరులయ్యారు. జనగాం సమీపంలోని కాట్కొండ లో రజాకార్ల బలవంతపు వసూళ్ళను అడ్డుకున్న 13 మందిని కాల్చి చంపారు. కూటి గల్ లో 1948 ఆగస్టు 25న 23 మంది సాయుధ రైతాంగ పోరాట సభ్యులను కాల్చి చంపారు.

September 17 In Telangana
September 17 In Telangana

1935 నుంచి 1947 మధ్యన, మరి ముఖ్యంగా 1947 ఆగస్టు నుంచి 1948 సెప్టెంబర్ వరకు ఇలాంటి హింసాత్మక ఘటనలు వందలాదిగా జరిగాయి. జలియన్ వాలా బాగ్ ఘటన అనూహ్యంగా జరిగింది. కానీ నాటి హైదరాబాద్ సంస్థానంలో 13 నుంచి 14 ఏళ్ల పాటు వ్యవస్థీకృతంగా తెలంగాణ పౌరులపై రక్తపాతం జరిగింది. సర్దార్ పటేల్ చేపట్టిన పోలీస్ యాక్షన్ తో దేశానికి స్వాతంత్రం లభించిన 13 నెలల తర్వాత 1948 సెప్టెంబర్ 17న ఈ ప్రాంతం నిజాం పీడ నుంచి, రజాకార్ల అకృత్యాలనుంచి విముక్తి పొంది స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంది.

-మొదటినుంచి వివక్ష
సెప్టెంబర్ 17న తెలంగాణ భారత్ యూనియన్లో విలీనం అయినప్పటి నుంచి ఇప్పటిదాకా అధికారికంగా ఎటువంటి ఉత్సవాలు నిర్వహించలేదు. తెలంగాణతో పాటే, కర్ణాటక, రాష్ట్ర ప్రాంతాలు ఇండియన్ యూనియన్ లో విలీనం అయ్యాయి. కానీ ఆ ప్రాంతాలు సెప్టెంబర్ 17న ఉత్సవాలు జరుపుకుంటాయి. తెలంగాణలో ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీ ఓట్లు చీలిపోతాయని భావించి ఏనాడు కూడా ఉత్సవాలు జరపలేదు. టిడిపి కూడా అధికారంలో ఉన్నన్ని రోజులు ఆ మాటే ఎత్తలేదు. 2014లో అధికారంలోకి వచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితి కూడా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పక్కన పెట్టింది. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ విమోచన దినోత్సవానికి సంబంధించి పదేపదే అప్పటి ప్రభుత్వాలపై విమర్శలు చేసిన కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వంటి వారు.. అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చడం గమనార్హం. సరే ఇప్పుడు విమోచనం, విలీనం, విద్రోహం అని రాజకీయ నాయకులు రకరకాలుగా మాట్లాడుతున్నారు. కానీ నాటి నిజాం దురాగతాలకు బలైన అమరవీరుల నెత్తుటి సాక్షిగా తెలంగాణ అనేది ఒక రగల్ జెండా.. అది నిజామును తరతరాల బూజుగా అభివర్ణించి తరిమికొట్టింది. ఇవేవీ చరిత్రలో లేకపోవచ్చును. కానీ నేటికీ ఆ భౌతిక సాక్ష్యాధారాలు అలాగే ఉన్నాయి.

Also Read: Bigg Boss 6 Telugu: హోస్ట్ నాగార్జునకు దారుణమైన అవమానం… ఇలా జరుగుతుందని ఆయన కూడా ఊహించి ఉండరు

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular