Homeప్రత్యేకంTANA Meeting: అమెరికాలో తెలుగోళ్లకు ఏమిటీ తెగులు?

TANA Meeting: అమెరికాలో తెలుగోళ్లకు ఏమిటీ తెగులు?

TANA Meeting: అమెరికా అంటే డాలర్ల కొలువు. అవకాశాల నెలవు. అందుకే ఏటా ఇండియా నుంచి చాలామంది వెళ్తూ ఉంటారు. ఇందులో రకరకాల నేపథ్యాలకు చెందిన ప్రజలు ఉంటారు. వీరిలో అక్కడ చాలామందికి సంఘాలు ఉన్నాయి. ఈ జాబితాలో తెలుగు వారికి ప్రత్యేకమైన స్థానం ఉంది. పైగా అక్కడి వారికి తెలుగు వారంటే విపరీతమైన గౌరవం ఉంటుంది. అక్కడి సమాజం హర్షించే విధంగా తెలుగు వారు హుందాగా ఉంటారు. తమకున్న తెలివితేటల తో అందరికంటే విభిన్నంగా ఉంటూ ప్రతిభ చూపుతున్నారు. అమెరికా లోని పెద్దపెద్ద నగరాల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా తెలుగువారు అంటే ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఉంటుందంటే అతిశయోక్తి కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి ఆ స్థాయిలో లేదు. దీనికి కారణం అమెరికన్లు కాదు. మన వాళ్ళే. మితి మీరిన ప్రవర్తనతో పరువు, ప్రతిష్ఠలకు భంగం కలిగించుకుంటున్నారు. ఇది ఒక రకంగా ప్రవాస తెలుగు వారిపై హేయ మైన భావం కలగజేస్తోంది.

బాగానే ఉంటున్నారు.. కానీ

అమెరికా వెళ్ళిన తొలి నాళ్ళల్లో తెలుగు వారు బాగానే ఉంటున్నారు. వృత్తి నైపుణ్యాలు, ఉద్యోగాల్లో అనితర సాధ్యమైన ప్రతిభను చాటుతున్నారు. వారిలో కొందరు కంపెనీలు కూడా ప్రారంభించారు. వాటిని విజయవంతంగా నడిపిస్తున్నారు. ఇదే సమయంలో వారు డబ్బు సంపాదనతోనే ఆగిపోవడం లేదు. ప్రదర్శనకు తహ తహ లాడుతున్నారు. అమెరికన్ల లాగా వీకెండ్ పార్టీ కల్చర్ ను బాగా ఒంట బట్టించుకుంటున్నారు. డాబు, దర్పం విపరీతంగా ప్రదర్శిస్తున్నారు. వీరిలో కొంతమంది రియల్ ఎస్టేట్, హోటల్ బిజినెస్ చేస్తున్నారు. ఈస్ట్ కోస్ట్, టెక్సాస్ లాంటి రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం తెలుగు వాళ్ల చేతుల్లోనే ఉందంటే అతిశయోక్తి కాదు.
ఇది ఇప్పుడు ఆ స్థాయి కూడా దాటి పోయింది. అక్కడ సంపాదించిన డబ్బుతో ఇక్కడ రాజకీయాల వైపు తొంగి చూసే స్థాయికి వారు ఎదిగారు. తమ సామాజిక సమీకరణాల ఆధారంగా హఠాత్తుగా ఇక్కడికి వచ్చి అసెంబ్లీకి, పార్లమెంటుకు పోటీ చేయడం పరిపాటయింది.. దీనినే అక్కడ “హెలికాప్టర్ క్యాండిడేట్స్” అని చెప్పుకుంటారు..

ఓ పార్టీకి పండగే

ఇలాంటి ప్రవాస తెలుగు వాళ్ళంటే తెలుగుదేశం పార్టీకి పండగే పండగ. ఇలాంటి వారైతే ఎన్నికల్లో ఎంతయినా ఖర్చుపెట్టగలరని ఆ పార్టీ నమ్మకం. అందుకే ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రవాస తెలుగు వాళ్ళను రాజకీయాల్లోకి రమ్మని ఆహ్వానిస్తారు. ఇక్కడ వారికి అనేక రకాల “మేళ్ళు” దక్కేలా చూస్తారు. ఇవాల్టికి దేశంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ.. అమెరికా లోని ప్రవాస తెలుగు వాళ్ళ నుంచి అత్యధికంగా ఫండ్స్ ఆ పార్టీకే వస్తున్నాయి. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు ప్రవాసతెలుగు వాళ్ళ మీద టీడీపీ ప్రభావం ఏ విధంగా ఉందో..

ఈవెంట్ మేనేజ్మెంట్ పేరుతో.

ఇదే సమయంలో కొంత మంది ఒక అడుగు ముందు వేసి ఈవెంట్ మేనేజ్మెంట్ పేరుతో ఇండియా నుంచి సెలబ్రిటీలను తీసుకెళ్తున్నారు. అక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కొన్నిసార్లు ఇవి ఎదురు తన్ని అక్కడి పోలీసులకు దొరికి పోయేలా చేసిన సంఘటనలు చాలా ఉన్నాయి. గతంలో షికాగో వేదికగా జరిగిన కార్యక్రమంలో కొందరు పట్టుబడగా.. ఆ ఘటన వల్ల తెలుగు వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. ఫలితంగా వీసా ఇంటర్వ్యూలకు వెళితే అవమానించే పరిస్థితి ఎదురైందని అప్పట్లో కొంతమంది సినీతారలు కామెంట్లు చేయడం చర్చకు దారి తీసింది. ఇక అమెరికాలో ఏ ఈవెంట్ జరిగినా.. రెండుగా చీలిపోవడం పరిపాటయింది. ఇటీవల ఇద్దరు అగ్ర హీరోలకు చెందిన అభిమానులు బాహాటంగానే కొట్టుకున్నారు. అక్కడిదాకా ఎందుకు అమెరికాలో తెలుగుదేశం పార్టీ విభాగంలో 40 , 50 గ్రూపులున్నాయి. వీరిలో ప్రాంతీయ అభిమానం బాగా పెరిగి పోయి కులాల పేరుతో సంఘాలు, హీరోల పేరుతో సంఘాలు ఏర్పాటయ్యాయి.. ఇక ప్రాంతాల వారీగా అయితే అది మరింతగా ముదిరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న జిల్లాల పేరుతో అక్కడ భేటీలు నిర్వహిస్తున్నారంటే ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular